Gehlot asks VP Dhankhar: మమతపై ఏం మ్యాజిక్ చేశావ్? ఉపరాష్ట్రపతితో గెహ్లాట్

ABN , First Publish Date - 2022-09-22T00:42:36+05:30 IST

జైపూర్: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధనకర్ అభినందన సందర్భంగా రాజస్థాన్ అసెంబ్లీలో సరదా ఘటన జరిగింది.

Gehlot asks VP Dhankhar: మమతపై ఏం మ్యాజిక్ చేశావ్? ఉపరాష్ట్రపతితో గెహ్లాట్

జైపూర్: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధనకర్ అభినందన సభ సందర్భంగా రాజస్థాన్ అసెంబ్లీలో సరదా ఘటన జరిగింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్‌కు దూరమయ్యేలా టఫ్ లేడీ మమతా బెనర్జీపై ఏం మ్యాజిక్ చేశారని జగ్‌దీప్ ధనకర్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సరదాగా ప్రశ్నించారు. ధనకర్‌ గవర్నర్‌గా ఉన్న మూడేళ్లూ మమతతో విభేదాల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని గెహ్లాట్ గుర్తు చేశారు. అంత తేలిగ్గా లొంగని మమతా బెనర్జీని ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరయ్యేలా ఎలా చేయగలిగారని ధనకర్‌ను గెహ్లాట్ ప్రశ్నించారు. రహస్యమేంటో చెప్పాలన్నారు. గెహ్లాట్ మాటలతో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధనకర్ సహా అక్కడున్న వారంతా నవ్వేశారు. 


గెహ్లాట్ ప్రశ్నకు జవాబు చెబుతూ ధనకర్ తాను రాజకీయాలకు అతీతమన్నారు. అయితే రాజకీయ నాయకులు ఎప్పుడు, ఎందుకు, ఏ నిర్ణయాలు తీసుకుంటారో వారికే తెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అలాగే ప్రతిపక్ష నాయకురాలు వసుంధరా రాజే...  ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు గైర్హాజరైందో తేల్చాలని ధన్‌కర్ సరదాగా వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సత్సంబంధాలు నెలకొల్పే విషయంపై ఓసారి వసుంధరా రాజే సలహా కూడా తీసుకున్నానని ధనకర్ గుర్తు చేసుకున్నారు. 


జగ్‌దీప్ ధనకర్ పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు మమతతో ఆయనకున్న విభేదాలపై ప్రతిరోజూ మీడియాలో కథనాలు వచ్చేవి. గొడవలు తీవ్ర స్థాయికి వెళ్లినట్లుగా కూడా కథనాలు వెలువడేవి. అలాంటిది జగ్‌దీప్ ధనకర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే మమతా బెనర్జీ పాత గొడవలన్నీ మరచిపోయారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని మమత ప్రకటించడంతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు గైర్హాజరయ్యారు. అప్పట్లో ఇది మమత తీసుకున్న మరో సంచలన నిర్ణయంగా కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. తన రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కావడంతో గౌరవసూచకంగా మమత ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ పరిశీలకుల అంచనా.


గతంలో బీహార్ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించగానే నాడు ఎన్డీయేలోలేని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆయనకు మద్దతు ప్రకటించారు. సరిగ్గా ఇదే తరహాలో మమతాబెనర్జీ కూడా తన రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్ ధన్‌కర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించగానే రాజకీయ విభేదాలన్నీ పక్కనపెట్టి మద్దతిచ్చారు. తద్వారా రాజకీయ పరిపక్వతను చాటారు.   


Updated Date - 2022-09-22T00:42:36+05:30 IST