Abn logo
Aug 25 2020 @ 00:13AM

పర్యావరణ రక్షణతో జీడీపీ వృద్ధి

Kaakateeya

పర్యావరణానికి జరిగే నష్టం స్థూల దేశీయోత్పత్తిని గణనీయంగా తగ్గించివేస్తుంది. పర్యావరణ చట్టాలను పటిష్ఠం చేసి, వాటిని శీఘ్రగతిన అమలుపరిచినప్పుడే జీడీపీ పెరుగుదల సాధ్యమవుతుంది. భద్ర పర్యావరణమే నిజమైన వృద్ధి బాట. 


పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ (ఇఐఏ నోటిఫికేషన్) లోని పలు అంశాలను నీరుగార్చివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. శీఘ్రగతిన ఫ్యాక్టరీలను నెలకొల్పేందుకు, మెగా సిటీల నేర్పాటు చేసేందుకు, హైవేల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు అవరోధంగా ఉన్న ఇఐఏ నోటిఫికేషన్ అంశాలను బలహీనపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. నిర్దిష్ట ప్రాజెక్టులను చేపట్టేందుకు విధిగా నిర్వహించవలసిన బహిరంగ విచారణ అనావశ్యకం చేసేందుకు, ప్రస్తుతం పర్యావరణ అనుమతి (ఇసి) లేకుండా అమలవుతున్న ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన అనంతరమే ఇసి మంజూరు చేసేలా సంబంధిత మంత్రిత్వశాఖకు సాధికారత కల్పించేందుకు నీటిపారుదల, నదులలో మట్టి తవ్వకాలు మొదలైన ప్రాజెక్టులకు ఇసి నిబంధనల నుంచి మినహాయింపునివ్వడం ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. మెగాసిటీల ఏర్పాటు, పరిశ్రమల స్థాపన, హైవేల నిర్మాణం సత్వరమే పూర్తయ్యేందుకు తోడ్పడమే ప్రభుత్వ ఉద్దేశంగా కన్పిస్తున్నది. 


అయితే పర్యావరణానికి జరిగే నష్టం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ- ఒక దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు, సేవల మార్కెట్ విలువే స్థూల దేశీయోత్పత్తి)ని గణనీయంగా తగ్గించి వేస్తుంది. మన ‘హై నెట్ -వర్త్ ఇండివిడ్యువల్స్’ (ఆర్థిక వనరులు సమృద్ధంగా ఉన్న వ్యక్తులు)లో పలువురు భారత్ నుంచి విదేశాలకు వలసపోతున్నారు. వారితో పాటు వారి అపార ధనరాసులు కూడా విదేశాలకు తరలిపోతున్నాయి. భారత్‌లో పర్యావరణ కాలుష్యం మితిమీరిన స్థాయిలో ఉండడం వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ కారణంగానే ఆ సంపన్నులు వలసపోతున్నారు. కాలుష్యకారక పరిశ్రమల ఏర్పాటు జీడీపీ పెరుగుదలకు నేరుగా దోహదం చేస్తున్నప్పటికీ మన ధనం దేశాంతరం పాలవ్వడం వల్ల స్థూల దేశీ యోత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. 


మన దేశంలో తాజ్ మహల్, హిమాలయ పర్వత ప్రాంతాలు, గంగా నది, గోవా సముద్రతీరాలు, దక్షిణ భారతావనిలో అపూర్వ దేవాలయాలు మొదలైన అద్భుత పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. అయినా మన పర్యాటక రంగం ప్రపంచ యాత్రికులను ఆకట్టుకోలేకపోతోంది. మన పర్యావరణ నాణ్యత నాసిరకంగా ఉండడమే ఈ పర్యాటక దుస్థితికి కారణమని మరి చెప్పనవసరం లేదు. జీడీపీ పెరుగుదలే లక్ష్యంగా చేపట్టిన పలు ప్రాజెక్టులు వాస్తవంగా లక్ష్య విరుద్ధ ఫలితాలను మాత్రమే సమకూరుస్తున్నాయి! అయినప్పుడు పర్యావరణ నాణ్యత నాసిరకంగా కాక మరే విధంగా ఉంటుంది? ఉదాహరణకు నేషనల్ వాటర్ వే నెంబర్ 1 (ఎన్‌డబ్యు- 1)నే తీసుకోండి. గంగానదిపై ఈ జల  మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఒక టన్ను సామగ్రిని ఈ జల మార్గంపై ఒక కిలోమీటర్ రవాణా చేసేందుకు అయ్యే వ్యయం రూ.1.06 కాగా అదే దూరానికి రైలు రవాణాతో అయ్యే వ్యయం రూ.1.36. ఎన్‌డబ్ల్యు1 వల్ల టన్ను సామగ్రి రవాణాకు కిలోమీటర్‌కు 30 పైసలు ఆదా అవుతుందని అంటున్నారు. కావచ్చుగానీ మనం ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నాం. హాల్డియా నుంచి వారణాసికి రైలు మార్గం 800 కిలోమీటర్లు కాగా ఎన్‌డబ్ల్యు1 1300 కిలో మీటర్లు! ఆ రెండు నగరాల మధ్య గంగానది తిన్నగా గాక, అనేకానేక మలుపులు తిరుగుతూ ప్రవహిస్తుండడమే ఆ దూరాల మధ్య వ్యత్యాసానికి కారణమవుతున్నది. ఈ లెక్కన హాల్డియా నుంచి వారణాసికి ఒక టన్ను సామగ్రిని జల మార్గం ద్వారా రవాణా చేసేందుకు అవుతున్న వ్యయం రూ.1370 కాగా రైలు రవాణా వ్యయం రూ.1080 మాత్రమే. ఎన్‌డబ్ల్యు1 ద్వారా టన్ను సామగ్రి రవాణా వ్యయం కిలో మీటర్‌కు చాలా తక్కువగా ఉన్నప్పటికీ మొత్తం ఖర్చు రైలు రవాణా వ్యయం కంటే అధికం. 


