చిత్తూరులో ఘరానా మోసగాడు అరెస్ట్...

ABN , First Publish Date - 2021-03-28T17:42:54+05:30 IST

నిరుద్యోగ యువతీ యువకులను ఉద్యోగాలు ఇప్పిస్తామని..

చిత్తూరులో ఘరానా మోసగాడు అరెస్ట్...

చిత్తూరు/భాకరాపేట : నిరుద్యోగ యువతీ యువకులను ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి.. డబ్బు, బంగారం దోచుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేశారు. శనివారం భాకరాపేట సర్కిల్‌ కార్యాలయంలో పీలేరు రూరల్‌ సీఐ మురళీకృష్ణ మీడియాకు వివరాలు తెలిపారు. చిన్నగొట్టిగల్లు మండలం ఎండపల్లెవారిపల్లెకు చెందిన బండి ముత్యాలయ్య అలియాస్‌ అనిల్‌కుమార్‌రెడ్డి నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకునేవాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బు, బంగారం వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కొందరు యువతులతో సన్నిహితంగా ఉంటూ వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసేవాడు. ఆపై కుటుంబీకులకు పంపుతానని యువతులను బెదిరించి డబ్బు, బంగారం తీసుకునేవాడు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం పేరుతో మోస పోయినట్లు గుర్తించిన కడప జిల్లా రాయచోటి బోస్‌నగర్‌కు చెందిన సురేంద్ర భాకరాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుడు శుక్రవారం భాకరాపేట బస్టాండులో ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌ఐ రవినాయక్‌ తన సిబ్బందితో వెళ్లి నిందతుడిని అరెస్టు చేశాడు. అతడి వద్ద నుంచి ద్విచక్ర వాహనం,  రెండు బంగారు నెక్లెస్‌లు, రెండుగాజులు, సెల్‌ఫోన్‌, రూ.70వేలు, నగలు కుదువపెట్టిన రశీదులు, మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ముత్యాలయ్యపై కడప ఒకటో  పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో, తిరుపతి, నంద్యాలటౌన్‌, సత్తుపల్లె పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని గుర్తించారు. అలాగే ప్యాపిలి, చంద్రగిరి, కె.వి.బి.పురం, మదనపల్లె, వరదయ్యపాళెం, పుత్తూరు, చిన్నమండ్యం, రాయచోటి పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే ఆయా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాలేదన్నారు. బాధితులు ఎవరైనా సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయొచ్చని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఇకనైనా ఇలాంటి అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Updated Date - 2021-03-28T17:42:54+05:30 IST