న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోందని, సకాలంలో పాలనా యంత్రాంగానికి సహకరించాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సాయుధ దళాలకు పిలుపునిచ్చారు. సందర్భానికి తగినట్లుగా సకాలంలో స్పందించాలని కోరారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలను నిర్ణీత సమయంలో చేపట్టాలని తెలిపారు.
జనరల్ రావత్ త్రివిధ దళాలకు ఇచ్చిన సందేశంలో ఈ సమయంలో సకాలంలో సహకారం అందజేయడం చాలా ముఖ్యమని తెలిపారు. కోవిడ్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే చర్యలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు పౌర అధికార యంత్రాంగానికి సహకరించాలని పిలుపునిచ్చారు. త్రివిధ దళాల సభ్యులు అంకితభావంగలవారని, అడ్డంకులను ఛేదించే శక్తి, సామర్థ్యాలుగలవారని అన్నారు. మరింత సేవ చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారన్నారు. ‘‘మనం చేయగలం, మనం చేస్తాం. బాగా చేశారు, కొనసాగించండి, మనం ప్రయాణించవలసిన దూరం ఇంకా చాలా ఉంది’’ అని చెప్పారు.
కరోనా వైరస్ విజృంభణను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు త్రివిధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర విభాగాలు సహకరిస్తున్నాయి. భారత వాయు సేన విమానాలు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకులను శుక్రవారం నుంచి ఫిల్లింగ్ స్టేషన్లకు తీసుకెళ్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు అత్యవసర మందులను, పరికరాలను రవాణా చేస్తున్నాయి.