భక్తుల పూజలందుకున్న కనకమహాలక్ష్మి అమ్మవారు
ఎలమంచిలి, జనవరి 19: గ్రామీణ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేడుకల్లో ఒకటైన ఎలమంచిలిలోని ధర్మవరం కనకమహాలక్ష్మి తీర్థం బుధవారం అత్యంత ఘనంగా జరిగింది. వేకువ జామునుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఇల్లు బంధుగణంతో కలకలలాడింది. పట్టణంలోని పలు ప్రాంతాలు విద్యుద్దీపాలంకరణతో ధగధగలాడాయి. ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు కొఠారు సాంబ, ప్రతినిధులు, మునిసిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు, కొఠారు గోవింద్, కొండబాబు, మడగల సత్యనారాయణ తదితరులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం మునిసిపల్ చైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి, ఎంపీపీ బోదెపు గోవింద్, జడ్పీటీసీ శానాపతి సంధ్య, వైసీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర, కౌన్సిలర్లతో పాటు పలువురు అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం రాజీవ్ గాంధీ క్రీడామైదానంలో తీర్థాన్ని వీక్షించేందుకు పరిసర మండలాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తున్న నిర్వహించారు.