గాడి తప్పిన జీసీసీ

ABN , First Publish Date - 2021-12-08T06:13:35+05:30 IST

గిరిజన సహకార సంస్థ (జీసీసీ)లో పాలన గాడితప్పింది. సంస్థ ప్రగతి ఎవరికీ పట్టడం లేదు. ఇక్కడ మాతృసంస్థ ఉద్యోగులు కాకుండా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వారే అజమాయిషీ చేస్తున్నారు.

గాడి తప్పిన జీసీసీ
తేనె, జీడిపప్పు వంటి సరకులు లభించని జీసీసీ స్టాల్‌(ఎంవీపీ రైతుబజారు)

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

సిబ్బంది ఆడింది ఆట...పాడింది పాట

కొత్త ఉత్పత్తులకు చెల్లుచీటీ

డీలర్లకు సరఫరా కాని సరకులు

రెండు నెలలుగా కనిపించని తేనె

ఏటా ఆలస్యంగా కాఫీ కొనుగోళ్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గిరిజన సహకార సంస్థ (జీసీసీ)లో పాలన గాడితప్పింది. సంస్థ ప్రగతి ఎవరికీ పట్టడం లేదు. ఇక్కడ మాతృసంస్థ ఉద్యోగులు కాకుండా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వారే అజమాయిషీ చేస్తున్నారు. గత రెండేళ్లలో కీలకమైన పోస్టుల్లోకి కొత్త అధికారులు వచ్చారు. అయితే...కరోనా పేరు చెప్పి కార్యాలయానికి రావడం తగ్గించేశారు. క్షేత్ర పర్యటనలకు వెళ్లడం మానుకున్నారు. ఏకంగా రాష్ట్ర స్థాయి కార్యాలయంలోకి ఎవరూ లేకుండా ప్రధాన గేట్లు మూసేయించారు. దాంతో సిబ్బంది ఆడింది ఆట...పాడింది పాటగా సాగుతోంది.   


ఏవీ ఆ ఉత్పత్తులు ?

ఇంతకు ముందు ఈ సంస్థలో పనిచేసిన మేనేజింగ్‌ డైరెక్టర్లు...ఏజెన్సీలో గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన వాటితో కొత్త తరహా ఆహార ఉత్పత్తులు తయారుచేసి, వాటిని మోడరన్‌ ప్యాకింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేసేవారు. వాటికి విస్తృత ప్రచారం చేసేవారు. ఒకప్పుడు అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి నాటి ముఖ్యమంత్రే బ్రాండ్‌ అంబాసిడార్‌గా వ్యవహరించారు. ఎక్కడికి వెళ్లినా అరకు కాఫీ ఘుమఘుమలాడేది. ఇప్పుడు కొత్త ఉత్పత్తులు తేవడం లేదు సరికదా....పాతవి కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఎండీ బాబూరావునాయుడు పనిచేసిన సమయంలో ఏజెన్సీలో విరివిగా లభించే పనసతో జామ్‌, హల్వా, చిప్స్‌ తయారుచేసి విక్రయాలు ప్రారంభించారు. ఇప్పుడు అవి కనిపించడం లేదు. అలాగే నన్నారి, బిళ్లా షర్బత్‌లు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారుచేసేవారు. ఇడ్లీలు తయారుచేసి బీచ్‌ రోడ్‌లో జీసీసీ కార్యాలయం ముందే విక్రయించేవారు. సాయంత్రం అయితే అక్కడ విపరీతమైన రద్దీ ఉండేది. అవన్నీ ఇప్పుడు కనిపించడం లేదు. 


తేనె ఆర్డర్‌ తెస్తే...సరఫరా చేసే దిక్కులేదు

జీసీసీకి చైర్‌పర్సన్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన స్వాతిరాణి సంస్థ విక్రయాలు పెంచాలని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో చర్చించి, తిరుమలలో శ్రీవారి సేవలకు ఉపయోగించే తేనెను జీసీసీ నుంచి తీసుకోవాలని కోరారు. అయితే వారికి సరఫరా చేసేందుకు తేనె అందుబాటులో లేదు. మార్కెట్‌లోని జీసీసీ దుకాణాల్లో కూడా తేనె దొరకడం లేదు. ప్రజల నుంచి అత్యంత డిమాండ్‌ కలిగిన ఉత్పత్తులను సేకరించి, సరఫరా చేయాల్సిన బాధ్యత అధికారులదే. చేతిలో ఆర్డర్‌ ఉన్నా...సరఫరా చేయలేకపోతున్నారంటే...పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సేకరణ, అదనపు విలువల జోడింపు, సరఫరానే జీసీసీలో కీలకం. వీటిపై నిత్యం పర్యవేక్షణ ఉండాలి. కానీ వాటిపై పెద్దగా కసరత్తు జరగడం లేదంటున్నారు.


లక్ష్యాలన్నీ అరకొరే..!

జీసీసీ వాపును చూపించి బలుపని నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది. టర్నోవర్‌ పెరిగిందంటూ తప్పుడు లెక్కలు ప్రదర్శిస్తోంది. ఏజెన్సీలో పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీల విక్రయాలను లెక్కల్లో చేర్చి టర్నోవర్‌ ఎక్కువైందని చెబుతున్నారు. పెట్రోల్‌ అమ్ముకునేది ఆయిల్‌ కంపెనీలు. వాటి ద్వారా కమీషన్‌ మాత్రమే వస్తుంది. అదే జీసీసీ ఆదాయం. అలాగే గ్యాస్‌ సిలిండర్ల విక్రయం సొమ్ము జీసీసీది కాదు. అందులో వచ్చేది కూడా కమీషనే. ఏజెన్సీల్లో గిరిజనుల నుంచి సేకరించాల్సిన అటవీ ఉత్పత్తుల లక్ష్యం ఎంత? సాధించింది ఎంత? అనేదే ముఖ్యం. అలాగే కాఫీకి కూడా ప్రత్యేకంగా లెక్కలు చూపించాలి.


ఈ ఆర్థిక సంవత్సరం 2021-22 తీసుకుంటే...రూ.54.92 కోట్ల విలువైన అటవీ ఉత్పత్తులను సేకరించాలి. అక్టోబరు నెలాఖరు వరకు లెక్కలు పరిశీలిస్తే...రూ.6.44 కోట్లు లక్ష్యం కాగా అందులో రూ.2.7 కోట్లు మాత్రమే సాధించారు. ఇక రూ.15 కోట్ల విలువైన కాఫీ గింజలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ నెలలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. సీజన్‌లో సరకు సంతలకు వచ్చే సమయానికి రేటు నిర్ణయించి, దళారుల కంటే ముందు కొనాలనేది జీసీసీ లక్ష్యం. కానీ గత రెండేళ్లుగా ఇలాంటి నిర్ణయాలన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి. సీజన్‌ సగం అయిపోయిన తరువాత నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. దాంతో లక్ష్యాల సాధనలో వెనకబడిపోతున్నారు. అమరావతిలోని అధికారులు కూడా పట్టనట్టుగానే ఉంటున్నారు. 

Updated Date - 2021-12-08T06:13:35+05:30 IST