Advertisement
Advertisement
Abn logo
Advertisement

గెలుపు శ్వాస

నువ్వొక సముద్రానివై ఘోషిస్తున్నా

నీ ఏడుపు కీచురాయికి కూడా చేరదు 

నీ లోలోపలి అరుపులకు దిక్కులు పిక్కటిల్లొచ్చు

ఈ బాహ్య ప్రపంచానికి 

కనీసం చీమ కుట్టినట్టయినా కాబోదు

నీ గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా

నీ చుట్టూ ఉన్న లోకానికి

చలిమంటగానైనా స్ఫురణకు రాదు

నీ ఆక్రందన

నీకు తప్ప ఇంకెవ్వరికీ వినిపించదు

అంతా ఒక ప్రీప్లాన్డ్‌ కుట్ర


It’s an evidenceless murder

ఇది నీ మనసుపై 

నిరంతర సామూహిక అత్యాచారం

నలిగే నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు


ఆలోచించుకునేలోపే

నీ కలలు పెకింలిచబడుతున్న జాడ

చూస్తుండగానే నిన్ను అంతం చేసే కుట్ర

నీకై మాటువేసిన పథక రచనకు

నిన్ను నువ్వే అప్పగించుకుంటున్న నిస్సహాయత

కన్నీళ్లు ఇంకిపోయిన కళ్లు

బాధ తాలూకు ఏ సాక్ష్యాన్ని చూపలేవు

అన్యాయపు చావులకు

పంచాయితీపెద్దలు నిర్ణయించిన బతుకు విలువ ఇది

తనువూ మనసూ

రెండూ... దగాపడుతూ దగ్ధమవుతున్న సందర్భం


నువ్వు కేవలం పావువు మాత్రమే

ఆట ఎప్పుడో నీ చేజారిపోయింది

సర్దుబాట్ల నడుమ

నీదొక ఒడవని సంగ్రామం

ఎవ్వరినీ నిందించకా

నీ అసలు ముఖాన్ని దాచి

సరికొత్త నటనల మాస్కును తగిలించుకున్నావు


ఇది నువ్వే సృష్టించుకున్న 

సాలీడు వల

ప్రేమగా తవ్వుకున్న ఆరడుగుల బొంద

ఎంత విలపించి ఏమి లాభం

గుట్టుచప్పుడు కాకుండా

ఈ పాత్రను నువ్వే సమర్థవంతంగా పోషించాలి


నిద్రలేచినప్పటి నుండి

నువ్వేం చేస్తున్నావని

రకరకాల పాత్రల్లోకి ఒదిగిపోతూ

గాయాలను కనిపించకుండా దాచిపెడుతున్నావు


గడియారం ముండ్ల ముందు

పదేపదే ఓడిపోతూ 

నిన్ను నువ్వే ఓదార్చుకుంటావు

కాలాన్ని గెలవాలని ఒక కలగంటావు

అది నీవల్లే కాదు

ఎవరి వల్లా కాదనే పచ్చి నిజాన్ని

భుజాన పెట్టుకొని ఊరేగుతుంటావు

దింపుడుకల్లం కుండను ఎత్తేసినట్టు

ఊపిరాడనివ్వని బరువును ఎత్తేయలేవు

గాయపడుతూ...

ముక్కుతూ, మూల్గుతూ

గెలుపును శ్వాసిస్తూ మొండిధైర్యంతో

మరో సాహసయాత్ర మొదలుపెడుతుంటావు

పసునూరి రవీందర్‌

77026 48825


Advertisement
Advertisement