నరమాంస భక్షణ కోసం.. మెకానిక్‌ను చంపి జననాంగాలను వేరు చేసిన టీచర్

ABN , First Publish Date - 2022-01-08T22:47:32+05:30 IST

నరమాంస భక్షణ కలను సాకారం చేసుకునేందుకు ఓ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన....

నరమాంస భక్షణ కోసం.. మెకానిక్‌ను చంపి జననాంగాలను వేరు చేసిన టీచర్

ఫ్రాంక్‌ఫర్ట్: నరమాంస భక్షణ కలను సాకారం చేసుకునేందుకు ఓ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ వ్యక్తిని శృంగారం కోసం ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేశాడు. ఆపై తినేందుకు అతడి జననాంగాలను కోసేశాడు.


జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిందీ ఘటన. నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి మథియాస్ షెర్జ్ మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో ఇలాంటి కేసు ఎప్పుడూ తన ముందుకు రాలేదన్నారు. దోషిలో నరమాంస భక్షణ కల్పనలు ఉన్నట్టు తెలిసి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి అతడి చర్యను అమానవీయమంగా అభివర్ణించారు. న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తున్నప్పుడు దోషి స్టెఫాన్.ఆర్ (42) నిశ్శబ్దంగా, ఎలాంటి హావభావాలు లేకుండా నిశ్చలంగా నిల్చున్నాడు. 



డేటింగ్ యాప్ ద్వారా 43 ఏళ్ల బాధితుడైన మెకానిక్‌తో స్టెఫాన్ ఆర్.‌కు పరిచయమైంది. ఆ తర్వాత శృంగారం పేరుతో బాధితుడిని ఇంటికి రప్పించిన స్టెఫాన్ డ్రగ్స్ ఇచ్చి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతడి జననాంగాలను కోసి తినేందుకు దాచుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి బెర్లిన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారేశాడు. సెప్టెంబరు 2020లో జరగ్గా నవంబరులో వెలుగులోకి వచ్చింది. బాధితుడిని స్టెఫాన్ టి.గా గుర్తించారు. 


బాధితుడి ఫోన్ కాల్ రికార్డ్స్ ఆధారంగా హత్యకు పాల్పడింది స్టెఫాన్ ఆర్.గా నిర్ధారించారు. అతడి ఇంట్లో రక్తపు మరకలను, అనుమానాస్పద వస్తువులను గుర్తించారు. అయితే, బాధితుడు స్వలింగ  సంపర్కుడు కావడంతో ప్రజలు ఏమనుకుంటారోనన్న భయంతో తనకు తానుగానే ఆత్మహత్య చేసుకున్నట్టు స్టెఫాన్ ఆర్. తరపు న్యాయవాది వాదించారు. అయితే, ఆయన వాదన నమ్మశక్యంగా లేకపోవడంతోపాటు బాధితుడి వృషణాలు, జననాంగాన్ని జాగ్రత్తగా వేరు చేయడం చూస్తుంటే ఇది నరమాంస భక్షణ కోసమేనని స్పష్టంగా తెలుస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2022-01-08T22:47:32+05:30 IST