జెండర్ విప్లవ వైతాళికురాలు

ABN , First Publish Date - 2022-01-02T08:25:32+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు, పోరాట వీరులకు బాసటగా నిలిచిన స్త్రీలలో సావిత్రిబాయి ఫూలే అద్వితీయురాలు. కారల్ మార్క్‌్సకు జెన్నీ ఉద్యమాలలో వెన్నుదట్టి ఎంతో సహకారాన్ని అందించింది...

జెండర్ విప్లవ వైతాళికురాలు

ప్రపంచ వ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు, పోరాట వీరులకు బాసటగా నిలిచిన స్త్రీలలో సావిత్రిబాయి ఫూలే అద్వితీయురాలు. కారల్ మార్క్‌్సకు జెన్నీ ఉద్యమాలలో వెన్నుదట్టి ఎంతో సహకారాన్ని అందించింది. సావిత్రి బాయి తన భర్త జ్యోతిరావు ఫూలే నిర్వహించిన సమస్త ఉద్యమాలలో ఆయనకు అండగా నిలిచింది. స్వీయ సృజనాత్మకతను, వ్యక్తిత్వాన్ని చాటి పలు విషయాలను చరిత్రకు అందించింది.


మహారాష్ట్ర సతారా జిల్లాలో నయగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న సావిత్రిబాయి పూలే ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె తన 9వ యేట పన్నెండేళ్ల జ్యోతిరావు పూలేను వివాహం చేసుకున్నారు. సామాజిక మార్పుకు, చైతన్యానికి, లింగ సమానత్వానికి విద్యే ఆయుధమని ఫూలే దంపతులు భావించారు. భారతదేశం వెనుకబడటానికి కారణం దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు విద్య లేకపోవడమే అనే సత్యాన్ని గుర్తించిన జ్యోతిరావు పూలే తన భార్యను విద్యావంతురాలుగా తీర్చిదిద్దారు. స్త్రీలు విద్యను అభ్యసించక పోవడం వల్లనే మూఢాచారాలతో సనాతన భావాలతో చిక్కుకుపోతున్నారు అని భావించి 1848 లో బీడేవాడలో దళిత బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బాలికలకు విద్యను అందించడం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు దారి తీసింది. ఈ దేశ తొలి మహిళా టీచర్‌గా సావిత్రిబాయి నిలిచారు. దేశ చరిత్రలోనే స్త్రీ విముక్తి ఉద్యమానికి ఓనమాలు దిద్దారు. పీష్వాల కాలంలో సనాతన బ్రాహ్మణుల ఆధిపత్యం సమాజంలో బలీయంగా ఉండేది. స్త్రీ విద్యకు అనేక అవమానాలు, ఆటంకాలు స్పృష్టిస్తున్నప్పటికి, మరోవైపు ఆమె బాలికల పాఠశాలకు వెళ్తుంటే బురదతో, మట్టితో, పేడ నీళ్లు చల్లి సనాతన పిడివాదులు అవరోధాలు కల్పించారు. ఆమె ధరించిన వస్త్రాలతో పాటు అదనంగా మరో జత పాఠశాలకు తీసుకొని వెళ్ళేది. అవసరానికి ఆ జతను ఉపయోగించుకునేది. సంప్రదాయవాదులు చేసిన ఎన్నో ఒత్తిడిలకు, అవమానాలకు గురి అయిన ఆమె ఆత్మస్థైర్యం మనోనిబ్బరం చెక్కుచెదరలేదు. సమాజం, కుటుంబం బహిష్కరణ నడుమ ఎలాంటి రాజీ లేకుండా సావిత్రిబాయి ఒక మహోన్నతమైన విద్యా ఉద్యమాన్ని సాహసోపేతంగా నడిపింది. సమాజంలో కుల వివక్ష కారణంగా మహార్లు, మాంగ్‌లు అస్పృశ్యులుగా సమాజం నుంచి నెట్టివేయబడ్డారు. వారి పిల్లలు కనీస ప్రాథమిక విద్యకు నొచుకోలేకపోయారు. ఫూలే దంపతుల సత్యశోధక ఉద్యమ ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వారికోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించింది. కానీ అవి కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైనాయి. ఈ పరిస్థితి గమనించి ఫూలే దంపతులు మహార్, మాంగ్ ఇతర నిమ్న జాతి కులాల జనాభా అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాలలో అక్కడే పాఠశాలలను నెలకొల్పాలని విక్టోరియా రాణికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే కుల వివక్ష వల్ల వారిని సాధారణ పాఠశాలలోకి అనుమతి నిరాకరించడం వల్ల ఈ ఏర్పాటు అవసరం అయింది. నాలుగు సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. ఆ తదనంతరం మొత్తం 52 పాఠశాలలను ప్రారంభించారు. ఆ పాఠశాలల్లో 174 సంవత్సరాల క్రితమే విద్యను ప్రోత్సహించడానికి విద్యార్థులకు స్వంత ఖర్చులతో ఉచిత మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు. దాని కొనసాగింపుగా నేటికీ భారతదేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలో విద్యను ప్రోత్సహించడానికి నిమ్న, పేద వర్గాలకు ప్రత్యేక విద్యాలయాలను, మధ్యాహ్నభోజన పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఫూలే దంపతులు ఆ కాలంలోనే సామాజికాభివృద్ధిలో విద్య ప్రామాణికతను గుర్తించి ఉద్యమించారు. ఆయన కొనసాగించిన ఎజెండా ఇప్పటికీ అసంతృప్తిగానే మిగిలింది. సామాజికాభివృద్ధిలో విద్య ప్రాముఖ్యతను ఒక అంశంగా వివరించిన అమర్త్యసేన్ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. 174 సంవత్సరాల క్రితమే ఫూలే దంపతులు అదే విషయాన్ని వివరించడమే కాదు, ఆచరణాత్మకంగా నిరూపించారు. వారి ఎజెండాకు కొనసాగింపుగా అంబేడ్కర్ విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిచారు. అయినప్పటికీ వారి ఆశయాలు పూర్తి స్థాయిలో నేటికీ అమలు జరగడం లేదు. మానవాభివృద్ధి సూచీలో భారతదేశం 131వ స్థానంలో ఉండడమే ఇందుకు ఉదాహరణ.


మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించింది సావిత్రిబాయి పూలే. స్త్రీలను చైతన్య పరచడానికి ‘మహిళా సేవా మండల్’ అనే మహిళా సంఘాన్ని ఆమె స్థాపించారు. సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలకు, మద్యపానానికి, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి, వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి ఆశ్రయం కల్పించి వారి కళ్లలో వెలుగులు చూశారు. సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం ఏర్పాటు చేసి స్త్రీలను చైతన్యపరచడమే కాక వారి హక్కులకోసం ఉద్యమ బాట చైతన్యాన్ని రగిల్చింది. శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని సావిత్రిబాయి ప్రారంభించింది. 1854లోనే ఆమె తమ కవితా సంపుటి ‘కావ్య ఫూలే’ను ప్రచురించారు. కవితా సంపుటి ‘పావన కాశీ శుభోద్ రత్నాకర్’ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాలలో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. జ్యోతి రావు ఫూలే 1890 నవంబర్ 28న మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆ దుఃఖం లో నుండి మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త ఫూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. మన దేశంలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన అది. సనాతన వాదులు, అభివృద్ది నిరోధకులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికి ఆమె వెనక్కి తగ్గలేదు. 


1897లో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. ప్రాణాలను కాపాడుకోవడానికి జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. సావిత్రిబాయి పూలే కొడుకు యశ్వంత్‌తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులానికి చెందిన చిన్న పిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. అయితే ఆ ప్లేగు వ్యాధి ఆమెకూ సోకింది. 1897 మార్చి 10న సావిత్రిబాయి మరణించింది. 


భారతదేశ చరిత్రలో రెండు విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ఆధిపత్య కులాల స్త్రీల చరిత్ర, రెండోది అణగారిన వర్గాల, దళిత బహుజన స్త్రీల చరిత్ర. మొదటి వర్గానికి చెందిన వారి చరిత్ర ప్రధానంగా 19వ శతాబ్ది నుంచి కొంత వరకు ప్రాచుర్యంలో ఉన్నది. రెండో వర్గానికి చెందిన స్త్రీలు వివక్ష, దోపిడీకి గురికావడం, నిరక్షరాస్యులు కావడంతో చరిత్ర పుటలలో వారి త్యాగం కనుమరుగైంది. దీనికి భిన్నంగా నిస్సహాయ స్త్రీల అభ్యున్నతికి అక్షరమే ఆయుధంగా పాటుపడ్డ సావిత్రిబాయి ఫూలేను చూడవచ్చు. విద్యతోనే మత ఛాందస మూడ నమ్మకాల విముక్తి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక గుర్తింపు, స్వావలంబన ముడిపడి ఉంటుందని ఫూలే దంపతులు గుర్తించి భారత సమాజానికి కొత్త సిద్ధాంతాలు, విశ్లేషణలు చేయడమే కాకుండా ఆచరణాత్మకంగా నిలిచారు. 


ఆడపిల్లలు చదువుకోకూడదని మను ధర్మ శాస్త్రం శాసిస్తున్న కాలంలో సావిత్రిబాయి పూలే మహోన్నతమైన తిరుగుబాటు చేసింది. స్త్రీ విద్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని భారత స్త్రీ జాతి భూమ్యాకాశాలు ఉన్నంతవరకు నిరంతరం గుర్తు చేసుకుంటుంది. స్త్రీలూ మనుషులేనని వారి హక్కులే మానవ హక్కులని దేశానికి చాటిచెప్పిన ధీరవనిత. అంటరానితనాన్ని, కుల వ్యవస్థను ఆమె ఎదిరించిన తీరు భారతీయ మహిళా ఉద్యమాలకు ఆదర్శనీయం. భారతీయ స్త్రీ వాదం, దళిత స్త్రీ వాదాన్ని ఆచరణాత్మకంగా ప్రబోధించిన నాయకురాలు సావిత్రిబాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి. ఆమె 174 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఉద్యమ లక్ష్యాలు నేటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. మహిళలు, సమాజంలోని సమస్త వర్గాలు, లింగ, కుల, మత రహిత సమాజ శ్రేయస్సు, సంక్షేమం, సమానత్వం కోసం పని చేసిన వీర నారి సావిత్రి బాయి. ఆమె ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని చైతన్య పరచాల్సిన బాధ్యత ముఖ్యంగా నేటి యువ భారతీయుల భుజస్కంధాలపై ఉంది. 

ప్రొఫెసర్ తాటికొండ రమేష్

వైస్- ఛాన్సలర్, కాకతీయ యూనివర్సిటీ


                                            (రేపు సావిత్రిబాయి ఫూలే జయంతి)


Updated Date - 2022-01-02T08:25:32+05:30 IST