మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూ నియమావళి
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు జరిగే పరోక్ష ఎన్నికలకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎలాంటి క్యాంపులు(శిబిరాలు) నిర్వహించవద్దు. ప్రలోభాలకు గురి చేయవద్దు. ఈ ఎన్నికల సందర్భంగా పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) మార్గదర్శకాలను జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి పరోక్ష ఎన్నిక పూర్తయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుంది.
రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఎవరైనా.. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎలాంటి క్యాంపులు నిర్వహించరాదు.
ప్రజాప్రతినిధులను మభ్యపెట్టేలా లంచాలు ఇవ్వడం/ ప్రలోభపెట్టడం, ప్రభావితం చేయవద్దు.
పార్టీలు జారీ చేసిన విప్‌లకు వ్యతిరేకంగా ఓటు వేసేలా ప్రబావితం చేయరాదు.
పార్టీల విప్‌లను ధిక్కరించే వారికి ప్రోత్సాహకంగా ఎటువంటి పదవిని ఇవ్వచూపరాదు.
అధికారంలో ఉన్న పార్టీ లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు/ అధికారులు ప్రజ్రాపతినిధులకు సర్టిఫికెట్లు, లైసెన్సులు, కాంట్రాక్టు పనులు ఇవ్వడం, పెండింగ్‌లో ఉన్న కేసులను ఎత్తివేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, కాంట్రాక్టులను పునరుద్ధరించడం వంటి చర్యలతో అధికారాన్ని దుర్వినియోగం చేయరాదు.
విచారణ సంస్థలు నేరాలను నమోదు చేయడం లేదా చార్జీషీట్లు దాఖలు, అరె్‌స్టలు, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో పక్షపాతానికి పాల్పడవద్దు.
మేయర్ ఎన్నిక సమయం కోసం నిర్దేశించిన 48 గంటల ముందే ప్రచార కార్యక్రమాలు ముగించాలి. ఎన్నిక పూర్తయ్యే వరకు ఇది అమలులో ఉంటుంది.
నియమావళిని ఉల్లంఘిస్తే... చట్టాలు/ నియమావళి ప్రకారం చర్యలుంటాయి. జీహెచ్ఎంసీ చట్టం-1955 సెక్షన్ 612ను తగిన సమయంలో అనుసరిస్తారు.