తడిసిమోపెడు!

ABN , First Publish Date - 2022-01-20T05:30:00+05:30 IST

ఏటికేడు పెరుగుతున్న సాగు ఖర్చులతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫసల్‌లో నష్టం వచ్చినా మరో పంటకైనా ఎంతో కొంత వస్తుందనే ఆశతో పంటలు వేస్తున్నారు. కాలం కలిసి రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు.

తడిసిమోపెడు!


  • ఏటేటా పెరుగుతున్న సాగు పెట్టుబడి వ్యయం 
  • ఎకరా వరి సాగుకు రూ.20వేలపైనే..
  • యాసంగిలో పెరిగిన వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు సాగు
  • రైతుబంఽధు సాయం పాత అప్పుల కింద జమ..
  • సాగు ఖర్చులకు అన్నదాతల ఇక్కట్లు

ఏటికేడు పెరుగుతున్న సాగు ఖర్చులతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫసల్‌లో నష్టం వచ్చినా మరో పంటకైనా ఎంతో కొంత వస్తుందనే ఆశతో పంటలు వేస్తున్నారు. కాలం కలిసి రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీనికి తోడు వానకాలంతో పోలిస్తే యాసంగిలో కూలీలు, ట్రాక్టర్‌తో దున్నకం, ఎరువులు, విత్తనాల రేట్లు అన్నీ పెరిగాయి. ఎకరా సాగుకు పంట రకాన్ని బట్టి రూ.15వేల నుంచి 21వేల వరకూ పెట్టుబడి పెడుతున్నారు.


 పరిగి: నేల తల్లిని నమ్ముకొని బతుకీడుస్తున్న రైతుకు కష్టకాలమొచ్చింది. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుతో సాగు భారమైతోంది. యాసంగి సాగుకు పెట్టుబడి డబ్బు లేక, బ్యాంక్‌లు రుణాలివ్వక రైతులు ఆందోళన చెందుతున్నారు. వానకాలం పంటలు చేతికొచ్చిన సమయంలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడీ రాలేదు. ఆశతో యాసంగిలో వేరుశగన, శనగ సాగుచేశారు. నీరున్న కొందరు రైతులు వరినాట్లు వేస్తున్నారు. జిల్లాలోని 18మండలాల్లో 120 వరకు చిన్న మధ్య తరహా చెరువులు, ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద 40వేల ఎకరాల్లో సాగు నీరందుతుంది. పరిగి మండలం లక్నాపూర్‌ ప్రాజెక్టు, కోట్‌పల్లి, జంటుపల్లి, బొంరాసిపేట్‌, ఎర్పుమల్ల, హస్నాబాద్‌, దోమ, కులకచర్ల, అంతారం ప్రాజెక్టు, ఇబ్రహీంపూర్‌, గడిసింగానూర్‌, బాసుపల్లి తదితర చెరువుల్లో నీరుంది. 65వేలకుగాపైగా బోర్లూ ఉంటాయి. ఈ యాసంగిలో సాధారణం కంటే ఎక్కువే సాగుకానుంది. యాసంగిలో చెరువులు, బోర్ల కింద 78,985ఎకరాల్లో సాధారణ విస్తీర్ణంకాగా ఇప్పటికే 70వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేశారు. యాసంగిలో 32,447ఎకరాల్లో వరి వేసేవారు. ప్రభుత్వం నియంత్రణతో విస్తీర్ణం తగ్గింది. ఇప్పటి వరకు 7వేల ఎకరాల్లో వరి వేసినట్టు అంచనావేస్తున్నారు. మరో పది వేలఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. దుక్కులు, నాట్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇతర పంటలు 16,439 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 18,496 ఎకరాల్లో సాగు చేశారు. ఈ యాసంగిలో వరి కొంత తగ్గినా ఇతర పంటల సాగు పెరుగుతోంది. వేరుశగన 10,027 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, 19,918 ఎకరాల్లో సాగైంది. 10,592 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, 16,237 ఎకరాల్లో సాగు చేశారు. పొద్దుతిరుగుడు 849 ఎకరాలకుగాను 3,197 ఎకరాలు, జొన్నలు 5,571 ఎకరాలకుగాను 6,306 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న సాగు కాస్త తగ్గింది. 3,060 ఎకరాలకుగాను 980 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. వరిసాధారణంగా జిల్లాలో 32,447 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, అయితే ఇప్పటి వరకు ఏడు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇంకా సాగయ్యే అవకాశం ఉంది. శనగులు, వేరుశనగలు తప్పా, మిగతా పంటలన్నీ జనవరి చివరి దాకా సాగు  చేయనున్నారు. 

 పెట్టుబడుల భారం

యాసంగి సాగుకు పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయి. ఎరువులు, విత్తనాలు, కూలీల రేట్లు పెరిగాయి. వానకాలంలో మహిళా కూలీకి రూ.250 నుంచి రూ.300 వరకు చెల్లించారు. ఇప్పుడది రూ.350 నుంచి రూ.450 పెరిగింది. సమీప గ్రామాల నుంచి కూలీలను రప్పిస్తే రూ.500 వరకు చెల్లించాలి. వరి పొలం దున్నుకానికి ట్రాక్టర్‌కు గంటకు రెండు వేల వరకు తీసుకుంటున్నారు. ఐదుసాళ్ల దున్నుకానికి పదివేల వరకు ఖర్చవుతోంది. మొత్తానికి వరికి ఎకరాకు రూ.20వేలకు పైనే ఖర్చువుతోంది. ఎకరా వేరుశనగకు రూ.18వేలు, శనగ సాగుకు రూ.15వేలు, పొద్దుతిరుగుడు, జొన్నలు, మొక్కజొన్నలు, కూరగాయల సాగుకు రూ.18వేల వరకు పెట్టుబడి అవుతోంది.

రైతుబంధుకు బ్యాంకర్లు తూట్లు

ప్రతీ పంటకు ఎకరానికి ఐదువేల చొప్పున రైతుబంధు పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయానికి బ్యాంకర్లు తూట్లు పొడుస్తున్నారు. కొందరు రైతుల డబ్బును పాతఅప్పులు, వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. జిల్లాలో 2,75,418 మంది రైతులు ఉంటారు. వీరికి రైతుబంధు కింద ప్రభుత్వం రూ.318.21కోట్లు ఇస్తోంది. రైతుల ఖాతాల్లోంచి పంటరుణం వడ్డీ కింద బ్యాంకులు పట్టుకుంటున్నాయి. దీంతో రైతులు మిత్తికి అప్పులు తీసుకుంటున్నారు. రైతుబంఽధు దేనికీ జమ చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశిస్తున్నా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు.

Updated Date - 2022-01-20T05:30:00+05:30 IST