Apr 12 2021 @ 20:51PM

మ్యూజిక్ ఇండస్ట్రీలోకి జెమిని గ్రూప్

జెమిని అనగానే గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్‌ నటించిన 'జెమిని' చిత్రం. అలాగే ఇద్దరు బుడ్డోళ్లు బూరలు ఊదుతూ కనిపించే బొమ్మ. జెమిని సంస్థకు సంబంధించిన ఈ లోగో ఎంత ఫేమస్సో తెలియంది కాదు. భారతీయ సినీ పరిశ్రమలో జెమిని సంస్థది ఒక సువర్ణాధ్యాయం. వందల సినిమాల నిర్మాణం.. మరెందరో నటీనటులకు కెరీర్ ఇచ్చిన సంస్థ ఇది. జెమిని గ్రూపులో ఎన్నో సంస్థలు ఉన్నాయి. జెమిని ఫిల్మ్ సర్క్యూట్, జెమిని ఎఫ్‌ఎక్స్‌, జెమినీ స్టూడియోస్ లాంటి సహ సంస్థలు చాలానే ఉన్నాయి. 75 సంవత్సరాల చరిత్ర ఉన్న జెమినీ సంస్థ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జెమిని సంస్థ‌ల సీఈఓ పీవిఆర్ మూర్తి చేతుల మీదుగా జ‌రిగాయి. 


డైమండ్ జూబ్లీ సందర్భంగా జెమిని గ్రూప్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెడుతున్నట్లుగా ప్రకటించింది. జెమిని రికార్డ్స్ లేబుల్‌తో సంగీత ప్రపంచంలోకి అడుగు పెడుతుంది జెమిని సంస్థ. జెమినీ రికార్డ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్‌ను నిర్మించడమే కాకుండా.. సినిమాలకు కూడా పని చేయనున్నారు. సినిమా పాటలు ప్రొడ్యూస్ చేస్తుంది జెమిని రికార్డ్స్. అడుగు పెట్టిన ప్రతి చోట తనకంటూ ప్రత్యేక చరిత్ర లిఖించుకున్న జెమిని.. మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా తన విజయఢంకా మోగిస్తుందనేమో చూద్దాం.