అద్దెకు దిగుతాడు.. అడ్డంగా దోచేస్తాడు.. ఘరానా ఇంజనీరింగ్‌ దొంగ

ABN , First Publish Date - 2021-04-10T13:36:22+05:30 IST

ఆ యాప్‌ ద్వారా పంజాగుట్ట పరిధిలో నాగేంద్రప్రసాద్‌ అనే యువకుడి రూమ్‌లో షేరింగ్‌ పార్ట్‌నర్‌గా...

అద్దెకు దిగుతాడు.. అడ్డంగా దోచేస్తాడు.. ఘరానా ఇంజనీరింగ్‌ దొంగ

  • 7 రాష్ట్రాల్లో 15 కేసులు 
  • ఆటకట్టించిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు
  • 70 లక్షల విలువైన కార్లు, బైక్‌ స్వాధీనం


హైదరాబాద్‌ : ఏడాదిలో 7 రాష్ట్రాల్లో ఆరు ఖరీదైన కార్లు కొట్టేసి సొమ్ము చేసుకున్న ఘరానా ఇంజనీరింగ్‌ దొంగ ఆటకట్టించారు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు. అతని వద్ద నుంచి రూ.70లక్షల విలువైన ఆరు కార్లు, ఒక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.


పశ్చిమగోదావరికి జిల్లా భీమవరానికి చెందిన గుడాటి మహేష్‌ నూతన్‌ కుమార్‌ 2016లో ఈఈఈలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేటలో మొబైల్‌ టెక్నీషియన్‌గా చేరాడు.  తాను పనిచేస్తున్న మొబైల్‌ షాఫును నకిలీ తాళంచెవులతో తెరిచి ఫోన్‌లు, ఇతర యాక్సెసెరీస్‌ చోరీ చేశాడు. యజమాని ఫిర్యాదుతో మలక్‌పేట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు భీమవరం వెళ్లిపోయాడు. అక్కడ పాలకోడేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక ఖరీదైన కెమెరా చోరీ చేసి అక్కడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. 2018లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఎస్‌ఆర్‌నగర్‌లో ఒక షేరింగ్‌ రూమ్‌లో అద్దెకు దిగాడు. కొద్దిరోజులు నమ్మకంగా ఉండి ఒక టాటాబోల్డ్‌ కారు, ల్యాప్‌టాప్‌, రూ. 25వేల నగదు చోరీ చేసి ఉడా యించాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు 2019 డిసెంబర్‌లో నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.


రూమ్‌ షేరింగ్‌ అంటూ దోపిడీ..

గతేడాది జూన్‌లో జైలునుంచి బయటకు వచ్చిన మహేష్‌ తన ఇంజనీరింగ్‌ బుర్రకు పదును పెట్టాడు. రూమ్‌ షేరింగ్‌ యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ యాప్‌ ద్వారా పంజాగుట్ట పరిధిలో నాగేంద్రప్రసాద్‌ అనే యువకుడి రూమ్‌లో షేరింగ్‌ పార్ట్‌నర్‌గా అద్దెకు దిగాడు. నెలరోజుల నమ్మకంగా ఉండి.. అతని ఆధార్‌కార్డు, లైసెన్స్‌తోపాటు రూ. 1.60లక్షలు దోచుకొని చెంగిచెర్లకు, ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చాడు. కొట్టేసిన అడ్రస్‌ ప్రూఫ్స్‌లో ఫొటో ఎడిట్‌ చేసి రాయల్‌ బ్రదర్స్‌ సంస్థలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అద్దెకు తీసుకున్నాడు. దానిపై మహేష్‌ విశాఖపట్నం వెళ్లాడు. మార్గమధ్యలో బైక్‌కు ఉన్న జీపీఎస్‌ సిస్టంను తీసేశాడు. ఆ తర్వాత చైతన్య, అజయ్‌ యువకుల రూమ్‌లో అద్దెకు దిగాడు. రెండు నెలల తర్వాత వాళ్ల రూమ్‌లో రూ. 30వేలు నగదు, చైతన్య ఐడీ ప్రూఫ్స్‌లు చోరీ చేశాడు. అక్కడి నుంచి బైక్‌పై అతను పూణెకు మకాం మార్చాడు.


