ఇండస్‌.. బోగస్‌!

ABN , First Publish Date - 2021-03-07T07:58:58+05:30 IST

‘‘ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే మా ప్రాడక్ట్‌లు వాడండి. లావుగా ఉన్నవారు సన్నబడతారు.

ఇండస్‌.. బోగస్‌!

  • అందం పేరుతో ఘరానా మోసం
  • 10 లక్షల మందికి 1,500 కోట్ల కుచ్చుటోపీ
  • బెంగళూరు కేంద్రంగా మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌
  • ‘ఇండస్‌ వివా’ గుట్టు రట్టు చేసిన పోలీసులు
  • 24 మంది అరెస్టు.. నిందితుల్లో ముగ్గురు టీచర్లు
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది బాధితులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే మా ప్రాడక్ట్‌లు వాడండి. లావుగా ఉన్నవారు సన్నబడతారు.. సన్నగా ఉన్నవారు ఒళ్లు చేస్తారు. పిల్లల్లేని వారికి పిల్లలు పుడతారు. నల్లగా ఉన్నవారు తెల్లగా మారుతారు’’ అని ప్రకటనలు చేస్తూ.. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి రూ. 1,500 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఓ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం) ఆటను సైబరాబాద్‌ పోలీసులు కట్టించారు. హెల్త్‌ ప్రాడక్ట్స్‌ ముసుగులో బెంగళూరు కేంద్రంగా మనీ సర్క్యులేషన్‌ దందా సాగిస్తున్న 26 మంది సభ్యుల ముఠాలో.. 24 మందిని అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన అభిలాష్‌ థామ్‌సకు ఆమ్‌వే వంటి మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో 2014లో నలుగురు మిత్రులతో కలిసి.. ‘ఇండస్‌ వివా హెల్త్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. నేలమంగళలో ఆలీవ్‌ లైఫ్‌ సైన్సెస్‌ పేరుతో ఐగ్లోవ్‌, ఐకేర్‌, ఐచార్జ్‌, ఐకాఫీ, ఐపల్స్‌, అడ్వాన్స్‌ ఆయుర్వేద, ఐస్లిమ్‌ పేరుతో ఉత్పత్తులను ప్రారంభించాడు. 


వాటి మార్కెటింగ్‌కు భారీ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం) ద్వారా మనీ సర్క్యులేషన్‌కు తెరతీశాడు. ఈ స్కీమ్‌ ప్రకారం.. ఈ సంస్థలో సభ్యత్వానికి రూ. 12,500 వసూలు చేయడం ప్రారంభించారు. వారికి కొన్ని హెల్త్‌ ప్రాడక్ట్‌లు ఇస్తారు. అలా సభ్యులుగా చేరిన వారు.. వారం రోజుల వ్యవధిలో మరో ఇద్దరిని చేర్పించాలి. అప్పుడు మొదటి వ్యక్తికి రూ. 1,000 కమిషన్‌ వస్తుంది. ఆ ఇద్దరు మరో ఇద్దరిని.. ఆ నలుగురు మరో ఎనిమిది మందిని.. ఇలా 9 స్థాయిల్లో స్కీమ్‌ సాగుతుంది. 9 వారాల్లో ఒక వ్యక్తి ద్వారా 256 మంది సభ్యులు చేరితే.. అతడికి రూ. 2.56 లక్షల మేర కమీషన్‌ వస్తుంది. ఇదంతా ఒకరు ఇద్దరిని చేర్పించే స్కీమ్‌. ఇలా చేర్పించేవారిని స్టార్‌ డిస్ట్రిబ్యూటర్‌ అంటారు. అదే 25 మందిని చేర్పిస్తే.. రూబీ ఎగ్జిక్యూటివ్‌గా పరిగణిస్తూ కమీషన్‌గా ల్యాప్‌టాప్‌ ఇస్తారు. 75+75 మందిని చేర్పిస్తే.. పెర్ల్‌ ఎగ్జిక్యూటివ్‌గా పరిగణిస్తూ.. 5స్టార్‌ హోటల్‌లో విడిదితో.. గోవా ట్రిప్‌కు అవకాశం కల్పిస్తారు. 200+200 మందిని చేర్పిస్తే.. ఎమరాల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌గా గుర్తిస్తూ మలేసియా ట్రిప్‌.. 400+400 మందిని చేర్పించేవారిని షెప్పైర్‌ ఎగ్జిక్యూటివ్‌గా దుబాయ్‌ ట్రిప్‌కు తీసుకెళ్తారు. 2000+2000 మందిని చేర్పించేవారికి బ్లూడైమండ్‌ బిరుదుతో దక్షిణాఫ్రికా, 5000+5000 మందిని చేర్పిస్తే బ్లాక్‌ డైమండ్‌ అంబాసిడర్‌ బిరుదుతో వారం రోజుల అమెరికా విహార యాత్రకు అవకాశం కల్పిస్తారు.


బ్లాక్‌ డైమండ్‌ అంబాసిడర్‌లు సాధించిన విజయంపై వ్యక్తిగత డాక్యుమెంటరీని చిత్రీకరిస్తారు. ఇలా గడిచిన ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 10లక్షల మంది నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేశారు. గత నెల 20న గచ్చిబౌలికి చెందిన ఓ బాధితుడు.. తాను ఇద్దరిని చేర్పించినా కమీషన్‌ రాలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ దందా వ్యవహారం వెలుగు చూసింది. రంగంలోకి దిగిన ఆర్థిక నేరాల విభాగం, మాదాపూర్‌ జోన్‌ పోలీసులు ఈ ముఠా ఆటను కట్టించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.


తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ బాధితులు

ఇండస్‌ వివా మోసంలో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది బాఽధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారంతా ఎన్నికోట్లు మోసపోయారు? ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు? అనే వివరాలను సేకరిస్తున్నట్లు సజ్జనార్‌ వెల్లడించారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది మార్కెటింగ్‌ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. వారంతా నెలకు రూ.2-10లక్షల మేర కమీషన్‌ పొందుతున్నట్లు గుర్తించామన్నారు.


నిందితుల్లో ముగ్గురు టీచర్లు

ఏడేళ్లుగా జరుగుతున్న ఈ దందాలో తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వారి భార్యలు ఉన్నారు. ములుగు వెంకటేశ్‌(యాదాద్రి), కేసీఎస్‌ శర్మ(మునగనూరు), మన్నెపు హరిప్రసాద్‌(మిర్యాలగూడ).. తమ ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ.. ఫుల్‌టైమ్‌గా ఇదే దందాపై దృష్టి సారించారు. వేల మందిని ఈ స్కీముల్లో చేర్పించి, నెలకు రూ.10లక్షల దాకా సంపాదిస్తున్నారని సజ్జనార్‌ తెలిపారు. ఆ ముగ్గురు టీచర్లను, వారి భార్యలను కూడా అరెస్టు చేశామన్నారు.

Updated Date - 2021-03-07T07:58:58+05:30 IST