జీడీపీ 7 ఏళ్ల కనిష్ఠం

ABN , First Publish Date - 2020-02-29T06:59:51+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించింది. 2019 అక్టోబరు-డిసెంబరు (మూడో త్రైమాసికం)లో వృద్ధి 4.7 శాతానికి దిగజారింది. ఇది ఏడేళ్ల కనిష్ఠ స్థాయి. తయారీ రంగంలో నెలకొన్న క్షీణత జీడీపీ వృద్ధిని దెబ్బతీస్తోంది. 2018-19 ఇదేకాలంలో ...

జీడీపీ 7 ఏళ్ల కనిష్ఠం

  • మూడో త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదు
  • తయారీ రంగంలో క్షీణతే కారణం

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించింది. 2019 అక్టోబరు-డిసెంబరు (మూడో త్రైమాసికం)లో వృద్ధి 4.7 శాతానికి దిగజారింది. ఇది ఏడేళ్ల కనిష్ఠ స్థాయి. తయారీ రంగంలో నెలకొన్న క్షీణత జీడీపీ వృద్ధిని దెబ్బతీస్తోంది. 2018-19 ఇదేకాలంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి 5.6 శాతంగా ఉందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ ఓ) శుక్రవారంనాడు వెల్లడించింది. 2019 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు జీడీపీలో వృద్ధి 6.3 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 6.3 శాతంగా ఉంది. కాగా 2019-20 మొదటి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటును 5 శాతం నుంచి 5.6 శాతానికి, రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబరు) వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించారు. 2019-20 సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 5 శాతంగా ఉండవచ్చని రెండో ముందస్తు అంచనాలో ఎన్‌ఎ్‌సఓ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 5 శాతంగా ఉండే అవకాశం ఉందని భారత రిజర్వు బ్యాంకు కూడా ఇంతకు ముందు అంచనా వేసింది.

ఇంతకు ముందు 2012-13 జనవరి-మార్చిలో జీడీపీ వృద్ధి 4.3 శాతంగా నమోదైంది. 

స్థిర ధరల (2011-12) వద్ద జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దాదాపు రూ.36.65 లక్షల కోట్లుగా ఉంది. 2018-19 మూడో త్రైమాసికంలో ఇది రూ.35 లక్షల కోట్లుగా నమోదైంది. వృద్ధి 4.7 శాతంగా ఉంది.

ప్రస్తుత ధరల వద్ద 2019-20 సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.1,34,432 ఉన్నట్టు అంచనా. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.1,26,521)తో పోల్చితే వృద్ధి 6.3 శాతంగా ఉంది. 


చైనా పరిస్థితీ అంతే.. 

ఇక పొరుగు దేశం చైనా విషయానికి వస్తే 2019 అక్టోబరు-డిసెంబరు కాలంలో ఆర్థిక వృద్ధి 6 శాతంగా ఉంది. గత 27 ఏళ్లలో ఇదే బలహీన వృద్ధి రేటు. 2019 క్యాలెండర్‌ సంవత్సరంలో చైనా వృద్ధి రేటు 6.1 శాతంగా ఉంది. మూడు దశాబ్దాల కాలంలో ఇదే మందకొడి వృద్ధి రేటు. 


మౌలిక రంగంలో 2.2 శాతం వృద్ధి

జనవరి నెలలో ఎనిమిది కీలక పరిశ్రమల్లో 2.2 శాతం వృద్ధి నమోదైంది. బొగ్గు (8 శాతం), రిఫైనరీ ఉత్పత్తులు (1.9 శాతం), విద్యుత్‌ (2.8 శాతం) రంగాల ఉత్పత్తి పెరగడం ఇందుకు దోహదపడింది. 2019 జనవరిలో మౌలిక రంగం 1.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. చమురు, సహజ వాయువు, ఫెర్టిలైజర్‌ రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది.


విత్త లోటు 128.5 శాతం

జనవరి చివరి నాటికి బడ్జెట్‌ లక్ష్యంలో దేశ విత్త లోటు 128.5 శాతానికి చేరుకుందని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఆకౌంట్స్‌ (సీజీఏ) వెల్లడించింది. 2018-19 ఇదే కాలంలో విత్త లోటు 121.5 శాతంగా ఉంది. రాబడి, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విత్త లోటుగా చెబుతారు. ప్రస్తుతం ఇది రూ.9,85,472 కోట్లుగా ఉంది. 2020 మార్చి 31 నాటికి విత్త లోటును రూ.7,66,846 కోట్లకు పరిమితం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2019-20 సంవత్సర ద్రవ్య లోటు లక్ష్యాన్ని ఇటీవలి బడ్జెట్‌లో  3.3 శాతం నుంచి 3.8 శాతానికి పెంచారు. ఏప్రిల్‌-జనవరిలో రాబడి వసూళ్లు రూ.12.5 లక్షల కోట్లుగా ఉంది. ఇక జనవరి చివరి నాటికి మొత్తం వ్యయాలు రూ.22.68 లక్షల కోట్లుగా ఉన్నాయి.



ఆందోళన అవసరం లేదు: నిర్మలా సీతారామన్‌

దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం అనేది మంచి సంకేతమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.  ఒక్కసారిగా గణాంకాల్లో వృద్ధి ఉంటుందని తాను ఆశించడం లేదన్నారు. జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో  నిర్మలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా వ్యాప్తికి సంబంధించి ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే రెండు మూడు వారాలు కొనసాగితే సవాలుగా మారే అవకాశం ఉందని మాత్రం ఆమె చెప్పారు. మన దేశంలోని ఫార్మాసూటికల్‌, ఎలక్ర్టానిక్‌ పరిశ్రమలు అత్యధికంగా చైనా నుంచి వచ్చే ముడిసరుకులపై ఆధారపడి ఉన్నాయి. అవసరమైతే విమానాల ద్వారా అత్యవసర ఉత్పత్తులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


కనిష్ఠ స్థాయికి చేరింది...

ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్షీణత కనిష్ఠ స్థాయికి చేరిందని ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ అతను చక్రవర్తి పేర్కొన్నారు. ఇంతకన్నా తగ్గడానికి అవకాశం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిసెంబరు, జనవరిలో మౌలిక పరిశ్రమల్లో వృద్ధి నమోదైందని, తయారీ రంగంలో మెరుగైన పరిస్థితి ఇందుకు దోహదపడిందని చెప్పారు. వ్యవసాయం, సర్వీసుల రంగాల్లో పురోగతి వృద్ధికి దోహదపడుతుందన్నారు.

Updated Date - 2020-02-29T06:59:51+05:30 IST