పూణెలో సతీష్‌ అనే యువకుడి రూమ్‌లో అద్దెకు దిగి రెండు నెలలు గడిపాడు. రూమ్‌మెట్‌ ఐడీ ప్రూఫ్స్‌లతో పాటు.. రూ. 1.80లక్షల నగదును మహేష్‌ దోచేసి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై పరారయ్యాడు.  హైదరాబాద్‌కు వచ్చిన అతను అక్టోబర్‌-2020లో కేరళ వెళ్లాడు. పూణెలో చోరీ చేసిన సతీష్‌ ఐడీప్రూ్‌ఫ్సను మార్ఫింగ్‌ చేసి, జూమ్‌ కార్‌లో వోక్స్‌వ్యాగన్‌ కారును అద్దెకు తీసుకున్నాడు. దాంతో హైదరాబాద్‌కు వస్తూ మార్గమధ్యలో జీపీఎ్‌సను తీసేశాడు. తర్వాత డిసెంబర్‌లో చెన్నై వెళ్లిన మహేష్‌ వైజాగ్‌లో కొట్టేసిన చైతన్య అడ్రస్‌ ప్రూఫ్‌లతో రెవ్వుకార్స్‌లో స్విఫ్ట్‌ కారును అద్దెకు తీసుకున్నాడు. దానికి కూడా జీపీఎస్‌ తొలగించి హైదరాబాద్‌కు వచ్చి అమ్మేశాడు. ఈ ఏడాది జనవరిలో మైసూర్‌ వెళ్లి పూణెలో కొట్టేసిన సతీష్‌ ఐడీలతో డ్రైవ్‌ఈజీలో బెలనో కారును అద్దెకు తీసుకుని హైదరాబాద్‌లో అమ్మేశాడు. ఆ తర్వాత కోల్‌కతా వెళ్లాడు. అక్కడ పంజాగుట్టలో కొట్టేసిన నానేంద్ర ప్రసాద్‌ ఐడీ ప్రూఫ్స్‌ పెట్టి రెవ్వుకార్స్‌లో ఇన్నోవా క్రిస్టా అద్దెకు తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమ్మేయడానికి సిద్ధంగా ఉంచాడు.


డ్రైవర్‌కోసం ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన..

ఇదిలా ఉండగా.. కొత్త అడ్రస్‌ ప్రూఫ్స్‌ కొట్టేయడానికి మరో కొత్త పథకానికి తెరతీశాడు. ఓఎల్‌ఎక్స్‌లో డ్రైవర్స్‌ కావలెను అని ప్రకటన ఇచ్చాడు. దాంతో చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌ పేటకు చెందిన కిరణ్‌ అనే యువకుడు డ్రైవర్‌ ఉద్యోగం కోసం మహే్‌షను సంప్రదించాడు. ముందుగా అతని వద్ద ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నాడు. వాటిని ఎడిట్‌ చేసి నిందితుడు మాదాపూర్‌లో జూమ్‌కార్‌ వద్ద ఫిబ్రవరిలో స్విఫ్ట్‌కారు అద్దెకు తీసుకున్నాడు. దాని జీపీఎస్‌ తొలగించి చెంగచెర్లలో పెట్టాడు. ఈ ఏడాది మార్చిలో బెంగళూరు వెళ్లాడు. అక్కడ చైతన్య అనే యువకుడి అడ్ర‌స్‌తో ఐడీలతో జూమ్‌కార్‌ లో వెర్నా కారును అద్దెకు తీసుకున్నాడు. దాని జీపీఎస్‌ తొలగించి హైదరాబాద్‌ చెంగిచెర్లకు తీసుకొచ్చాడు. 


క్రాస్‌చెక్‌తో బండారం బట్టబయలు

మాదాపూర్‌లోని జూమ్‌కార్‌ వాళ్లు క్రాస్‌చెక్‌ చేయగా.. డ్రైవర్‌ పనికోసం సంప్రదించిన కిరణ్‌ తారసపడ్డాడు. అతని ద్వారా అసలు విషయం తెలుసుకున్న జూమ్‌కార్‌ యాజమాన్యం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు శంషాబాద్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తన బృందంతో రంగంలోకి  దిగారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌ పర్యవేక్షణలో టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించిన నిందితుడి ఆటకట్టించారు. ఇప్పటి వరకు నిందితునిపై 7రాష్ట్రాల్లో 15కు పైగా కేసులు నమోదైనట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. కార్లు, బైక్‌లు అద్దెకు ఇచ్చే జూమ్‌కార్‌ లాంటి యాజమాన్యాలు డేటా బేస్‌ నిర్వహించాలని సీపీ పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు తారసపడ్డప్పుడు వారి ఫొటోను ఇతర బ్రాంచిలకు పంపితే వారిని వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. 

Updated Date - 2021-04-10T13:36:22+05:30 IST