జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2020-06-05T00:40:50+05:30 IST

నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు

వాషింగ్టన్: నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తెల్ల పోలీసు అధికారి చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ మరణించడంతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా జార్జ్ ఫ్లాయిడ్‌ పోస్ట్ మార్టం రిపోర్ట్‌ను కుటుంబసభ్యుల అనుమతితో అధికారులు విడుదల చేశారు. 20 పేజీలున్న ఈ రిపోర్ట్‌లో అనేక విషయాలను వైద్యులు వెల్లడించారు. జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయే నాటికే ఆయనకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ బట్టి.. ఆయనకు ఏప్రిల్ మూడో తేదీన కరోనా సోకినట్టు హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ ఆఫీస్ తెలిపింది. అయితే జార్జ్ ఫ్లాయిడ్‌లో ఎటువంటి కరోనా లక్షణాలు లేనట్టు పేర్కొంది. జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన మరుసటి రోజు.. అంటే మే 26న నిర్వహించిన కరోనా పరీక్షల్లో కూడా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు చెప్పారు. తనకు కరోనా సోకినట్టు జార్జ్ ఫ్లాయిడ్‌కు సైతం తెలిసే ఉండవచ్చని వైద్యులు అన్నారు. అయితే జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి.. కరోనాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదని వైద్యులు స్పష్టం చేశారు. పోలీసు అధికారి జార్జ్ ఫ్లాయిడ్ మెడపై కాలు పెట్టి ఉంచడంతో.. ఊపిరి ఆడక కార్డియో పల్మనరీ అరెస్ట్ అయి మరణించాడని తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరితిత్తుల్లో ఎటువంటి సమస్యలు లేవని కానీ గుండె సమస్యతో మాత్రం బాధపడుతున్నట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది.

Updated Date - 2020-06-05T00:40:50+05:30 IST