పైసా వసూల్‌..

ABN , First Publish Date - 2021-07-28T06:34:57+05:30 IST

పైసా వసూల్‌..

పైసా వసూల్‌..

అటు జీహెచ్‌ఎంసీ ఇటు విద్యుత్‌ శాఖలో అక్రమార్కులు

ప్రజల అవసరాలతో బేరసారాలు

జీహెచ్‌ఎంసీలో పెరిగిన ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్ల అవినీతి

పలు సర్కిళ్లలో పెరిగిన పరిస్థితి అధ్వానం

ఏసీబీకి పట్టుబడిన వారిలో వారే అధికం

విద్యుత్‌ శాఖ ఎస్టిమేషన్లలో గోల్‌మాల్‌

పైసా ఇస్తే ఓకే..

లేకుంటే కనెక్షన్ల మంజూరు నెలల తరబడి జాప్యం


ఇందుగలదు.. అందులేదని సందేహం వలదు.. ఏ కార్యాలయంలో చూసినా అవినీతి గలదు... అన్నట్లు మారింది పరిస్థితి. ఆన్‌లైన్‌తో అవినీతికి అడ్డుకట్ట అంటూ ఉన్నతాధికారుల స్టేట్‌మెంట్లు చెప్పుకోవడానికే బాగుంటున్నాయి. క్షేత్రస్థాయిలో కాసులు సమర్పిస్తే గానీ పనులు జరగడం లేదన్న విషయం వారికి తెలియదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖల్లో జరుగుతున్న ఈ తంతే దీనికి నిదర్శనం.


అధికారులకు ‘లంకె’ బిందె

ఉచిత నీటికి, పీటీఐఎన్‌కు లంకె

పెరిగిన ఆస్తిపన్ను మదింపు దరఖాస్తులు

రేటు కట్టి మరీ వసూలు చేస్తోన్న అవినీతి ఉద్యోగులు


ఆస్తి పన్నుకు ఉచిత నీటికి లంకె.. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, అధికారులకు అదనపు అక్రమార్జన వనరుగా మారింది. పౌరుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని రేటు కట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎంత త్వరగా పని పూర్తవ్వాలంటే అంత ఎక్కువగా సమర్పించుకోవాల్సిందే అని షరతు పెడుతున్నారు. 

హైదరాబాద్‌ సిటీ, జులై 27 (ఆంధ్రజ్యోతి) : మెజార్టీ సర్కిళ్లలో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్ల అక్రమాలు మితిమీరాయి. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ఉచిత నీటి సరఫరా పథకాన్ని ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటిని ఇస్తోంది. ఇందుకోసం నల్లాకు మీటర్‌ ఏర్పాటుతో పాటు ఆధార్‌, ఆస్తిపన్ను నెంబర్‌(పీటీఐఎన్‌)ను వాటర్‌బోర్డులోని కస్టమర్‌ అకౌంట్‌ నెంబర్‌(సీఏఎన్‌)కు అనుసంధానం చేయాలి. పీటీఐఎన్‌ తప్పనిసరి చేయడంతో ఇప్పటి వరకు ఆస్తిపన్ను చెల్లించని భవనాల యజమానులు మదింపు కోసం దరఖాస్తు చేస్తున్నారు. అయితే సిటిజన్‌ చార్టర్‌ ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో పన్ను మదింపు జరగడం లేదు. కొన్ని సర్కిళ్లలో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు అడిగినంత ఇస్తేనే పని జరుగుతుందన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో వీరే అధికంగా ఉంటున్నారు.

పెరిగిన దరఖాస్తులు

గ్రేటర్‌లో 16.80 లక్షల పన్ను చెల్లింపుదారులున్నారు. నల్లా కనెక్షన్‌లు 10.45 లక్షల వరకున్నాయి. ఉచిత నీటిని పొందేందుకు ఇండిపెండెంట్‌ ఇళ్లయినా, అపార్ట్‌మెంట్లయినా పీటీఐఎన్‌ అనుసంధానం చేయాలి. బహుళ అంతస్తుల భవనాలకు సంబంధించి ప్రతీ కుటుంబం ఆధార్‌ వివరాలతో పాటు ఎన్ని ఫ్లాట్ల పీటీఐఎన్‌ అనుసంధానిస్తే అన్ని 20 వేల లీటర్లు ఉచిత నీటి సరఫరా జరుగుతుంది. ఇండిపెండెంట్‌ ఇళ్లకు ఒకే పీటీఐఎన్‌ ఉండనున్న దృష్ట్యా.. ఆ వివరాలు ఇస్తే సరిపోతుంది. ఉచిత నీటికి పీటీఐఎన్‌ తప్పనిసరి చేయడంతో పన్ను మదింపు కోసం ఇటీవల జీహెచ్‌ఎంసీకి దరఖాస్తులు పెరిగాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 9,800 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం నాలుగు నెలల్లో 16,900 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో మెజార్టీ పాత నిర్మాణాలకు సంబంధించినవే అని, కొత్త భవనాల దరఖాస్తులు తక్కువగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 54 వేల పన్ను మదింపు దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ఏడు అప్లికేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. 


