పోటీలో పేదింటి అభ్యర్థులు

ABN , First Publish Date - 2020-11-28T07:23:03+05:30 IST

వారివి నిరుపేద కుటుంబాలు.

పోటీలో పేదింటి అభ్యర్థులు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి) : వారివి నిరుపేద కుటుంబాలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. అలాంటి కొన్ని కుటుంబాలకు చెందిన సభ్యులకు ఆయా పార్టీలు గ్రేటర్‌ ఎన్నికల్లో టికెట్లను ఇచ్చాయి. సాధారణంగా వామపక్ష పార్టీల నుంచి ఇలాంటి వారు ఎక్కువగా ఉంటారు. ఈసారి టీడీపీ నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరికి టికెట్లను ఇచ్చింది. రాంగోపాల్‌పేట నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రేఖ కుటుంబం ఇస్ర్తీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తోంది. అదేవిధంగా బేగంపేట నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఫర్హానా రోజువారి కూలీ. సీపీఎం, సీపీఐలకు చెందిన అభ్యర్థులు గ్రేటర్‌ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ చేస్తుండగా వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారే. ప్రైవేటు ఆస్పత్రిలో శానిటైజర్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న జే.స్వామి సీపీఎం అభ్యర్థిగా రహమత్‌నగర్‌ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్నారు. వడ్రంగి పని చేసుకునే కె.భాగ్యలక్ష్మి చిలుకానగర్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. టీవీ మెకానిక్‌గా పని చేస్తున్న సయ్యద్‌ అలీ ఉప్పుగూడ నుంచి సీపీఐ అభ్యర్థిగా, కారు డ్రైవర్‌ ఆరీఫ్‌ లలితాబాద్‌ డివిజన్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

సమస్యల పరిష్కారానికి కృషి

    మా ఆయన క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మా అన్న ఆటో డ్రైవర్‌. ఏడవ తరగతి వరకు చదువుకున్నా. ఎన్నికల్లో గెలిపిస్తే మా డివిజన్‌ను అభివృద్ధి చేస్తాను. ఇక్కడ ఎన్నో సమస్యలున్నాయి. శ్మశానవాటిక లేదు. పోలీసుల అనుమతి తీసుకుని ఇతర ప్రాంతాలకు దహనవాటికలకు తీసుకెళ్తున్న పరిస్థితి. వాటన్నింటినీ చూస్తూ వెళ్తున్నారే కానీ పరిష్కరించేవారు లేరు.

- ఫర్హనా, బేగంపేట టీడీపీ అభ్యర్థి 

ప్రజలకు సేవ చేసే అవకాశం

    ఎన్నికల్లో గెలిచినవారు వారి ప్రయోజనాలే చూసుకుంటారు. ప్రజలకు సేవ చేయడం లేదు. నగరం నడిబొడ్డున ఉన్న రాంగోపాల్‌పేటలో ఎన్నో సమస్యలున్నాయి. ఓటేసి గెలిపించేది ప్రజలకు సేవ చేయడానికి అనే విషయాన్ని గెలిచినవారు గుర్తించడం లేదు. ఎన్నో ఏళ్లుగా టీడీపీతో అనుబంధమున్న నాకు టికెట్‌ ఇవ్వడం సంతోషంగా ఉంది. సమస్యల పరిష్కారానికి పని చేస్తాను.

- రాంగోపాల్‌పేట టీడీపీ అభ్యర్థి రేఖ

గెలిచినా, గెలవకపోయినా పని చేస్తా

    పేద కుటుంబం నుంచి వచ్చాను. ఈ డివిజన్‌లో ఉన్న సమస్యలపై అవగాహన ఉంది. ప్రజలకు మౌలిక వసతులు ప్రధానం. వాటిపైనే కేంద్రీకరిస్తాను. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. గెలిచినా, గెలవకపోయినా ప్రజల సమస్యల పరిష్కారానికి పని చేస్తాను. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. సమస్యల పరిష్కారానికి కూడా అదేవిధంగా పని చేస్తాను.

- చిలుకానగర్‌ సీపీఎం అభ్యర్థి కె.భాగ్యలక్ష్మీ

Updated Date - 2020-11-28T07:23:03+05:30 IST