సమస్త సమాచారం ఒకేచోట..!

ABN , First Publish Date - 2021-01-19T07:10:15+05:30 IST

గ్రేటర్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట క్రోడికరించేలా కసరత్తు జరుగుతోంది.

సమస్త సమాచారం ఒకేచోట..!

 జీహెచ్‌ఎంసీలో అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ సెల్‌

ప్రత్యేక విభాగం దిశగా అడుగులు

 పట్టణ ప్రణాళిక, ఐటీ, ఎకనామిక్స్‌ 

అండ్‌ స్టాటిస్టికల్‌ విభాగాల సమన్వయం

 పౌర సంబంధిత వివరాల నుంచి..

మౌలిక సదుపాయాల వరకు

 నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం 

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట క్రోడికరించేలా కసరత్తు జరుగుతోంది. ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎంత మంది ఉంటున్నారు. మురికివాడలెన్ని.. వంటి పౌర సంబంధ వివరాలతోపాటు, రహదారులు, తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ తదితర మౌలిక సదుపాయాల సమాచారాన్ని కూడా సేకరించనున్నారు. పూర్తి వివరాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌  చేసేలా చర్యలు తీసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీలో అర్బన్‌  ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ పేరిట అన్ని వివరాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఐటీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఈ సెల్‌ పని చేస్తుంది. బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగానికి చెందిన సీనియర్‌ అధికారికి ఈ సెల్‌ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే నెల రోజుల్లో విభాగం ఏర్పాటు పూర్తవుతుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. 

మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన.. 

సమాచారంతోపాటు నగర విస్తరణాభివృద్ధికి సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపైనా ఈ విభాగం దృష్టి సారిస్తుంది. మాస్టర్‌ ప్లాన్‌లో ఏముంది, క్షేత్రస్థాయిలో పరిస్థితులేంటి అన్నది ప్రత్యక్షంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. రహదారుల విస్తరణ, వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణ సమయంలో ఆస్తుల సేకర ణ ఏ దశలో ఉంది.. వంటి వివరాలను సేకరిస్తారు. డిజిటల్‌ డోర్‌ నెంబర్ల కేటాయింపు, ఆస్తి పన్ను మదింపు, అనుమతి ఉన్న వ్యాపార సంస్థలు, ఇతర సమాచారాన్ని ఈ సెల్‌ అందుబాటులో ఉంచుతుంది.  


వరదసహాయంలో అక్రమాలపై 

వ్యాజ్యంలో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి

 జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం పంపిణీలో భారీఎత్తున అవకతవకలు జరిగాయని పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ హైకోర్టు సీజేకు రాసిన లేఖను ధర్మాసనం సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులకు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు జనవరి 5న నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. అయితే, ప్రతివాదుల్లో కొందరు కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయకపోవడంతో ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని మరోసారి కోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో స్థాయీ నివేదిక (స్టేటస్‌ రిపోర్టు) ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ ఏ. అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 


Updated Date - 2021-01-19T07:10:15+05:30 IST