లింగతటస్థ అత్యాచార చట్టంపై నిపుణులు.. కేరళ హైకోర్టు తలోమాట!

ABN , First Publish Date - 2022-06-13T01:19:26+05:30 IST

లింగ తటస్థ అత్యాచార చట్టం ఉండాల్సిందేనా? భారత శిక్షాస్మృతిలో ఇలాంటి ఒక సవరణ అవసరమని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది. అయితే,

లింగతటస్థ అత్యాచార చట్టంపై నిపుణులు.. కేరళ హైకోర్టు తలోమాట!

కేరళ: లింగ తటస్థ అత్యాచార చట్టం ఉండాల్సిందేనా? భారత శిక్షాస్మృతిలో ఇలాంటి ఒక సవరణ అవసరమని కేరళ హైకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. అయితే, న్యాయ నిపుణులు మాత్రం ఈ విషయంతో విభేదిస్తున్నారు. కొందరు దీనిని ‘లోపభూయిష్టమైన అవగాహన’గా పేర్కొంటుంటే మరికొందరు మాత్రం ‘పితృస్వామ్య మనస్తత్వాన్ని’ ప్రదర్శించినట్టుగా ఉందని చెబుతున్నారు. పురుషుల్లో చాలామంది పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలను ముగ్గులోకి దింపి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్టు ఆరోపించే కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. అదే పని ఒక మహిళ చేస్తే ఏమవుతుంది? అని ప్రశ్నిస్తూ కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అత్యాచార నేరానికి శిక్ష విధించే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 376 లింగ తటస్థంగా ఉండాలని కేరళ హైకోర్టు ఇటీవల మౌఖికంగా గమనించింది.


విడాకులు తీసుకున్న దంపతుల మధ్య పిల్లల సంరక్షణ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఎ. ముహమ్మద్ ముస్తాక్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్త అత్యాచార కేసులో నిందితుడని, కాబట్టి అతడు తమ బిడ్డను చూసుకోవడానికి అనర్హుడని మహిళ ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. ఒక మహిళ అదే పని చేస్తే ఆమెపై విచారణ జరగదని, అదే పని పురుషుడు చేస్తే మాత్రం దోషిగా నిలబడతాడని పేర్కొంది. కాబట్టి సెక్షన్ 376 లింగ తటస్థంగా ఉండాలని అభిప్రాయపడింది. 


కోర్టు అభిప్రాయంతో సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ విభేదించారు. న్యాయమూర్తి చుట్టూ ఉన్న ఆవరణ లోపభూయిష్ట అవగాహనపై ఆధారపడిందని అన్నారు. దీనిని తాను పూర్తిగా విభేదిస్తున్నానని, ఎందుకంటే సెక్షన్ 376ని జెండర్ న్యూట్రల్‌గా చేయడం ద్వారా పురుషులను తప్పుగా ఇరికించే మహిళలను విచారించేలా చేయొచ్చని జస్టిస్ ముస్తాక్ సూచిస్తున్నట్టుగా ఉందని రెబెక్కా అన్నారు. సెక్షన్ 376 అనేది  అత్యాచారానికి పాల్పడిన వారిని విచారించడానికి ఉపయోగించే సెక్షన్ తప్పితే, తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులను ఉద్దేశించినది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాబట్టి జెండర్ న్యూట్రల్ తప్పుడు కేసుల సమస్యను పరిష్కరించదని ఆమె స్పష్టం చేశారు. 


ఈ నిబంధన తీసుకురావడం ద్వారా న్యాయమూర్తి ఆందోళన పరిష్కారం కాదని, తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను విచారించాలనుకుంటే అందుకు వేరే నిబంధన కావాలి తప్పితే సెక్షన్ 376 కాదని తేల్చి చెప్పారు. సీనియర్ న్యాయవాది జాజు బాబు మాట్లాడుతూ లైంగిక నేరాలకు గురైనవారు బలహీనంగా ఉండాలనే సాధారణ భావన ఉందని అన్నారు. పురుషుడు బలవంతుడుగా, స్త్రీ బలహీనురాలిగా పరిగణిస్తుండడంతో.. స్త్రీ పురుషుడిని లొంగదీసుకోవాలనే ఆలోచన అసంబద్ధంగా కనిపిస్తోందన్నారు.  

Updated Date - 2022-06-13T01:19:26+05:30 IST