జీజీహెచ్‌.. ఫుల్‌

ABN , First Publish Date - 2022-01-18T06:22:39+05:30 IST

కరోనా మూడో దశ జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోన్నదా అంటే.. పెరుగుతున్న కేసులు.. పాజిటివ్‌రేట్‌ను చూస్తే అవుననిపిస్తోన్నది.

జీజీహెచ్‌.. ఫుల్‌
చిలకలూరిపేట కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ డి.రవీంద్ర

నిండుకున్న కరోనా బెడ్లు

ఒక్క రోజే వంద మంది చేరిక

ఆస్పత్రిలో మరో రెండు వార్డులు పెంపు 

జిల్లాను చుట్టుముట్టేస్తోన్న వైరస్‌తో ఆందోళన

గుంటూరు, నరసరావుపేటలో అత్యధిక కేసులు 

21.13 శాతానికి చేరుకున్న పాజిటివ్‌ రేట్‌

గుంటూరు(ఆంధ్రజ్యోతి), గుంటూరు(జీజీహెచ్‌), జనవరి 17: కరోనా మూడో దశ జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోన్నదా అంటే.. పెరుగుతున్న కేసులు.. పాజిటివ్‌రేట్‌ను చూస్తే అవుననిపిస్తోన్నది. రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కేసులతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. వారం రోజులుగా కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య అంతగా లేదు. దీంతో అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అయితే సంక్రాంతి పండుగ ముగిసిందో లేదో ఒక్కసారిగా సోమవారం గుంటూరు జీజీ హెచ్‌కి కరోనాతో వచ్చిన కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదివారం వరకు జీజీహెచ్‌లో కేవలం 30 మంది లోపే చికిత్స పొందుతూ ఉండగా సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన వంద బెడ్లు నిండుకున్నాయి. ఉదయానికే వంద మంది బాధితులు రావడంతో వారికి బెడ్లు  కేటాయించాల్సి రావడంతో పరిస్థితి చేయిదాటుతుందని అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు జనరల్‌ మెడిసిన్‌ విభాగంలోని మరో రెండు వార్డులను కరోనా బాధితుల కోసం కేటాయించారు. అయితే ఆస్పత్రిలో చేరిన వారికి ప్రస్తుతానికి ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి లేకపోవడంతో వైద్యాధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. జీజీహెచ్‌లో మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉండటంతో విభాగాల వారీగా ఇన్‌చార్జిలను నియమిస్తూ, గత అనుభవాల మేరకు  ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి తెలిపారు. 

తాజాగా జిల్లాలో 345 కేసులు

సోమవారం జిల్లా వ్యాప్తంగా 1,633 మందికి టెస్టులు చేయగా 345 మందికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. ప్రతీ 100 మందిలో 21.13 శాతం మందికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోన్నది. యాక్టివ్‌ కేసులు 2,146కి చేరుకోగా వారిలో 1,981 మంది హోం ఐసోలేషన్‌లో, 165 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుంటూరులో 177, నరసరావుపేటలో 36, చిలకలూరిపేటలో 19, మంగళగిరిలో 17, తాడేపల్లిలో 16, తెనాలిలో 15, పెదకాకానిలో 5, గురజాల, పిడుగురాళ్ల, యడ్లపాడు, పొన్నూరులో నాలుగేసి, నాదెండ్లలో 3, తాడికొండలో 3, నకరికల్లు, రొంపిచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, అమరావతి, మాచర్ల, బాపట్ల, చేబ్రోలు, కాకుమాను, నిజాంపట్నం, చుండూరులో రెండేసి, అచ్చంపేట, మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు, దాచేపల్లి, దుర్గి, కారంపూడి, మాచవరం, ఈపూరు, శావల్యాపురం, కర్లపాలెం, కొల్లూరు, వేమూరులో ఒక్కొక్క కేసు నమోదైనట్లు  డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. చిలకలూరిపేటలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రధానశాఖలో ఏడుగురు ఉద్యోగులకు  పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సోమవారం బ్యాంకును మూసివేశారు. సెలవుల అనంతరం సోమవారం  విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ హాజరు 30 శాతం లోపే నమోదైంది. ఎక్కువ ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో తల్లిదండ్రులు కూడా పంపించేందుకు సుముఖత చూపలేదు. 

నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ..

కరోనా ఒమైక్రాన్‌ వేరియంట్‌ ఉధృతంగా వ్యాప్తి చెందుతోన్న దృష్ట్యా మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూని అమలులోకి తీసుకొస్తోన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యం రాత్రి 11 నుంచి మరుసటి రోజు వేకువజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. బస్టాండ్‌లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లకు వెళ్లే వారు, వాటిల్లో నుంచి దిగి వచ్చే వారు టిక్కెట్‌ చూపించాల్సి ఉంటుంది. సరుకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.  

 

Updated Date - 2022-01-18T06:22:39+05:30 IST