రిలయన్స్‌ రిటైల్‌తో జతకట్టిన జనరల్‌ అట్లాంటిక్

ABN , First Publish Date - 2020-09-30T17:45:15+05:30 IST

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో వరుస పెట్టుబడులు..

రిలయన్స్‌ రిటైల్‌తో జతకట్టిన జనరల్‌ అట్లాంటిక్

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో వరుస పెట్టుబడులు పెడుతున్న సంస్థల జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ జతకలిసింది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌ వెంచర్స్ లిమిటెడ్‌లో 0.84 శాతం వాటా కోసం రూ.3,675 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జనరల్ అట్లాంటిక్ సిద్ధమైంది. దీంతో రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల విలువ రూ. 4.29 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్ఐఎల్ వెల్లడించింది.  కాగా తాజా ఒప్పందం సందర్భంగా ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘జనరల్ అట్లాంటిక్‌తో సంబంధాలు విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా సాధికారత సాధించే విధంగా మా వంతు కృషి చేస్తున్నాం. తద్వారా రిలయన్స్ రిటైల్‌ను మరింత విస్తరిస్తాం. రిలయన్స్ రిటైల్ మాదిరిగానే జనరల్ అట్లాంటిక్ కూడా దేశ, ప్రపంచ అభివృద్ధి కోసం డిజిటల్ సామర్థ్యమే ప్రాథమిక సూత్రమని భావిస్తుంది..’’ అని పేర్కొన్నారు. తాజా ఒప్పందానికి సంబంధించి ఇంకా మార్కెట్ నియంత్రణ మండలి సహా ఇతర అనుమతులు రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. జనరల్ అంట్లాంటిక్ ఇంతకు ముందు ఆర్ఐఎల్ డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.6,598.39 పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో పాటు సిల్వర్‌ లేక్‌ పార్టనర్స్‌, కేకేఆర్‌ వంటి పీఈ దిగ్గజాలు సైతం పెట్టుబడులు పెట్టాయి. 

Updated Date - 2020-09-30T17:45:15+05:30 IST