హాల్డియా-–వారణాసి జలమార్గం మన స్థూల దేశీయోత్పత్తికి హాని చేస్తుందనేది స్పష్టం. పైగా నిత్య ప్రవాహిని గంగానదిలో డాల్ఫిన్లు, హిల్సా తదితర మత్స్యజాతుల జీవులకు జరిగే నష్టం, నీటి నాణ్యత క్షీణించడం మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆ నష్టం అపరిమితంగా ఉంటుందనేది మరి చెప్పనవసరం లేదు. అయినప్పటికీ భారత దేశీయ జలమార్గాల సంస్థ అధికారులు ఎన్‌డబ్ల్యు1 నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు! 


అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో న్యాయస్థానాల జోక్యానికి సంబంధించి చట్టబద్ధమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఉదాహరణకు వేదాంత కాపర్ ప్లాంట్ వ్యవహారాన్నే తీసుకోండి. పర్యావరణ సంబంధిత నిబంధనల ఉల్లంఘన జరిగిందనే కారణంతో ఆ ప్లాంట్‌ను మూసివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వేదాంత ఫ్యాక్టరీ మూత పడింది. ఫలితంగా రాగి (కాపర్) లోహాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనివార్యమయింది. దీనివల్ల జీడీపీకి భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ వాస్తవాల దృష్ట్యా పర్యావరణ అనుమతుల విషయంలో ఒక సమతుల్య దృక్పథాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశానికి అమిత ప్రయోజనకరమైన వేదాంత కాపర్ ఫ్లాంట్ లాంటి పరిశ్రమ మూసివేతను అనివార్యం చేసిన న్యాయస్థానాలు పర్యావరణ విధ్వంసానికి అపారంగా దోహదం చేస్తున్న వందలాది పరిశ్రమల కార్యకలాపాలను ఎలాంటి ఆక్షేపణలు లేకుండా అనుమతిస్తున్నాయని నేను అభిప్రాయపడుతున్నాను. శ్రీనగర్ హైడ్రోపవర్ ప్రాజెక్టు జీడీపీకి ఎనలేని నష్టాన్ని కలిగిస్తుందని నేను నా సొంత అనుభవం నుంచి చెప్పగలను. ఆ ప్రాజెక్టు ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.9 వ్యయంతో ఉత్పత్తి చేస్తున్నది. అయితే ఇండియా ఎనర్జీ ఎక్స్ఛేంజ్ నుంచి ఒక యూనిట్ విద్యుత్ కేవలం రూ.4కే లభ్యమవుతున్నది. శ్రీనగర్ హైడ్రోపవర్ పాజెక్ట్ ఉత్పత్తి చేస్తున్న ప్రతి ఒక్క యూనిట్ విద్యుత్‌తో మన స్థూల దేశీయోత్పత్తికి రూ.5 నష్టం వాటిల్లుతోంది. అయినప్పటికీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ ప్రాజెక్‌్టను అనుమతిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మదుపు చేశారన్న కారణంగా సుప్రీం కోర్టు అనుమతిస్తోంది. ఇదెంతవరకు సబబు? 


సరే, పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులను న్యాయస్థానాలు సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆర్థిక కార్యకలాపాలతో సంబంధమున్న పర్యావరణ కేసుల విచారణను వేగవంతంగా పూర్తి చేసి తీర్పులు వెలువరించే విషయమై భారత ప్రధాన న్యాయమూర్తితో ప్రధానమంత్రి స్వయంగా సమావేశమై సంప్రదింపులు జరిపి సముచిత నిర్ణయం తీసుకోవాలి. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే జాతీయ హరిత ట్రిబ్యునల్, హై కోర్టులు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుత సంఖ్యకు ఐదు రెట్లు పెంచాలి. తద్వారా జీడీపీ పెరుగుదలకు దోహదం చేసే ప్రాజెక్టులకు చెందిన కేసులలో సత్వర పరిష్కారం సాధ్యమవుతుంది. న్యాయ మూర్తుల సంఖ్యను పెంచడంతో పాటు న్యాయస్థానాల పనిదినాల సంఖ్యను సైతం పెంచి తీరాలి. సుప్రీంకోర్టు ఏడాదికి 190 రోజులు మాత్రమే పనిచేస్తున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడయింది. అలాగే హైకోర్టులు ఏడాదికి 232 రోజులు, క్రింది స్థాయి కోర్టులు 244 రోజులు మాత్రమే పనిచేస్తున్నట్టు అదే అధ్యయనం పేర్కొంది. అన్ని న్యాయస్థానాలూ ఏడాదికి విధిగా 280 రోజులు పనిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్ట వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...