ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం ఇస్తాం : జర్మనీ

ABN , First Publish Date - 2022-03-13T23:06:30+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి మోల్డోవాకు

ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం ఇస్తాం : జర్మనీ

కీవ్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి మోల్డోవాకు వెళ్లిన శరణార్థుల్లో 2,500 మందికి ఆశ్రయమిస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బయెర్‌బాక్ తెలిపారు. మోల్డోవా విదేశాంగ మంత్రి నికు పొపెస్క్యూతో చర్చల తర్వాత అన్నలెనా ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిద్దరూ శనివారం (మార్చి 12న) సమావేశమయ్యారు. అన్నలెనా మోల్డోవా, వెస్టర్న్ బాల్కన్స్‌లో పర్యటిస్తున్నారు. 


మోల్డోవాకు యూరోపు, జర్మనీ సంఘీభావంగా నిలుస్తాయని అన్నలెనా చెప్పారు. మోల్డోవా నుంచి శరణార్థులను తీసుకుంటామని చెప్పారు. శరణార్థులు  రొమేనియా గుండా బస్సుల్లో జర్మనీ చేరుకుంటారు. మోల్డోవాలో ప్రస్తుతం దాదాపు 1,05,000 మంది ఉక్రెయిన్ శరణార్థులు ఉన్నారు. పోలండ్‌కు దాదాపు 15 లక్షల మంది, హంగేరీకి 2,35,000 మంది ఉక్రెయిన్ నుంచి వెళ్లినట్లు అంచనా. 


తూర్పు యూరోపు దేశాల్లో మోల్డోవా ఒకటి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది శరణార్థులు మోల్డోవాకు వెళ్లారు. దాదాపు 25 లక్షల మంది శరణార్థులుగా మారారని ఐక్య రాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండి చెప్పారు. ఉక్రెయిన్‌లో దాదాపు 20 లక్షల మంది నిర్వాసితులయ్యారని తెలిపారు. 


Updated Date - 2022-03-13T23:06:30+05:30 IST