రోగగ్రస్తుని ఆరోగ్య గొప్పలు!

ABN , First Publish Date - 2022-06-04T06:24:44+05:30 IST

మనఆర్థిక వ్యవస్థ కష్టాల నుంచి గట్టెక్కిందా? జాతీయ ఆదాయం, స్థూల దేశియోత్పత్తి (జీడీపీ) త్రైమాసిక ఫలితాలపై తాత్కాలిక అంచనాలను..

రోగగ్రస్తుని ఆరోగ్య గొప్పలు!

మనఆర్థిక వ్యవస్థ కష్టాల నుంచి గట్టెక్కిందా? జాతీయ ఆదాయం, స్థూల దేశియోత్పత్తి (జీడీపీ) త్రైమాసిక ఫలితాలపై తాత్కాలిక అంచనాలను జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గత నెల 31న విడుదల చేసింది. ఆ సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు మాటల్లో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు విషయమై నిండు ఆశాభావం వ్యక్తమవలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా కష్టనష్టాల నుంచి గట్టెక్కలేదన్న విషయం ఆయనకూ తెలుసు, చాలామంది ఆర్థికవేత్తలకూ తెలుసు.


స్థిర ధరల ప్రాతిపదికన 2022 మార్చి 31న మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం (రూ. 145.16 లక్షల కోట్లు) 2020 మార్చి 31నాటి పరిమాణం (రూ.147.36 లక్షల కోట్లు)తో ఇంచుమించు సమాన స్థాయిలో ఉంది. ఇది మహా విచారకరమైన వార్త. పైగా చాలా మంది పేదరికంలోకి జారిపోయారు. ఈ రెండేళ్లలో తలసరి ఆదాయం రూ.1,08,247 నుంచి రూ.1,07,760కి తగ్గిపోయింది.

2021–22లో జీడీపీ త్రైమాసికాల వృద్ధిరేట్లు అంతకంతకూ పడిపోవడం మరింత శోచనీయం. ఈ వృద్ధిరేట్లు వరుసగా 20.1, 8.4, 5.4, 4.1గా ఉన్నాయి. కొవిడ్‌కు ముందు సంవత్సరం 2019–20లో నాల్గవ త్రైమాసికం జీడీపీ రూ.38,21,081 కోట్లుగా ఉంది. 2021 నాల్గవ త్రైమాసికంలో మాత్రమే ఆ అంకెను మనం అధిగమించాం. ఆ త్రైమాసికంలో మన జీడీపీ రూ.30,78,025 కోట్లుగా నమోదయింది.


భారత్ ఇప్పుడు 8.7 శాతం వార్షిక వృద్ధిరేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. అయితే ద్రవ్యోల్బణ తీవ్రత, నిరుద్యోగం, దారిద్ర్యరేఖకు అధోస్థానంలో ఉన్న అభాగ్యుల సంఖ్య, పెరుగుతున్న ఆకలి దప్పులు, ఆరోగ్య, విద్యా సూచకాల పతనం మొదలైన వాస్తవాల దృష్ట్యా ఈ వృద్ధిరేటు గురించిన మన గొప్పలు పూర్తిగా ప్రగల్భాలు మినహా మరేమీ కాదని చెప్పక తప్పదు. నిజమే, 8.7 శాతం వృద్ధిరేటు చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే దానిని సాపేక్షంగా చూడవలసిన అవసరముంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల వృద్ధిరేటు (–) 6.6 శాతం రికార్డయిందన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. 2021లో చైనా ఆర్థిక వ్యవస్థ 8.1 శాతం వృద్ధిరేటుతో పురోగమించినప్పుడు ఆ దేశం ఆ పన్నెండు నెలల కాలంలో తన జీడీపికి 2600 బిలియన్ కోట్ల డాలర్లను అదనంగా చేర్చుకున్నది. మరి మనం 2021–22లో 8.7 శాతం వృద్ధిరేటుతో మనం ఆ పన్నెండు నెలల కాలంలో మన జీడీపీకి అదనంగా చేర్చుకున్నది కేవలం 500 బిలియన్ డాలర్లు మాత్రమే!


ఇక ఇప్పుడు 2022–23 ఆర్థిక సంవత్సరంలోనూ, ఆ తరువాత మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఎలా ఉండనున్నదో చూద్దాం. మన దేశానికి వెలుపల ఒక ప్రపంచం ఉందన్న విషయాన్ని మరచిపోయాం. ప్రపంచ మార్కెట్లు, ఉత్పత్తులు, పెట్టుబడి, సాంకేతికతలు, నవ కల్పనలు మనకు అవసరం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ, వడ్డీరేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. డిమాండ్ పెరుగుదల నిరుత్సాహపరుస్తోంది. పదే పదే లాక్‌డౌన్‌ల కారణంగా చైనా జీడీపీ పెరుగుదల స్తంభించిపోవచ్చు. గ్యాస్ ధరల పెరుగుదలతో యూరోపియన్ కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతోంది.


