జీజీహెచ్‌లో సీఐడీ సోదాలు

ABN , First Publish Date - 2021-04-13T07:03:22+05:30 IST

ఏపీ వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రులకు 2015-18 మధ్య కొనుగోలు చేసిన వైద్య పరికరాలు, నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీఐడీ డీఎస్పీ ఏబీజీ తిలక్‌ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జీజీహెచ్‌లో సోదాలు నిర్వహించారు.

జీజీహెచ్‌లో సీఐడీ సోదాలు
జీజీహెచ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు

వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణపై విచారణ

జీజీహెచ్‌ (కాకినాడ), ఏప్రిల్‌ 12: ఏపీ వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రులకు 2015-18 మధ్య కొనుగోలు చేసిన వైద్య పరికరాలు, నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీఐడీ డీఎస్పీ ఏబీజీ తిలక్‌ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జీజీహెచ్‌లో సోదాలు నిర్వహించారు. రోగ నిర్ధారణకు సంబంధించిన వైద్య పరికరాలపై రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రభుత్వ ఆసుపతుల్రలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు. క్రైం నెం.7/20/21 కింద సెక్షన్‌ 420, 406, 477 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం జీజీహెచ్‌లో సోదాలు నిర్వహించారు. గతంలో వైద్య పరికరాలకు మరమ్మతులను సంబంధిత కంపెనీల ఇంజనీర్లు, టెక్నీషియన్లు చేసేవారు. ఈ విధానంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో రోగులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యేవారు. దీంతో అప్పటి ప్రభుత్వం వైద్య పరికరాల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతను టెలిమేటిక్‌ అండ్‌ బయోమెడికల్‌ సర్వీసెస్‌ (టీబీఎస్‌) సంస్థకు అప్పగించింది. అయితే ఆ సంస్థ వారంటీ ఉన్న వైద్య పరికరాలకు మరమ్మతులు నిర్వహించి బిల్లు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. అనంతరం వెలుగు చూసిన ఈ అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రత్యేక దృష్టి సారించి సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఐడీ డీఎస్పీ తిలక్‌ బృందం ఆర్‌ఎంవో డాక్టర్‌ గిరిధర్‌తో కలసి ఆసుపత్రిలోని మైక్రోబయాలజీ, బయె కెమిస్ట్రీ, పెథాలజీ, రేడియాలజీ తదితర ముఖ్యమైన విభాగాల్లో ఉన్న వైద్య పరికరాలు, నిర్వహణ, లోపాలపై విచారణ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగాయి. మంగళవారం కూడా సోదాలు జరుగుతాయని డీఎస్పీ తిలక్‌ తెలిపారు. విచారణ అనంతరం నివేదికను సీఐడీ చీఫ్‌కు సమర్పిస్తామన్నారు. తనిఖీల్లో సీఐడీ ఎస్‌ఐ వెంకటేష్‌, సిబ్బంది, ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-13T07:03:22+05:30 IST