Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఒమైక్రాన్‌’ను ఎదుర్కొనేందుకు సిద్ధం

జీజీహెచ్‌లో 600 పడకల కేటాయింపు 

హెచ్‌వోడీలతో సూపరింటెండెంట్‌ సమావేశం

విజయవాడ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వస్తే సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు సర్వసన్నద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒమైక్రాన్‌ జాడ లేనప్పటికీ ప్రపంచ దేశాల నుంచి పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుర్తించిన నేపథ్యంలో జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు వస్తే మెరుగైన వైద్యసేవలందించేందుకు జీజీహెచ్‌ వైద్యాధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ శుక్రవారం ఆసుపత్రిలోని ఆయా విభాగాల హెచ్‌వోడీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఒమైక్రాస్‌ తీవ్రతపై చర్చించారు. గతానుభవాల దృష్ట్యా జిల్లాలో వైరస్‌ విజృంభిస్తే సమర్థంగా ఎదుర్కొనేందుకు 600 పడకలతో వార్డులను ఏర్పాటు చేశారు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో 90 వెంటిలేటర్‌ పడకలు, మరో 250 ఆక్సిజన్‌ పడకలను సిద్ధం చేశారు. ఇంకా అవసరమైతే ఆసుపత్రిలోని ఎ,బి,సీ బ్లాకులలో మరో 300 పడకలను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. పడకల వద్ద మానిటర్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి, అవసరమైతే వెంటనే రిపేర్లు చేయించి సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా బాధితులకు పరీక్షలు, వైద్యసేవలు అందించేందుకు నిపుణులైన వైద్యులు, సిబ్బందితోపాటు లేబొరేటరీ, ఎక్స్‌రే, రేడియాలజీ విభాగాల సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. ప్రజలు వైరస్‌ బారినపడకుండా మాస్కులు, శానిటైజర్లను వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ సూచించారు. 

Advertisement
Advertisement