ఫిబ్రవరి 15లోపు కొత్త పాలకమండలి..?

ABN , First Publish Date - 2021-01-17T06:33:26+05:30 IST

గ్రేటర్‌ నూతన పాలకమండలి ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది.

ఫిబ్రవరి 15లోపు  కొత్త పాలకమండలి..?

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల 

హైదరాబాద్‌ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ నూతన పాలకమండలి ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. గ్రేటర్‌ రెండో కౌన్సిల్‌ వచ్చే నెల 15వ తేదీలోపు కొలువు దీరనుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన 150 వార్డుల కార్పొరేటర్ల పేర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించింది. నోటిఫికేషన్‌ విడుదలైన అనంతరం 30 రోజుల్లో పాలకమండలి ఏర్పాటు చేయాల్సి ఉండగా, త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయనుంది. ఖరారైన తేదీన మొద ట సభ్యుల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చట్టంలోని వెసులుబాటు ఆధారంగా ఈ సారి మూడు నెలల ముందు ఎన్నికలు జరిగాయి.  ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది ఈ నేపథ్యంలో జనవరి 11 తర్వాత గెజిట్‌ ప్రకటించారు. 

27న కౌన్సిల్‌ సమావేశం..? 

2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను తామే ఆమోదించాలని ప్రస్తుత పాలకమండలి భావిస్తోంది. ఇప్పటికే స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిన నేపథ్యంలో నెలాఖరుకు కౌన్సిల్‌లో గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే 27న సాధారణ సమావేశం నిర్వహించి, పద్దు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.

పీఠం ఎవరిది..?

 గ్రేటర్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అధికార టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్‌-2 స్థానాలు దక్కించుకున్నాయి. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించిన రోజు ఏ పార్టీకి ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంటే ఆ పార్టీ కార్పొరేటర్‌ మేయర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 56 మంది కార్పొరేటర్లు 35 మందికిపైగా ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతు ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ బల్దియా పీఠాన్ని మరోసారి దక్కించుకునే అవకాశముంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా పార్టీతో కలిసి మేయర్‌, డిప్యూటి మేయర్‌ ఎన్నికకు వెళ్తుందా..? స్వంత బలంతోనా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

Updated Date - 2021-01-17T06:33:26+05:30 IST