ట్రావెలర్స్‌ కాదు స్మగ్లర్స్‌

ABN , First Publish Date - 2022-04-08T18:04:27+05:30 IST

నీట్‌గా డ్రెస్సింగ్‌, ట్రావెల్‌ బ్యాగులు. వారిని చూస్తే విహారానికి వెళ్తున్న యాత్రికు ల్లా కనిపిస్తారు. విశాఖ నుంచి వయా హైదరాబాద్‌ మీదుగా

ట్రావెలర్స్‌ కాదు స్మగ్లర్స్‌

విశాఖ నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా 

గజియాబాద్‌ ముఠా ఆట కట్టు 

రూ.12.80 లక్షల సొత్తు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ: నీట్‌గా డ్రెస్సింగ్‌, ట్రావెల్‌ బ్యాగులు. వారిని చూస్తే విహారానికి వెళ్తున్న యాత్రికు ల్లా కనిపిస్తారు. విశాఖ నుంచి వయా హైదరాబాద్‌ మీదుగా ఢిల్లీకి వెళ్లడానికి నగరంలో దిగారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన రాచకొం డ పోలీసులు ఆరా తీయగా గంజాయి, హాషిష్‌ ఆయిల్‌ స్మగ్లర్లుగా తేలింది. గజియాబాద్‌కు చెందిన నలుగురిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. రెండు కేజీల చొప్పున ప్యాకింగ్‌ చేసి ఆరు బ్యాగుల్లో సర్దిన 52 కేజీల (26 ప్యాకెట్స్‌) గంజాయి, హాషిష్‌ ఆయిల్‌, నాలుగు ఫోన్లు మొత్తం రూ.12,80,750 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌ ఎం. భగవత్‌ గురువారం వివరాలు వెల్లడించారు. 


రాజస్థాన్‌కు చెందిన విజయ్‌ బతుకుదెరువు కోసం విశాఖపట్నం వెళ్లి అక్కడే ఉండిపోయాడు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గంజాయి సరఫరాదారులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన గంజాయి స్మగ్లర్‌ ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. అతడికి విజయ్‌ గంజాయి, హాషిష్‌ ఆయిల్‌ సరఫరా చేస్తుంటాడు. ఇటీవల గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో కొ త్తవాళ్లను పంపాలని ఇమ్రాన్‌కు విజయ్‌ సూ చించాడు. ఈ మేరకు నలుగురు కొత్త యువకులను ఇమ్రాన్‌ రంగంలోకి దింపాడు. గజియాబాద్‌కు చెందిన ఫయ్యూమ్‌, జునైద్‌, సారిఖ్‌, మహ్మద్‌ నజీమ్‌లు ఈనెల 3న ఢిల్లీ నుంచి విశాఖకు రైలులో బయల్దేరి 5న వైజాగ్‌లో దిగారు. విశాఖ ఏజెన్సీ నుంచి 52 కేజీల గంజాయిని రెండేసి కేజీలుగా ప్యాక్‌ చేశారు. లీటర్‌ హాషిష్‌ ఆయిల్‌ సహా మొత్తం సరుకును ఆరు బ్యాగుల్లో సర్దేశారు. అదే రోజు రా త్రి దువ్వాడ రైల్వేస్టేషన్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆరున ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. మౌలాలీ స్టేషన్‌లో దిగారు. 


అక్కడే 12 గంటలు 

గురువారం ఉదయం 8:30కు మౌలాలీలో దిగిన గజియాబాద్‌ స్మగ్లర్లు రాత్రి 8:30 వరకు మౌలాలీ స్టేషన్‌ ప్రాంతంలోనే గడిపారు. చూడటానికి కాలేజీ యువకుల్లా ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. రాత్రి 11 గంటలకు దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో భోజనం ముగించుకొని దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలని ప్లాన్‌ చేసుకున్నారు. మౌలాలీ నుంచి సికింద్రాబాద్‌కు బస్సులో బయల్ధేరారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు మౌలాలీ చేరుకున్నారు. మల్కాజిగిరి పోలీసులతో కలిసి మౌలాలీ ఎక్స్‌రోడ్‌ వద్ద వారిని అడ్డగించి పట్టుకున్నారు. విజయ్‌ని, ఢిల్లీలో ఉన్న గంజాయి డీలర్‌ ఇమ్రాన్‌ను కూడా పట్టుకుంటామని సీపీ వెల్లడించారు. చాకచక్యంగా అంతర్రాష్ట్ర గంజాయి స్మగింగ్‌ ముఠా ఆటకట్టించిన ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి బృందాన్ని, మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వరరావు బృందాన్ని, ఆపరేషన్‌ను పర్యవేక్షించిన అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ మురళీధర్‌, మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్‌ ప్రసాదరావులను సీపీ అభినందించారు. సిబ్బందికి రివార్డులు అందజేశారు. 

Updated Date - 2022-04-08T18:04:27+05:30 IST