జీహెచ్‌లో కరోనా కేసులు ‘జీరో’

ABN , First Publish Date - 2022-04-13T13:46:37+05:30 IST

స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీహెచ్‌)లో కరోనా కేసులు ‘జీరో’కు చేరుకున్నాయి. వార్డులో ఒక్క కేసు కూడా లేకపోవడంతో ఇక్కడ ప్రత్యేక వార్డుల్లో

జీహెచ్‌లో కరోనా కేసులు ‘జీరో’

- రెండేళ్ల తర్వాత ఇదే ప్రథమం 

- ఊపిరి పీల్చుకున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది


చెన్నై: స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీహెచ్‌)లో కరోనా కేసులు ‘జీరో’కు చేరుకున్నాయి. వార్డులో ఒక్క కేసు కూడా లేకపోవడంతో ఇక్కడ ప్రత్యేక వార్డుల్లో నిర్విరామంగా సేవలందించిన డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు మంగళవారం ఉదయం ఆనందంతో గెంతులేశారు. కరోనా వార్డులో చికిత్స పొందిన బాధితులు డిశ్చార్జ్‌ అయివెళ్లిపోవడం, ఆ వార్డులో కొత్తగా ఎవ్వరూ రాకపోవడంతో ఇలాంటి క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన వైద్యులు, నర్సులు, సిబ్బంది సంతోషానికి అవధుల్లేకుండాపోయింది. ప్రస్తుతం జీహెచ్‌లో కరోనా బాధితులెవరూ లేరని డీన్‌ తేరని రాజన్‌ ప్రకటించారు. ఆ ప్రకటన చేయగానే డాక్టర్లు, నర్సులు, పారిశుధ్యకార్మికులు పరస్పరం అభినందించుకుని ఆనందించారు. రెండేళ్ల 35 రోజులపాటు కరోనా ప్రత్యేక వార్డుల్లో వైద్యులు, నర్సులు, పారిశుధ్యకార్మికులు షిప్ట్‌ పద్ధతుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించారు.  జీహెచ్‌ చరిత్రలోనే మరచిపోలేని రోజు ఇదేనని కొవిడ్‌ ప్రత్యేక వార్డులో కరోనా బాధితులు లేని పరిస్థితి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూశారని, చివరకు ఆ అమృత ఘడియ రానే వచ్చిందని ఆయన తెలిపారు. 2020 మార్చి ఏడున తొలిసారిగా కరోనా బాధితుడు చికిత్స కోసం చేరారని, ఆ తర్వాత వరుసగా చేరే  బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చిందన్నారు. మొదటివేవ్‌లో కన్నా సెకండ్‌వేవ్‌లో కరోనా బాధితులకు చికిత్సలందించడం సవాలుగా మారిందన్నారు. ఆస్పత్రి చుట్టూ అంబులెన్స్‌లను నిలబెట్టి కరోనా బాధితులకు అత్యవసర చికిత్సలందిడం వైద్యులు తమ జీవితంలో ఎన్నడూ మరచిపోలేరని డీన్‌ తెలిపారు.  కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్‌లు ధరించడం కూడా పెద్ద సమస్యగా మారిందని, గంటల తరబడి ఆ కిట్‌ ధరించి బాధితులకు చికిత్సలందించారని చెప్పారు. ఇక కరోనా బాధితులను చూసేందుకు వచ్చిన కుటుంబీకులను అడ్డుకోవడం కూడా తమ సిబ్బందికి సమస్యగా మారిందన్నారు. రెండేళ్లకు పైగా 65 వేల మంది కరోనా బాధితులకు చికిత్సలందించి కోలుకునేలా చేశామని, వీరిలో శతాధిక వృద్దుడు, ఆయన భార్య కూడా ఉన్నారని తెలిపారు. జీహెచ్‌లో చికిత్సకోసం చేరిన కరోనా బాధితులలో 94 శాతం మంది కోలుకున్నారని, నాలుగు శాతం మంది మాత్రమే మృతి చెందారని, ఇది కూడా తమ ఆస్పత్రి వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు అంకితభావంతో ప్రాణాలకు తెగించి అందించిన వైద్య సేవలవల్లే సాధ్యపడిందని డీన్‌ తెలిపారు.

Updated Date - 2022-04-13T13:46:37+05:30 IST