దిగేదేలే!

ABN , First Publish Date - 2022-06-15T04:40:16+05:30 IST

వికారాబాద్‌ చైర్‌పర్సన్‌ రాజీనామాకు ససేమిరా వ్యవహారం తాండూరు చైర్‌పర్సన్‌కు ఊతమిచ్చింది. ఈ విషయమై ఈనెల 16 లేదా 17న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై చైర్‌పర్సన్‌ రాజీనామా వ్యవహారం చర్చించనున్నారు. చైర్‌పర్సన్‌ మార్పు జరగకుంటే తాండూరులో రాజకీయ పరిణామాలు కూడా మారనున్నాయి.

దిగేదేలే!

  •    తాండూరు  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు ఊతమిస్తున్న వికారాబాద్‌ చైర్‌పర్సన్‌ రాజీనామా వ్యవహారం
  •    సమీపిస్తున్న ఒప్పంద గడువు
  •    ఎమ్మెల్సీ వర్గంలో చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే వర్గంలో వైస్‌చైర్‌పర్సన్‌
  •    తప్పుకునేదే లేదని ఇదివరకే ప్రకటించిన స్వప్న

తాండూరు, జూన్‌14: తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ చెరి రెండున్నరేళ్ల పదవీ కాల ఒప్పందం గడువు మరో నెలరోజుల్లో ముగియనుంది. ఒప్పందం ప్రకారం ప్రస్తుత చైర్‌పర్సన్‌గా ఉన్న తాటికొండ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న పట్లోళ్ల దీపా పదవి నుంచి తప్పుకోవాలి. వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న పట్లోళ్ల దీపాకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించాలి. మున్సిపల్‌ ఎన్నికల అనంతరం చైర్‌పర్సన్‌ సీటుకు తీవ్ర పోటీ కావడంతో అప్పట్లో పార్టీ అధిష్టానం ఈనిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా కొనసాగిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. అప్పట్లో ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ప్రకటించారు. ప్రస్తుతం చైర్‌పర్సన్‌ స్వప్న, ఎమ్మెల్సీ వర్గంలో, వైస్‌ చైర్‌పర్సన్‌ దీపా ఎమ్మెల్యే వర్గంలో కొనసాగుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిన సమయంలో చైర్‌పర్సన్‌గా స్వప్న ఐదేళ్లపాటు కొనసాగుతారని, అసలు ఒప్పందమే జరగలేదని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. చైర్‌పర్సన్‌ స్వప్న కూడా రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తర్వాత మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీపా మధ్య కూడా విభేదాలు రచ్చకెక్కాయి. ఒకరిపైఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చెరి రెండున్నరేళ్లపాటు బల్దియా పీఠాన్ని అధిరోహించడానికి తొమ్మిది మున్సిపాలిటీలున్నాయి. అందులో వికారాబాద్‌ జిల్లాలో తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కూడా రెండున్నరేళ్ల పదవీ కాలం  ముగిసినందున ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉండగా, ససేమీరా అనడంతో ఈ పంచాయితీ అధిష్టానం వరకు వెళ్లింది. ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ అధిష్టానం సమస్య పరిష్కరించే బాధ్యతను పార్టీజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అప్పగించింది. వివాదం మరింత ముదరక ముందే పరిష్కారమార్గం అనే ్వషించాలని  సూచించింది. అయితే తాండూరులో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గాలకు చెందిన వారు చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌గా ఉండటంతో ఈసమస్యను పార్టీ అధిష్టానమే పరిష్కరించాల్సి ఉంటుంది.  అంతేకాకుండా వికారాబాద్‌ చైర్‌పర్సన్‌ రాజీనామాకు ససేమిరా వ్యవహారం తాండూరు చైర్‌పర్సన్‌కు ఊతమిచ్చింది. ఈ విషయమై ఈనెల 16 లేదా 17న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై చైర్‌పర్సన్‌ రాజీనామా వ్యవహారం చర్చించనున్నారు. చైర్‌పర్సన్‌ మార్పు జరగకుంటే తాండూరులో రాజకీయ పరిణామాలు కూడా మారనున్నాయి. 

Updated Date - 2022-06-15T04:40:16+05:30 IST