బోగస్‌ హాజరు..

ABN , First Publish Date - 2021-04-11T06:40:16+05:30 IST

జీహెచ్‌ఎంసీలో సింథటిక్‌ వేలిముద్రల హాజరు మళ్లీ కలకలం రేపుతోంది.

బోగస్‌ హాజరు..

జీహెచ్‌ఎంసీలో మళ్లీ సింథటిక్‌ కలకలం

పలు సర్కిళ్లలో వినియోగం..? 

విధులకు రాని కార్మికులకు హాజరు

పట్టించుకోని ఉన్నతాధికారులు

గతంలో రెడ్‌ హ్యాండెడ్‌గా 

పట్టుకున్న విజిలెన్స్‌ 

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలో సింథటిక్‌ వేలిముద్రల హాజరు మళ్లీ కలకలం రేపుతోంది. పలు సర్కిళ్లలో నకిలీ వేలిముద్రలతో కొందరు ఎస్‌ఎఫ్‌ఏ  (శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌)లు పారిశుధ్య కార్మికుల హాజరు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపుర్‌, అంబర్‌పేట, సికింద్రాబాద్‌, గాజులరామారం, మలక్‌పేట, కార్వాన్‌, చాంద్రాయణగుట్ట తదితర సర్కిళ్లలో సింథటిక్‌ వేలి ముద్రల వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపుర్‌ సర్కిల్‌లో గాయపడి నాలుగైదు రోజులుగా ఇంటికే పరిమితమైన ఓ కార్మికురాలికి స్థానిక ఎస్‌ఎఫ్‌ఏ రోజూ హాజరు వేస్తున్నారు. అంబర్‌పేట సర్కిల్‌లో మూడు గ్రూపులు ఉన్న ఓ ఎస్‌ఎ్‌ఫఏ ఆరుగురు కార్మికులు విధులకు రాకున్నా, హాజరు వేస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. సింథటిక్‌ వేలిముద్రల హాజరు విషయంలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఇంతటి ధైర్యం చేస్తున్నారా, వారి వెనుకున్నది ఎవరు, ఎవరెవరికి ప్రయోజనం ఉందన్నది చర్చనీయాంశంగా మారింది.  


రెడ్‌ హ్యాండెడ్‌గా...

గ్రేటర్‌లో 18 వేల మందికిపైగా పారిశుధ్య కార్మికులు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారు. వీరిలో వాస్తవంగా ఉన్నది ఎంత మంది, విధులకు హాజరయ్యేది ఎందరు అన్న దానిపై మొదటినుంచీ అనుమానాలు ఉన్నాయి. మెజార్టీ డివిజన్లలో క్షేత్రస్థాయిలో కార్మికులు లేకున్నా, ఉన్నట్టుగా చూపి వారి వేతనాలను కొందరు అధికారులు, ఎస్‌ఎ్‌స(శానిటరీ సూపర్‌వైజర్‌), ఎస్‌ఎ్‌ఫఏ, స్థానిక ప్రజాప్రతినిధులు వాటాలు పంచుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు నిర్వహించిన తనిఖీలు, పరిశీలనల్లో ఈ విషయం రుజువైంది. దీంతో బోగస్‌ కార్మికుల హాజరుకు చెక్‌ పెట్టేలా బయో మెట్రిక్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కొందరు సింథటిక్‌ వేలిముద్రలు తయారు చేసి హాజరు వేశారు. ఫిర్యాదులు అందడంతో 2019 జనవరిలో జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగంలోని విజిలెన్స్‌ అధికారులు స్పందించారు. 12 ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించిన విజిలెన్స్‌ బృందాలు 84 మంది సింథటిక్‌ వేలి ముద్రలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. 


ఈవీడీఎం.. ఆరంభ శూరత్వమే...

విజిలెన్స్‌ అధికారులు సింథటిక్‌ వేలిముద్రల బాగోతాన్ని వెలికి తీసి రెండేళ్లయ్యింది. అప్పట్లో తనిఖీలు, కేసులంటు హంగామా చేసిన అధికారులు, అనంతరం ఆ విషయాన్ని విస్మరించారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తొమ్మిది మంది ఎస్‌ఎ్‌ఫఏలు, బోగస్‌ హాజరు ద్వారా వచ్చే వేతనాల నుంచి ఎవరెవరికి ఎంత ముట్టజెప్తామన్నది విజిలెన్స్‌ అధికారులకు వివరించారు. ఏఎంఓహెచ్‌లు, ప్రజాప్రతినిధుల అండ ఉన్నట్టు గుర్తించామని అంతర్గత సంభాషణల్లో అధికారులు అంగీకరించారు. తరువాత ఏమైందో ఏమో కానీ, సింథటిక్‌ వేలి ముద్రల కేసు పక్కదారి పట్టింది. ఆరోపణలున్న ఏఎంఓహెచ్‌ల నుంచి విజిలెన్స్‌ అధికారులు కనీస సమాచారం కూడా రాబట్టకపోవడం గమనార్హం. ఎంత సేపు కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందిని బుద్ధభవన్‌లోని కార్యాలయానికి పిలిచి నయానో, భయానో సమాచారం తీసుకుంటోన్న విజిలెన్స్‌ విభాగం, సంస్థలోని ఉన్నతాధికారుల జోలికి వెళ్లకపోవడం అనుమానాలకు తావిస్తోంది.  


ఎస్‌ఎ్‌ఫఏపై చర్యలేవి?

కుత్బుల్లాపూర్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): నకిలీ వేలి ముద్రలు వినియోగించి పారిశుధ్య కార్మికులకు హాజరు వేస్తూ, డబ్బులు దండుకుంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లోని ఓ ఎస్‌ఎ్‌ఫఏపై  చర్య లు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. సదరు ఎస్‌ఎ్‌ఫఏ ఇంకా విధులకు హాజరవుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఇదే ఎస్‌ఎ్‌ఫఏ గతంలో కూడా నకిలీ వేలిముద్రలను వినియోగించాడనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు బయోమెట్రిక్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని విధుల నుంచి కొన్ని రోజులు తొలగించా రు. అనంతరం పైరవీలతో పాటు పలు ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు మళ్లీ అతన్ని విధుల్లోకి తీసుకుని బయోమెట్రిక్‌ యంత్రాన్ని అప్పగించారు.  గతంలో  అవకతవకల కు పాల్పడినప్పుడే అధికారులు తగిన చర్యలు తీసుకుని ఉంటే పదే పదే తప్పు చేసే అవకాశం ఉండేది కాదని అంటున్నారు. నకిలీ వేలిముద్రలపై ఆంధ్రజ్యోతిలో ‘మళ్లీ తెరపైకి నకిలీ వేలిముద్రల బాగోతం’  శీర్షికన కథనం ప్రచురితమైంది. ఓ కార్మికురాలి కాలు మడమ వద్ద ఎముక విరిగి ఇంట్లోనే ఉంటున్నా, నాలుగు రోజులుగా హాజరు వేస్తున్నారని కథనం ప్రచురితమైంది. దీంతో సదరు కార్మికురాలే సమాచారం ఇస్తోందని అనుమానించిన ఎస్‌ఎ్‌ఫఏ ఆమెను తీవ్రంగా దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.  


డీసీ దృష్టికి తీసుకెళ్లాం

ఎస్‌ఎ్‌ఫఏపై ఆరోపణలను డీసీ దృష్టికి తీసుకెళ్లాం. విచారణ జరపాలని ఆదేశించారు. త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

భానుచందర్‌, ఇన్‌చార్జి ఏఎంవోహెచ్‌, 

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌

Updated Date - 2021-04-11T06:40:16+05:30 IST