2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును ఐఎమ్ఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) 4.4 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గించిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ గత నెల 4న వెల్లడించింది. అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా 2022లో ప్రపంచ వాణిజ్య పెరుగుదల రేటును 4.7 శాతం నుంచి 3.0 శాతానికి తగ్గించింది. సవరించిన వృద్ధిరేటు ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్యోల్బణ రేటు 5.7 శాతంగా ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 8.7 శాతంగా ఉంటుందని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది. ఈ సవరణలకు కారణమేమిటి? ‘ అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం, సరుకుల ధరల పెరుగుదల, సరఫరాలకు ఆటంకాలు, సంపన్న ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య విధానానికి పెను సవాళ్లు’ మొదలైన వాటిని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ పేర్కొంది. భారత ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా ఈ విషయాలను పట్టించుకుంటున్నారా అనేది నాకు సందేహమే.


ఆర్థిక వ్యవస్థ సత్వర పెరుగుదలకు దోహదం చేసే ఐదు కీలక అంశాలను ఆర్బీఐ నెలవారీ నివేదిక (మే, 2022) పేర్కొంది. అవి: ప్రైవేట్ మదుపులు; అధిక మొత్తంలో ప్రభుత్వ మూలధన వ్యయాలు; మెరుగైన మౌలిక సదుపాయాలు; అల్ప, స్థిర ద్రవ్యోల్బణం; స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం. ఈ ఐదు అంశాలలో ప్రభుత్వానికి కేవలం ‘ప్రభుత్వ మూలధన వ్యయాల’పైన మాత్రమే నియంత్రణ ఉన్నది. అయితే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులలో మరింతగా మదుపు చేయగల సామర్థ్యం పరిమితంగా మాత్రమే ఉంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అనంతరం చేపట్టిన ఇంధన పన్నులలో కోత, సబ్సిడీల పెంపు, సంక్షేమ వ్యయాల పెంపు చర్యల వల్ల మూలధన వ్యయాల సామర్థ్యం ప్రభుత్వానికి బాగా తగ్గిపోయిందని చెప్పక తప్పదు. సరఫరాలకు ఆటంకాలు ఏర్పడుతున్నంతవరకు ప్రైవేట్ మదుపులు పెరిగే అవకాశం ఎంతమాత్రం లేదు. కెయిర్న్, హచిన్సన్, హార్లే–డేవిడ్ సన్, జనరల్ మోటార్స్, ఫోర్డ్, హోల్సిమ్, సిటీబ్యాంక్ మొదలైనవి మన దేశం నుంచి నిష్క్రమిస్తున్నాయి, కొన్ని ఇప్పటికే వెళ్లిపోయాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపడాలంటే టెండర్ల విధానం, ధరల నిర్ణయం, ప్రాజెక్టుల సత్వర అమలు, జవాబుదారీతనం మొదలైన ప్రక్రియలు, కార్యకలాపాలలో మౌలిక మార్పులు చోటుచేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మన మౌలిక సదుపాయాల పరిమాణాన్ని పెంచుకుంటున్నామే కాని నాణ్యతను మెరుగుపరచుకోవడం లేదు. ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంకు సంబంధించి మోదీ సర్కార్‌కు సరైన అవగాహన ఉందని ఆ ప్రభుత్వ పాత రికార్డు చెప్పడం లేదు.


మరొక పెద్ద సమస్య కూడా ఉంది. దేశంలోని మొత్తం కార్మిక శ్రేణులలో 40శాతం మంది కూడా ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనకపోతే ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధిలో అగ్రగామి ఎలా అవుతుంది? మన శ్రామిక ప్రజలలో చాలా మంది ఎటువంటి పని చేయడంలేదు. బాలికల అక్షరాస్యత పెరిగినప్పటికీ ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటున్న మహిళలు చాలా తక్కువ (9.4 శాతం)గా ఉంది. ప్రస్తుతం నిరుద్యోగం రేటు 7.1 శాతంగా ఉందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. మన ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్తంగా ఉంది. రోగ నిర్ణయం ప్రశస్తంగా ఉంది. ఫార్మసీలో ఔషధాలకు కొదువ లేదు. అయితే చికిత్స చేయవలసిన డాక్టర్లు నకిలీ డాక్టర్లు. లేదంటే మరణ యాతనలో ఉన్న రోగులపట్ల కించిత్ మానవతా శ్రద్ధ చూపనివారు మాత్రమే!


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-06-04T06:24:44+05:30 IST