GDP జోష్

ABN , First Publish Date - 2021-12-01T08:33:37+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభ పూర్వ స్థాయికి పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021- 22) జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను భారత స్థూల దేశీయోత్పత్తి ....

GDP జోష్

 ప్రీ-కొవిడ్‌ స్థాయికి జీడీపీ విలువ.. సెప్టెంబరు త్రైమాసికంలో  వృద్ధి రేటు 8.4%

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభ పూర్వ స్థాయికి పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021- 22) జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి గాను భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.4 శాతానికి పెరిగింది. దేశం వృద్ధి పథంలో పయనించడం వరుసగా ఇది నాలుగో త్రైమాసికం. అంతేకాదు, ఈసారి వృద్ధి విశ్లేషకుల అంచనాలను సైతం మించింది. లో బేస్‌ ఎఫెక్ట్‌ (గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి జీడీపీ చాలా తక్కువగా నమోదు కావడం) ఇందుకు ప్రధానంగా దోహదపడినప్పటికీ, జీడీపీ కరోనా ముందు స్థాయికి మించి నమోదైందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) తాజా డేటా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు వార్షిక ప్రాతిపదికన  మైనస్‌ 7.4 శాతానికి క్షీణించింది. అంతకంటే ముందు త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లోనైతే ఏకంగా మైనస్‌ 24.4 శాతానికి పతనమైంది. కరోనా తొలి దశ వ్యాప్తి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌, తదనంతర కఠిన ఆంక్షలు అందుకు కారణమయ్యాయి. ఈ ఏడాదిలోనూ కరోనా రెండో దశ వ్యాప్తి దేశాన్ని కుదిపేసినప్పటికీ.. రాష్ట్రాలు స్థానిక, పాక్షిక లాక్‌డౌన్‌లతో సరిపెట్టడంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి భారత్‌ 20.1 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలిగింది. 


చైనా కంటే అధిక వృద్ధి రేటు 

ఈ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి 4.9 శాతానికి పరిమితమైంది. ఈ లెక్కన భారత వృద్ధి రేటు చైనా కంటే అధికంగా నమోదైంది. అంతేకాదు, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ తన ఘనతను కొనసాగించింది. 


2021-22లో 9.5% వృద్ధి: ఎస్‌ అండ్‌ పీ 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా నమోదు కావచ్చన్న గత అంచనాలకు కట్టుబడి ఉన్నామని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ పేర్కొంది. గతంతో పోలిస్తే, 2022-23 వృద్ధి అంచనాలను మాత్రం 7.8 శాతానికి పెంచింది.  


రూ.35,73,451 కోట్లకు జీడీపీ 

ఎన్‌ఎ్‌సఓ గణాంకాల ప్రకారం.. ఈ జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి జీడీపీ విలువ రూ.35,73,451 కోట్లకు చేరుకుంది. కరోనా సంక్షోభానికి ముందు ఆర్థిక సంవత్సరమైన 2019-20లో ఇదే కాలానికి నమోదైన రూ.35,61,530 కోట్ల జీడీపీ కంటే అధికమిది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి జీడీపీ రూ.32,96,718 కోట్లకు పరిమితమైంది. ప్రథమార్ధంలో 13.7 శాతం వృద్ధి స్థిర ధరల (20211-12) ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి (ఏప్రిల్‌-సెప్టెంబరు) జీడీపీ రూ.68.11 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.59.92 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 13.7 శాతం


క్యూ3 వృద్ధికి ఒమైక్రాన్‌ సవాలు 

అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి పెరిగిన కమోడిటీల ధరలు, సరఫరా అవాంతరాలు దేశీయ వస్తు తయారీ రంగ పురోగతికి ఇప్పటికే సవాలుగా మారాయని ఆర్థికవేత్తలంటున్నారు. ఈ నేపథ్యంలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’ ఆర్థిక వ్యవస్థను మళ్లీ అనిశ్చితిలోకి నెట్టిందని వారన్నారు. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగినా లేదంటే తీవ్రతరమైతే వ్యాపారాలు, వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపవచ్చని, తత్ఫలితంగా అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక (క్యూ3) వృద్ధికి గండికొట్టే ప్రమాదం లేకపోలేదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రెండంకెల వృద్ధిని నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. పెరుగుతున్న గిరాకీ, సమృద్ధికరమైన బ్యాంకింగ్‌ రంగం ఇందుకు దోహదపడనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం రెండో టర్మ్‌లో చేపట్టిన సంస్కరణలు ఈ దశాబ్దంలో వృద్ధి 7 శాతానికి ఎగువనే నమోదయ్యేందుకు తోడ్పడనున్నాయి. 

- కేవీ సుబ్రమణియన్‌, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు

Updated Date - 2021-12-01T08:33:37+05:30 IST