Jammu and Kashmirపై జర్మనీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-08T20:46:34+05:30 IST

జర్మనీ విదేశాంగ మంత్రి అనలెనా బేర్‌బోక్ పాకిస్థాన్ గడ్డపై నుంచి భారత దేశంపై

Jammu and Kashmirపై జర్మనీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇస్లామాబాద్ : జర్మనీ విదేశాంగ మంత్రి అనలెనా బేర్‌బోక్ పాకిస్థాన్ గడ్డపై నుంచి భారత దేశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరులో మానవ హక్కులకు ఐక్య రాజ్య సమితి భరోసా ఇవ్వాలన్నారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడటానికి ఇరు పక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం మాత్రమే ఏకైక మార్గమన్నారు. 


పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో సంయుక్త విలేకర్ల సమావేశంలో అనలెనా బేర్‌బోక్ మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ, కశ్మీరులో మానవ హక్కులు అమలయ్యేలా చూడటంలో ఐక్య రాజ్య సమితి (United Nations) పాత్ర ఉందన్నారు.  భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడటానికి ఇరు పక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం మాత్రమే ఏకైక మార్గమని తెలిపారు. మానవ హక్కులు అవిభాజ్యమైనవనేది ఐక్య రాజ్య సమితి (ఐరాస)కు  పునాది అని చెప్పారు. ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని, కశ్మీరుకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. కశ్మీరులో అన్ని మానవ హక్కుల అమలుకు హామీ లభించడం కోసం ఐరాస చేస్తున్న కృషికి మద్దతిస్తామన్నారు. 


ఐరాస భద్రతా మండలిలో జర్మనీకి సభ్యత్వం లేకపోయినప్పటికీ, ఐరాస మానవ హక్కుల మండలి వంటి ఇతర వ్యవస్థల్లో కశ్మీరుకు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే ఇరు పక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం, నమ్మకాన్ని పెంచుకోవడం మాత్రమే మార్గమన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణకు ద్వైపాక్షిక ఒప్పందం కుదరడం ఓ మంచి ముందడుగు అని చెప్పారు. ఇదే విధంగా మరిన్ని అడుగులు పడాలన్నారు.  రెచ్చగొట్టినప్పటికీ స్పందించకుండా ఉండటం, తమ వైఖరికి, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉండటం ప్రభుత్వాల బలమని చెప్పారు. 


భారత్-జర్మనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం 2000వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భద్రత, సుస్థిరతల కోసం భారత దేశంతో బహుముఖ సహకారాన్ని పటిష్టపరచుకోవడం గురించి జర్మనీ ఇటీవల ప్రస్తావించింది. 


Updated Date - 2022-06-08T20:46:34+05:30 IST