Abn logo
Dec 9 2020 @ 00:00AM

కళలు కళకళలాడాలని...

వారణాసి దేనికి ప్రసిద్ధి? విశ్వేశ్వరుడి దేవాలయం.. ఘాట్‌లు.. గంగానది.. ఇలా చాలామంది చెబుతారు. కానీ చాలామందికి - వారణాసి కళాకృతులకు నిలయమని... అక్కడ తయారుచేసే అనేక వస్తువులకు జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌ (జీఐ)లు లభించాయని తెలియదు. ఇలాంటి జీఐ వస్తువులన్నింటినీ ఒకే చోటకు చేర్చి.. కళాకారులకు ఒక వేదికను కల్పిస్తున్నారు స్నిగ్ధ. తాను ఈ రంగంలోకి రావడానికి వెనకున్న కారణాలను... వారణాసికి ఉన్న గొప్ప చారిత్రక కళాచరిత్రను ఆమె ‘నవ్య’కు వివరించారు. 


‘‘నేను ఢిల్లీలో లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశా. ఆ తర్వాత ఫ్యాషన్‌ రంగంపై ఉన్న ఆసక్తితో నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ మేనేజిమెంట్‌ చేశా. ఆ తర్వాత నాకు రకరకాల అవకాశాలొచ్చాయి. కానీ ఏదో ఒకటి సొంతంగా చేయాలనుకున్నా. ఈ సమయంలో నేను వారణాసికి వెళ్లడం... అక్కడున్న రకరకాల క్రాఫ్ట్స్‌ను చూడటం జరిగింది. చాలా మందికి వారణాసి ఒక పుణ్యక్షేత్రంగా, బెనారస్‌ సిల్క్‌ చీరలు లభించే ప్రాంతంగానే తెలుసు. కానీ వారణాసికి చాలా గొప్ప చరిత్ర ఉంది. వారణాసిలో తయారుచేసే పింక్‌ మీనాకారి వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. మొఘలుల కాలంలో ఈ పింక్‌ మీనాకారి వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేవి. అదే విధంగా ఇక్కడ తయారుచేసే చెక్క బొమ్మలను కూడా దేశంలో వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఇక వారణాసి సమీపంలో ఉన్న మీర్జాపూర్‌లో తయారుచేసే తివాచీలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. వారణాసిలో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించిన కళాకారులు అనేక మంది ఉన్నారు. అయితే వీరికి లభించిన గుర్తింపు చాలా తక్కువ. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌ (జీఐ)లపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. దీనిలో భాగంగానే వారణాసికి చెందిన పింక్‌ మీనాకారీ, చెక్కబొమ్మలకు కూడా జీఐ ట్యాగ్‌లు లభించాయి. 


అదే కారణం..

జీఐ ట్యాగ్‌ లభించిన తర్వాత కూడా ఈ ఉత్పత్తులకు పెద్ద డిమాండ్‌ రావడం లేదు. దీనికి ప్రధానమైన కారణం- ఈ కళారూపాలను కొనుగోలు చేసేవారికి... కళాకారులకు మధ్య నేరుగా సంబంధం లేకపోవడమే! ఆన్‌లైన్‌ చాలా విస్తరించిన ఈ ఆధునిక కాలంలో అలాంటి వేదికను రూపొందించాలనే ఉద్దేశంతోనే- డికాసా డికోర్‌ అనే ఒక సంస్థను ప్రారంభించా. దీనిలో జీఐ ఉత్పత్తులు మాత్రమే కాకుండా.. నేను తయారుచేసే డెకోపాజ్‌లు కూడా లభిస్తాయి. జీఐ ఉత్పత్తులన్నింటినీ నేరుగా వారణాసికి చెందిన కళాకారుల నుంచి సేకరిస్తారు. అవసరమైతే ఆర్డర్లపై ఉత్పత్తులను ప్రత్యేకంగా కూడా తయారుచేయిస్తా ! ఈ మొత్తంలో నాకు లభించే లాభం ఐదు శాతం కన్నా ఉండదు. అది కూడా నా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించటానికి సరిపోతుంది. నేను ప్రారంభించిన ఈ వేదికకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోంది. జూకాలు, నెక్లెస్‌ల దగ్గర నుంచి ఇంట్లో పెట్టుకొనే రకరకాల బొమ్మల దాకా అనేక మంది కొనుగోలు చేస్తున్నారు. వీటి వల్ల నాకు లభించే ప్రయోజనం కన్నా- వందల మంది కళాకరులకు మేలు జరుగుతోందనే ఆలోచన చాలా తృప్తిని ఇస్తోంది.’’ 


పింక్‌ మీనాకారీ..

పింక్‌ మీనాకారీ ఆభరణాలను చేతితో తయారుచేస్తారు. దీనిలో వాడే తెలుపు, పింక్‌ ఎనామిల్‌ పెయింట్స్‌ వల్ల ఈ ఆభరణాలు మెరుస్తూ ఉంటాయి. వీటిలోనే గులాబీ మీనాకారీ, ఎక్‌ రంగ్‌ ఖులా మీనా, పంచ్‌రంగీ మీనా వంటి వైవిధ్యమైన పద్ధతులలో కూడా ఆభరణాలను తయారుచేస్తారు. ఒకో ఆభరణాన్ని తయారుచేయడానికి రెండు నుంచి నాలుగు వారాల వరకూ పడుతుంది. ఒకప్పుడు ఈ ఆభరణాలను బంగారం, ఎనామిల్‌తో చేసేవారు. ప్రస్తుతం బంగారు ధర బాగా ఖరీదు కావటంతో వీటిని వెండి లేదా రాగితో తయారుచేస్తున్నారు.


ప్రత్యేకం మరిన్ని...