27న కౌన్సిల్‌ సమావేశం...!

ABN , First Publish Date - 2021-01-19T07:11:03+05:30 IST

: పదవీకాలం ముగిసేలోపు 2021-22 ఆర్థిక సంవత్సరం ముసాయిదా బడ్జెట్‌పై చర్చించి, ఆమోదించాలని ప్రస్తుత పాలకమండలి భావిస్తోంది.

27న కౌన్సిల్‌ సమావేశం...!

ప్రస్తుత పాలకమండలికి చివరి మీటింగ్‌

2021-22 ముసాయిదా బడ్జెట్‌పై చర్చ

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):  పదవీకాలం ముగిసేలోపు 2021-22 ఆర్థిక సంవత్సరం ముసాయిదా బడ్జెట్‌పై చర్చించి, ఆమోదించాలని ప్రస్తుత పాలకమండలి భావిస్తోంది. మరో 20 రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈనెల 27న కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే వారికి చివరి సమావేశం కానుంది. కౌన్సిల్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం రూ. 5,600 కోట్లతో రూపొందించిన ముసాయిదా బడ్జెట్‌పై చర్చించనున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్‌ని ఆమోదించడమూ ఉంటుంది. ప్రస్తుతం కౌన్సిల్‌లో అధికార టీఆర్‌ఎ్‌సకు పూర్తి బలం ఉంది. 100 మందికిపైగా కార్పొరేటర్లు ఉండగా, ఎంఐఎం కూడా అన్ని అంశాల్లో సహకరిస్తుంది. దీంతో సంస్కరణలు, అభివృద్ధి, ఇతరత్రా అంశాలకు సంబంధించి దాదాపు అన్నీ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇటీవలి ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచిన టీఆర్‌ఎస్‌ ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతుతో మేయర్‌ పీఠం దక్కించుకునే అవకాశముంది. అయితే, ఇప్పటిలా వచ్చే కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానాలు జరిగే అవకాశం లేదు. పరస్పర అవగాహనలో భాగంగా టీఆర్‌ఎస్‌కి ఎంఐఎం సహకరించినా, బీజేపీ వ్యతిరేకించే అవకాశముంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఇప్పుడే ఆమోదించాలని నిర్ణయించారు. పలు అభివృద్ధి పనులు, సంస్కరణలను కూడా ఈ కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించాలని పాలకమండలి పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2021-01-19T07:11:03+05:30 IST