టెస్టులు.. మందుల్లేవు

ABN , First Publish Date - 2021-12-08T05:30:00+05:30 IST

మందులు లేవు.. రోగులకు పరీక్షలు అందడంలేదు.. దీంతో జీజీహెచ్‌లో వైద్యం అంతంతమాత్రంగానే అందుతుంది. వైద్యులు సక్రమంగా చూడటంలేదని రోగులు.. మందులు లేకుండా ఏం చూస్తామని వైద్యులు, వైద్య సిబ్బంది వాదులాటలతో రోజులు గడుస్తున్నాయి.

టెస్టులు.. మందుల్లేవు
జీజీహెచ్‌ ముందు ఆందోళన చేస్తున్న మెడికోలు

జీజీహెచ్‌లో వైద్యం అంతంతే

ప్రైవేటు మందులు, టెస్టులే దిక్కు

సక్రమంగా చూడటంలేదని రోగుల ఆగ్రహం

పరీక్షలు, మందులు లేకుండా చికిత్స ఎలా అంటున్న వైద్యులు

జీజీహెచ్‌లో రెండో రోజూ కొనసాగిన మెడికోల ఆందోళన 

నిలిచిన వైద్య సేవలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు

   

గుంటూరు(జీజీహెచ్‌), డిసెంబరు 8: మందులు లేవు.. రోగులకు పరీక్షలు అందడంలేదు.. దీంతో జీజీహెచ్‌లో వైద్యం అంతంతమాత్రంగానే అందుతుంది. వైద్యులు సక్రమంగా చూడటంలేదని రోగులు.. మందులు లేకుండా ఏం చూస్తామని వైద్యులు, వైద్య సిబ్బంది వాదులాటలతో రోజులు గడుస్తున్నాయి. కొంతమంది రోగుల బంధువులు ఆగ్రహం పట్టలేక వైద్యులు, సిబ్బందిపై దాడులకు కూడా దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, వైద్యులకు ప్రతి రోజూ వివాదాలు పరిపాటిగా మారాయి. వైద్యులు సూచించిన ్తపరీక్షలు రోగులకు అందుబాటులో లేవు.  మందులు కూడా అందడంలేదు. జీజీహెచ్‌కు నాలుగు నెలలుగా మందులు సరఫరా నిలిచిపోయింది. రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో రక్త పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు సేవలు నిలిపివేశాయి.  దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగికి సరైన వైద్యం అందడంలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో సూది మందు, కాటన్‌ తప్పించి ఏవీ అందుబాటులో లేవు. ఓపీ విభాగంలోని రక్తపరీక్షలే రోగులకు దిక్కయ్యాయి. అవి కూడా ఉదయం సమయంలోనే అందుబాటులో ఉంటున్నాయి. రాత్రి వేళల్లో ఆసుపత్రికి వచ్చిన వారి గోడు పట్టించుకునే వారే లేరు. ఎందుకంటే అలా వచ్చిన రోగులకు పరీక్షలు చేసే వారు లేకు పోవడంతో వైద్యులు కూడా చేసేదేమీ లేక పోతున్నారని సమాచారం.


దాడులపై వైద్యులు ఆగ్రహం

టెస్టులు, మందులు లేక పోవడంతో వైద్యులు, సిబ్బందిపై రోగుల బంధువులు దాడులకు సైతం దిగుతున్నారు. అదేమంటే అత్యవసర చికిత్స కోసం వచ్చినా పట్టించుకోవడంలేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు అమరావతి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో గాయపడిన వారు అత్యవసర సేవల కోసం క్యాజువాలిటీకి వచ్చారు. అయితే అక్కడున్న వైద్యులు పరీక్షలు బయట చేయించుకురండని, మందులు కొనుక్కుని రండని చెప్పారు. దీంతో గాయపడిన వారితో వచ్చిన వారు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మెడికోలు సోమవారం నుంచి ఆందోళనకు దిగారు. ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించిన ఓ నాయకుడ్ని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని బుధవారం కూడా విధులు బహిష్కరించి సేవలకు గైర్హాజరయ్యారు.


వైద్యం అందక ఒకరి మృతి

మెడికోల ఆందోళనతో అత్యవసర సేవల విభాగంలో కూడా సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఈ విభాగంలో పట్టించుకునే నాథుడు లేక తెనాలికి చెందిన సుభాషిణి అనే మహిళ బుధవారం మృతి చెందినట్లు బంధువులు సూపరింటెండెంట్‌ చాంబర్‌ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌ సర్జన్‌లు, పీజీ విద్యార్థులపైనే 90 శాతం వైద్య సేవలు అందుతున్నాయి. ఈ క్రమంలో వారు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆపరేషన్లను సైతం రెండు రోజులకు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వార్డుల్లో సమాచారం ఇచ్చారు. దీంతో పలువురు రోగులకు రెండు రోజులుగా వైద్య సేవలు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.


ఆరోగ్యశ్రీ మందులకే దిక్కులేదు

ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందే రోగులకు కూడా మందుల కొరత తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా మందులు తీసుకోవాల్సిన వ్యక్తి చీటి తీసుకుని ఏజెన్సీ వద్దకు వెళితే ఇప్పటికే రూ.కోట్లలో పెట్టుబడి పెట్టాం, ఇక మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్న ఘటనలున్నాయి. దీంతో సొంత డబ్బులతో పలువురు మందులు కొనుగోలు చేసుకుంటున్నారు.  


చికిత్సలు ఎలా..

మందులు లేకుండా.. టెస్టులు చేయకుండా వైద్య చికిత్స ఎలా ఇవ్వగలం. ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలేదు. ఈ పరిస్థితుల్లో రోగులకు చికిత్సను అందించమంటే మేం ఎలా విధులు నిర్వహించాలి. ఆస్పత్రిలో రాత్రిపూట పరీక్షలు చేసేవారు లేరు. మందులు దొరకవు. రోగులు మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

- డాక్టర్‌ శ్రావణి, జూడా ఉపాధ్యక్షురాలు



Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST