విధులకు రాకున్నా వేతనాలు..!

ABN , First Publish Date - 2021-01-08T06:52:25+05:30 IST

జీహెచ్‌ఎంసీలోని స్వచ్ఛ భారత్‌ మిషన్‌

విధులకు రాకున్నా వేతనాలు..!


జీహెచ్‌ఎంసీ ఎస్‌బీఎంలో వింత పరిస్థితి

ఆ ఉద్యోగుల రూటే సెపరేటు

నెలకు మూడు, నాలుగు రోజులు వస్తే మహా ఎక్కువ

అయినా పట్టని అధికారులు

ఉన్నత స్థాయి సిఫారసు నియామకాలు కావడమే కారణం

ఈ నెలతో ముగియనున్న గడువు

మరి కొన్నాళ్లు పొడిగించే ప్రయత్నం


హైదరాబాద్‌ సిటీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీలోని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పనితీరు అధ్వానంగా ఉంది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో కొంత మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.  వారు విధులకు హాజరైనా.. కాకున్నా.. పెద్ద వాళ్ల ఆబ్లిగేషన్‌ కావడంతో ఠంచనుగా వేతనాలు చెల్లిస్తున్నారు. కొన్ని నెలలుగా వారు పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావడం లేదు. అయినా అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఎందుకు రావడం లేదని అడిగే సాహసం కూడా చేయలేకపోతున్నారు. కారణం.. ఉన్నత స్థాయి సిఫారసుతో వారిని విధుల్లోకి తీసుకోవడమే. ఇప్పుడీ అంశం సంస్థలో చర్చనీయాంశమైంది. కీలకమైన విభాగాల్లో కూడా విధులకు రాకుండా ఉండడం హాట్‌ టాపిక్‌ అయింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో టాప్‌-5లో గ్రేటర్‌ ఉండేలా  పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఇటీవల పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులకు సూచించారు.  మరి అధికారుల తీరు ఇలా ఉంటే ర్యాంక్‌ ఎలా సాధ్యం..?


నెలలో మూడు, నాలుగు రోజులు...

ఆరు నెలల క్రితం స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో పని చేసేందుకు ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్లు, ప్రాజెక్టు ఆఫీసర్లుగా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఐదుగురిని విధుల్లోకి తీసుకున్నారు. వారి హోదాను బట్టి రూ.30 వేల నుంచి రూ.61 వేలు వేతనం చెల్లిస్తున్నారు. సంస్థలోని ఉన్నత స్థాయి వ్యక్తి సూచన మేరకు ఆ ఐదుగురికి ఉపాధి కల్పించినట్టు చెబుతున్నారు. స్వచ్ఛతకు సంబంధించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణ ఎలా ఉంది..? రోడ్ల పక్కన చెత్త వేయకుండా తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయా..? అన్నది పర్యవేక్షించడంతోపాటు తడి, పొడి చెత్త వేరు చేయడం, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పౌరుల పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించాలి. దాంతోపాటు ఆఫీస్‌ వర్కు చేయాల్సి ఉంటుంది. తీరిక లేని పని ఉండే విభాగంలో విధులు నిర్వహించే ఐదుగురిలో ఒకరిద్దరు మాత్రమే క్రమం తప్పకుండా కార్యాలయానికి వస్తారు. మరో ముగ్గురు నెలలో మూడు నుంచి ఐదు రోజులు వస్తే మహా ఎక్కువని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తి సిఫారసు నియామకాలు కావడంతో వేతనాల చెల్లింపులో కోత విధించేందుకూ అధికారులు జంకుతున్నారు. ఆ ఉద్యోగులు విధులకు రాని విషయాన్ని ఉన్నత స్థాయి వ్యక్తి దృష్టికి తీసుకెళ్లినా.. జీహెచ్‌ఎంసీ సొమ్ము ఎంత మంది తినడం లేదు. అంత సీరియస్‌ తీసు కోవద్దని చెప్పినట్టు సమాచారం. ఆరు నెలల కాలానికి స్టాండింగ్‌ కమిటీ ఆమోదంతో వారిని తాత్కాలికంగా విధుల్లోకి తీసుకున్నారు. జనవరితో వారి గడువు ముగియనుండగా... స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే మొదలైన నేపథ్యంలో మరి కొన్ని నెలలపాటు వారి సేవలు పొడిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. 


Updated Date - 2021-01-08T06:52:25+05:30 IST