అపార్ట్‌మెంట్ల వాసుల అవస్థలు

 అపార్ట్‌మెంట్లలో ఉంటూ ఇప్పటికీ పన్ను మదింపు జరగని ఫ్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెజార్టీ బహుళ అంతస్తుల భవనాల్లో అన్నీ ఫ్లాట్ల వివరాలను ఒకేసారి అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నారు. అసోసియేషన్‌లోని కీలక వ్యక్తులు ఈ బాధ్యతలు తీసుకున్నారు. మిగతా ఫ్లాట్ల యజమానులు పీటీఐఎన్‌ ఇవ్వగా, మదింపు జరగని వారు కొంత ఇబ్బందిగా భావిస్తున్నారు. అందరి ముందు అవమానంగా ఉంటుందని కొందరు వెంటనే దరఖాస్తు చేస్తున్నా నెలల తరబడి ఆలస్యం జరుగుతోంది. వెంటనే పని జరగాలంటే ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌కలెక్టర్లు అడిగినంత ముట్టచెప్పాల్సి వస్తుందని ఉప్పల్‌ సర్కిల్‌కు చెందిన ఓ ఫ్లాట్‌ యజమాని పేర్కొన్నారు. 

కనెక్షన్లు.. కలెక్షన్లు

విద్యుత్‌ శాఖలో ఇదీ తీరు 


శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న నిర్మాణాలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు వేసే కేపిటల్‌ ఎస్టిమేషన్లు అధికారులకు ముట్టజెప్పే లంచాల ఆధారంగా జరుగుతున్నాయి. కొత్త కనెక్షన్లు ఇచ్చే ముందు ఏఈ, ఏడీఈ, డీఈ క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతంలోని విద్యుత్‌ లైన్లపై ఎంత లోడ్‌ పడుతోంది, అదనంగా ఎంత లోడ్‌ వరకూ కొత్త కనెక్షన్లు మంజూరు చేయవచ్చని గుర్తిస్తారు. వాటి ఆధారంగా కొత్త కనెక్షన్లకు ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్‌ రూపొందిస్తారు. ఆ క్రమంలో కొందరు అధికారులు చేతివాటం చూపిస్తున్నారు. వినియోగదారులు ఇచ్చే లంచాన్ని బట్టి ఎస్టిమేషన్లు వేస్తూ వాటిని కార్పొరేట్‌ ఆఫీస్‌కు పంపుతున్నారు.


హైదరాబాద్‌ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకుంటే చాలు, ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేస్తామని  సీఎండీ చెబుతుండగా క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు తాము అడిగింది ఇవ్వకుంటే నెలలకొద్దీ ఆ ఫైల్‌ను పక్కన పెట్టేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, విల్లాలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలంటే ముందుగా కేపిటల్‌ ఎస్టిమేషన్లను క్షేత్రస్థాయి అధికారులు రూపొందించాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్‌ రూ. 15 లక్షలు దాటితే ఆ ఫైల్‌ను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం కమర్షియల్‌ విభాగానికి పంపాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నతాధికారులతో పాటు డైరెక్టర్‌, సీఎండీ ఫైల్‌ను పరిశీలించి అనుమతి  ఇస్తే తప్పా కనెక్షన్లు మంజూరు చేయరు. కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు లంచం తీసుకుని తనిఖీలు చేయకుండానే ఎస్టిమేషన్లు వేస్తూ వాటిని కార్పొరేట్‌ ఆఫీస్‌కు పంపుతున్నారు. అక్కడ కూడా మామూళ్ల తంతు మొదలవుతుంది. అడిగింది ముట్జచెప్పకపోతే, ఫైల్‌ను నెలల తరబడి పక్కన పెట్టి రిమార్క్స్‌ పేరుతో వెనక్కి పంపుతున్నారని కొంతమంది కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.  అధికారుల నిర్లక్ష్యంతో  ఒక్కో ఫైల్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌కు వచ్చి తిరిగి వెళ్లేందుకే 3-4 నెలల సమయం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా సుమారు 12 దరఖాస్తులు కార్పొరేట్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  


ఏసీబీకి చిక్కినా.. 

అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కిన అధికారుల సంఖ్య విద్యుత్‌శాఖలో పెరుగుతోంది. నాలుగు నెలల క్రితం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ డివిజనల్‌ ఇంజనీర్‌ (డీఈ) ఏసీబీకి పట్టుబట్టాడు. సదరు అధికారి 2006లో కూడా సంగారెడ్డిలో ఏడీఈగా పనిచేస్తునప్పుడు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కాడు. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఏటా కొందరు అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు. ఏదో విధంగా మళ్లీ విధుల్లో చేరి అక్రమాలకు పాల్పడుతున్నారు. కోర్టు వివాదాలు, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలకు ట్రాన్స్‌ఫార్మర్ల కేటాయింపులోను, చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లోని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులోను భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 



Updated Date - 2021-07-28T06:34:57+05:30 IST