రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని విస్మరించి.. దేశ రాజకీయాలపై ఆలోచనా?

ABN , First Publish Date - 2022-05-26T10:39:55+05:30 IST

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల ఆరోగ్యం గురించి మరిచిపోయి.. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ బిజీ అయిపోయారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,

రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని విస్మరించి..   దేశ రాజకీయాలపై ఆలోచనా?

-కేసీఆర్‌ ఎన్నికల నాటి హామీలను మరిచారు

-రాష్ట్రంలో ఇంకా ఉమ్మడి ఏపీలోని ఆస్పత్రులే..!

-ఏడాదిలో ఎన్నికలు.. వాగ్దానాల అమలెప్పుడు?

-మ్యానిఫెస్టోను కేసీఆర్‌కు గుర్తుచేస్తున్నాం

- పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి 

-ఢిల్లీ దవాఖానాలు బాగున్నాయంటే.. 

తెలంగాణలో  బాగాలేవనే కదా?: గీతారెడ్డి

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల ఆరోగ్యం గురించి మరిచిపోయి.. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ బిజీ అయిపోయారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీలు.. హామీలుగానే ఉండిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికీ సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రులే కొనసాగుతున్నాయని, కొత్తవి ఏమీ లేవని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజారోగ్యంపై చేసిన వాగ్దానాలు 8ఏళ్లయినా ఎందుకు అమలు చేయలేదని కేసీఆర్‌ను పశ్నించారు. గాంధీభవన్‌లో బుధవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డితో కలిసి జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో బిజీ అయిన కేసీఆర్‌కు.. గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఏదని నిలదీశారు. ‘‘సీఎం చెప్పినదాని ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 33 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలి. కేసీఆర్‌.. మరి వాటిని ఎప్పుడు నిర్మిస్తున్నారు. తెలంగాణలో మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయి. ఇచ్చిన మాట అమలు సంగతి ఏం చేశారు? రాష్ట్రంలోని 590 మండలాల్లో, నియోజకవర్గానికి ఒక వంద పడకల ఆస్పత్రికి ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు? మీ వాగ్దానం నెరవేర్చేందుకు ఈ ఏడాదిలోనే ఈ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలి’’ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోనే మర్చిపోయారని.. అందులో ఉన్నవాటినే తాము ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు. వీటిపై  ప్రభుత్వం స్పందించకుంటే కార్యాచరణ చేపడతామన్నారు. పేదలకు భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ.. కేసీఆర్‌ సీఎం అయ్యాక కనుమరుగైందన్నారు. గీతారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో బస్తీ దవాఖానాలు బాగున్నాయని కేసీఆర్‌ అంటున్నారంటే.. తెలంగాణలో ఆస్పత్రులు బాగాలేవనే అర్థం కదా? అని పేర్కొన్నారు. పంటి నొప్పికి ఢిల్లీకి, ఛాతీ నొప్పికి యశోదాకు వెళ్లే కేసీఆర్‌.. ఎప్పుడైనా ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే వాస్తవాలు  తెలుస్తాయని సూచించారు. టిమ్స్‌ను ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే కేసీఆర్‌.. వాటి అమలులో మాత్రం జీరో అంటూ విమర్శించారు.

Updated Date - 2022-05-26T10:39:55+05:30 IST