Abn logo
Nov 28 2020 @ 01:06AM

వేగంగా వృద్ధి రికవరీ

క్యూ1తో పోల్చితే క్యూ2లో పుంజుకున్న జీడీపీ

సెప్టెంబరు త్రైమాసికంలో -7.5 శాతంగా నమోదు

గణాంకాలు విడుదల చేసిన కేంద్రం 


న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వరుసగా రెండో త్రైమాసికంలోనూ మైన్‌సలో నమోదైంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)  సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.5 శాతానికి క్షీణించింది. దీంతో మన ఆర్థిక వ్యవస్థ టెక్నికల్‌ గా తొలిసారిగా మాంద్యంలోకి జారుకున్నట్లైంది. కరోనా వైరస్‌ కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ దెబ్బకు జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో వృద్ధి మైనస్‌ 23.9 శాతానికి పతనమైన సంగతి విదితమే. వరుసగా రెండు త్రైమాసికాల పాటు రుణాత్మక వృద్ధి నమోదైతే సాంకేతికంగా ఆ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్నట్లుగా పరిగణిస్తారు. 


అంచనాల కంటే మెరుగ్గానే.. 

జూలై-సెప్టెంబరు త్రైమాసిక వృద్ధి మైన్‌సలోనే కొనసాగినప్పటికీ.. పలు రేటింగ్‌ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు, విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గానే నమోదైంది. మాన్యుఫాక్చరింగ్‌ రంగం పనితీరు పుంజుకోవడం (0.6 శాతం వృద్ధి), వ్యవసాయ రంగంలో ఆశాజనక వృద్ధి ఇందుకు దోహదపడింది. ఈ పండగ సీజన్‌లో మార్కెట్లో గిరాకీ భారీగా పుంజుకోవడం తో అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ వృద్ధి మరింత మెరుగపడవచ్చని ఆర్థిక విశ్లేషకులు, పారిశ్రామిక వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయని వారు పేర్కొన్నారు. క్యూ3 జీడీపీ గణాంకాలను 2021 ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం  (ఎన్‌ఎ్‌సఓ) వెల్లడించింది. 


క్యూ2 గణాంకాలు 

  • రూ.33.14 లక్షల కోట్లు: స్థిర (2011-12) ధరల ఆధారిత జీడీపీ. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ.35.84 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 7.5 శాతం క్షీణత. 
  • రూ.47.22 లక్షల కోట్లు: ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీ. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ.49.21 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 4 శాతం పతనం. 
  • రూ.30.49 లక్షల కోట్లు:  స్ధిర (2011-12) ధరల ఆధారిత కనీస ధరల ప్రకారం లెక్కించిన స్థూల విలువ జోడింపు (జీవీఏ).గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ.32.78 లక్షల కోట్ల జీవీఏతో పోలిస్తే 7 శాతం క్షీణత. 
  • రూ.42.80 లక్షల కోట్లు: ప్రస్తుత ధరల ఆధారిత కనీస ధరల ప్రకారం లెక్కించిన జీవీఏ. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ.44.66 లక్షల కోట్ల జీవీఏతో పోలిస్తే 4.2 శాతం పతనం. 


ఆయా రంగాల వృద్ధి (స్థూల విలువ జోడింపు-జీవీఏ)

    రంగం (%) క్యూ2 క్యూ1(%)

వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్‌ 3.4 3.4

మైనింగ్‌, క్వారీయింగ్‌ -9.1 -23.3

మాన్యుఫాక్చరింగ్‌ 0.6 -39.3

విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా తదితర యుటిలిటీ సేవలు 4.4 -7.0

నిర్మాణం -8.6 -50.3

వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలు -15.6 -47.0 

ఫైనాన్షియల్‌, రియల్‌ ఎస్టేట్‌, వృత్తి నైపుణ్య సేవలు      -8.1  -5.3

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, రక్షణ,తదితర సేవలు -12.2 -10.3


కోలుకోని కీలక రంగాలు 

అక్టోబరులో వృద్ధి -2.5 శాతానికి పతనం 

దేశంలోని 8 కీలక రంగాల వృద్ధి వరుసగా 8వ నెలలోనూ క్షీణించింది. అక్టోబరులో -2.5 శాతంగా నమోదైంది. ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్‌ రంగాల్లో ఉత్పత్తి భారీగా క్షీణించడం ఇందుకు కారణమైంది. బొగ్గు, ఎరువులు, విద్యుత్‌, సిమెంట్‌ రంగాల ఉత్పత్తిలో మాత్రం సానుకూల వృద్ధిని నమోదైంది. 2019 అక్టోబరులో ఈ 8 రంగాల ఉత్పత్తి వార్షిక ప్రాతిపదికన 5.5 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన 7 నెలల కాలాని (ఏప్రిల్‌-అక్టోబరు)కి వృద్ధి 13 శాతం క్షీణించింది. 


రూ.9.53 లక్షల కోట్లకు ద్రవ్య లోటు బడ్జెట్‌ అంచనాల్లో 120 శాతానికి సమానం 

ఈ అక్టోబరు చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు రూ.9.53 లక్షల కోట్లకు పెరిగింది. 2020-21 బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఇది 120 శాతానికి సమా నం. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపార కార్యకలాపాలు తగ్గడంతో కేంద్రానికి పన్ను ఆదాయం భారీగా పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనూ మొదటి 7 నెలల (ఏప్రిల్‌-అక్టోబరు) కాలానికి ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచలకు 102.4 శాతంగా నమోదైంది. ప్రభుత్వానికి ఆయా మార్గాల్లో సమకూరే ఆదాయానికి-వ్యయానికి మధ్య వ్యత్యాసాన్నే ద్రవ్యలోటు అంటారు. మార్కెట్‌ నుంచి రుణాల సమీకరణ ద్వారా ప్రభుత్వం ఈ లోటును పూడ్చుకుంటుంది. 


జీడీపీ వృద్ధి పునరుద్ధరణ అంచనాల కంటే వేగంగా జరుగుతోందనడానికి ప్రస్తుత గణాంకాలే సంకేతం. దీన్నిబట్టి చూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధి అంచనాలను మరింత మెరుగుపర్చే అవకాశం ఉంది. కరోనా సంక్షోభ అనిశ్చితి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌పై జాగురూకతతో కూడిన ఆశావాదం కలిగి ఉండాలి. పతన బాటలో పయనిస్తు న్న  జీడీపీ మళ్లీ వృద్ధి పథంలోకి క్యూ3 లేదా క్యూ4లో చేరుకుంటుందా అనే విషయం ఇప్పుడే చెప్పలేం. 

కేవీ సుబ్రమణియన్‌, ప్రధాన ఆర్థిక సలహాదారు

Advertisement
Advertisement
Advertisement