జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు..

ABN , First Publish Date - 2020-11-01T11:58:27+05:30 IST

మహానగరంలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా, ఇంతా కాదు. ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఉండగా, మరికొన్ని చోట్ల బురద పేరుకుపోయింది. ముంపు ప్రాంతాల్లో తక్షణ ఆర్థిక సహాయం పంపిణీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, దెబ్బతిన్న రహదారుల మరమ్మతు, తెగిన చెరువుల పునరుద్ధరణ,

జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు..

హైదరాబాద్‌ : మహానగరంలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా, ఇంతా కాదు. ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే ఉండగా, మరికొన్ని చోట్ల బురద పేరుకుపోయింది. ముంపు ప్రాంతాల్లో తక్షణ ఆర్థిక సహాయం పంపిణీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, దెబ్బతిన్న రహదారుల మరమ్మతు, తెగిన చెరువుల పునరుద్ధరణ, అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. పనులు పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించి మరీ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రేటర్‌లో 9,013 కి.మీల రహదారులు ఉండగా, 709 కి.మీల మేర రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. మిగతా రహదారుల నిర్వహణ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. ఇటీవలి వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. బల్దియా అధీనంలో ఉన్న రోడ్లలో 83 కి.మీల రోడ్లు పాడైనట్టు గుర్తించారు. వీటి ప్యాచ్‌ వర్క్‌ పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 99 కి.మీల మేర రహదారులను పునర్నిర్మించనున్నారు.


వీటితోపాటు సీఆర్‌ఎంపీలోని 83 కి.మీల రోడ్లలో మొదటి లేయర్‌ బీటీ వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నగరంలోని పలు సర్కిళ్ల పరిధిలో మట్టి రోడ్ల స్థానంలో రూ.204 కోట్లతో 273 కి.మీల మేర నిర్మించనున్న సీసీ రోడ్లకు గతంలోనే ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందులో రూ.80 కోట్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఇటీవల పురపాలక శాఖ  మంత్రి కె. తారకరామారావు ఆదేశాలు జారీచేశారు.


ముంపునకు పరిష్కారంగా...

వరద ముంపునకు పరిష్కారంగా పలు ప్రాంతా ల్లో ప్రతిపాదించిన బాక్స్‌ డ్రెయిన్ల నిర్మాణ పనులనూ వీలైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తున్నారు. రూ.298 కోట్లతో బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. దీర్ఘకాలంగా పెం డింగ్‌లో ఉన్న హుస్సేన్‌సాగర్‌ సర్‌ ప్లస్‌ నాలా పనులను రూ.68 కోట్లతో చేపట్టేందుకు ఉన్నత స్థాయిలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వర్షాలకు కూలిన అజంపురా వంతెనను రూ.3 కోట్లతో పునర్నిర్మిస్తున్నారు.


చెరువుల మరమ్మతు..

గ్రేటర్‌, శివారు ప్రాంతాల్లోని 192 చెరువులను ఇంజనీరింగ్‌ బృందాలు తనిఖీ చేశాయి. వీటిలో ఆరు చెరువులకు గండ్లు పడినట్టు గుర్తించారు. ఈ చెరువుల పునరుద్ధరణకు రూ.41 కోట్లు జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. పాత వంతెనలు, బ్రిడ్జిల నిర్మాణ స్థిరత్వ తనిఖీకి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.


ఇవీ వివరాలు..

జీహెచ్‌ఎంసీ అధీనంలోని దెబ్బత్ని రోడ్లు - 83 కి.మీలు

జీహెచ్‌ఎంసీ అధీనంలోని పునర్నిర్మించే రోడ్లు - 99 కి.మీలు

నిర్మాణ వ్యయం - రూ.52 కోట్లు

సీఆర్‌ఎంపీ రోడ్లు - 83 కి.మీలు

ప్రతిపాదిత సీసీ రోడ్లు - 273 కి.మీలు 

పనులు - 766

అంచనా వ్యయం - రూ.204.36 కోట్లు

ఇందులో తక్షణం చేపట్టే పనుల విలువ - రూ.80 కోట్లు

బాక్స్‌ డ్రెయిన్ల నిర్మాణ వ్యయం - రూ.298 కోట్లు


హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలా పెండింగ్‌ 

పనుల నిర్మాణ వ్యయం - రూ.68 కోట్లు


చెరువుల పునరుద్ధరణ/మరమ్మతు కోసం

జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన నిధులు - రూ.41 కోట్లు

Updated Date - 2020-11-01T11:58:27+05:30 IST