జనరల్‌ బోగీలేవీ?

ABN , First Publish Date - 2022-01-22T06:21:01+05:30 IST

రైలు ప్రయాణికులకు కరోనా వల్ల ఏర్పడిన కష్టాలు రెండేళ్లు పూర్తయినా సమసిపోవడంలేదు.

జనరల్‌ బోగీలేవీ?
ప్రత్యేక రైలు

ప్రత్యేక రైళ్లలో అధిక ధరలు చెల్లించి ప్రయాణాలు

సీజనల్‌ పాసులు లేక ప్రయాణికులకు ఇబ్బందులు

థర్డ్‌వేవ్‌తో మరికొంతకాలం వేచి ఉండాల్సిందేనా..?

గుంతకల్లు, జనవరి 21: రైలు ప్రయాణికులకు కరోనా వల్ల ఏర్పడిన కష్టాలు రెండేళ్లు పూర్తయినా సమసిపోవడంలేదు. సెకెండ్‌ వేవ్‌ తర్వాత ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒక్కొక్కటిగా పునఃప్రారంభించినా.. వాటిలో సెకెండ్‌ క్లాస్‌ బోగీలను వేయని కారణంగా అటు జనరల్‌ టిక్కెట్టుపై ప్రయాణించే వారికి, ఇటు సీజనల్‌, తదితర పాసులపై వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునేవారు, విద్యార్థులు, దివ్యాంగులు జనరల్‌ బోగీల్లో ప్రయాణించే అవకాశంలేక అధిక ధరలు చెల్లించి జర్నీ చేయాల్సి వస్తోంది. ప్రత్యేక రైళ్ల హోదాలో ప్యాం సింజరు రైళ్లను నడుపుతూ అధిక టిక్కెట్టు ధరలను వసూలు చేస్తున్నారనీ, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలను వేయకుండా ఇ బ్బందులపాల్జేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఓవైపు ప్యాసింజరు రైళ్లను నడుపుతూ, మరోవైపు కరోనా పేరుచెప్పి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలను వేయకపోవడంపై ప్రశ్నిస్తున్నారు.

    కరోనా ఫస్ట్‌వేవ్‌ సందర్భంగా 2020 మార్చి 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజరు రైలు సర్వీసులను నిలిపేశారు. సెకెండ్‌ వేవ్‌ సమీపిస్తున్న తరుణంలో కొవిడ్‌ నిబంధనల ప్రకారం కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రత్యేక రైళ్ల హోదాలో పునఃప్రారంభించారు. ప్రత్యేక రైళ్లు కనుక పెంచిన ప్రత్యేక ధరలతో వాటిని నడిపారు. గత జూలై నుంచి దశల వారీగా అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునఃప్రారంభించారు. వాటిలో జనరల్‌ బోగీలను మాత్రం బిగించలేదు. జనరల్‌ బోగీలున్నా కూర్చుని ప్రయాణించడానికి వీలుగా రి జర్వేషన సదుపాయం కల్పించారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట ప్యాసింజరు రైళ్లను కూడా ప్రత్యేక రైళ్ల హోదాలో పరిమిత స్టాపింగ్‌లు, రైలు వేగాన్ని పెంచి రెండింతల టిక్కెట్టు ధరలతో పునఃప్రారంభించారు. గుంతకల్లు నుంచి అనంతపురానికి గతంలో రూ.20 జనరల్‌ టిక్కెట్టు ధర ఉండగా, ఇప్పుడు రూ.40 వసూలు చేస్తున్నారు. కొవిడ్‌ ప్రత్యేక నిబంధనలు పాటించకుండా, సీటింగ్‌లో దూరాన్ని పాటించకుండా, పాత పద్ధతిలోనే జనం రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎక్స్‌ప్రె్‌సలలో కూడా కనీస దూరాల విషయంగా ప్రయాణికులకు నియమాలు విధించలేదు. అలాంటపుడు జనరల్‌ బోగీలు, రెగ్యులర్‌ ప్యాసింజరు రైళ్లను ఎందుకు ప్రారంభించరని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలను నిర్వహించనందున ఉద్యోగులు, విద్యార్థులకు సీజనల్‌ పాసులు జారీ చేయడం లేదు. బస్సుతో పోలిస్తే రైలు టిక్కెట్ల అధిక ధరలు తక్కువగా ఉండటంతో ప్రయాణిస్తున్నా.. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలు లేకపోవడం ప్రయాణికులపై భారం మోపుతోంది. అధిక రేట్లను వసూలు చేయడానికే ప్యాసింజరు రైళ్లను ప్రత్యేక రైళ్లుగా కాకుండా, పాత రైళ్లను పునఃప్రారంభించాలనీ, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలను వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.



Updated Date - 2022-01-22T06:21:01+05:30 IST