గడపే దాటని ‘గజిట్‌’

ABN , First Publish Date - 2022-09-23T10:54:27+05:30 IST

గడపే దాటని ‘గజిట్‌’

గడపే దాటని ‘గజిట్‌’

కృష్ణా, గోదావరి బోర్డులపై తేల్చలేదు!.. ప్రాజెక్టుల్నీ నియంత్రణలోకి తీసుకోలేదు

ఏడాది కాలంగా సమావేశాలతోనే సరి.. 17న నీటి యాజమాన్య బోర్డు భేటీ


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): గోదావరి, కృష్ణా నదులపై ఏపీ, తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటామంటూ కేంద్రం ఇచ్చిన గజిట్‌ ఏడాది అయినా అమలులోకి రాలేదు. సమావేశాలు నిర్వహించడం మినహా, స్వాధీన ప్రక్రియను ప్రారంభించలేదు. గతేడాది జూలై 16న హడావిడిగా తెలుగు రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు స్వాధీనం చేసుకుంటాయంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గజిట్‌ జారీ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య నీటియుద్ధాలకు ఇక బ్రేక్‌ పడుతుందని నిపుణులు కూడా భావించారు. గజిట్‌ అమలైతే ప్రాజెక్టులన్నీ కేంద్రం నియంత్రణలోనికి వెళ్లిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ..ఇప్పటివరకూ అలాంటి చొరవ కేఆర్‌ఎంబీ గానీ, జీఆర్‌ఎంబీ) గానీ ప్రదర్శించలేదు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఏపీ నిర్మించిన ప్రాజెక్టులను స్వాధీనపరచుకునేందుకు సన్నాహక సమావేశాలను బోర్డులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నదీ యాజమాన్య బోర్డు సమావేశాలు నాలుగు జరిగాయి. వచ్చేనెల 17న ఐదో సన్నాహక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌ జలసౌధలో ఉదయం 11గంటలకు కేఆర్‌ఎంబీ కార్యాలయం మీటింగ్‌ హాల్‌లో సమావేశం జరుగుతుందని రెండు రాష్ట్రాల జల వనరుల శాఖల ఇంజనీర్‌ ఇన్‌-చీ్‌ఫలకు నదీ యాజమాన్య బోర్డు సమాచారం అందించింది. ఇప్పటివరకూ చర్చిస్తూ వస్తున్న అజెండా అంశాలనే ఐదో నదీ యాజమాన్య బోర్డు సమావేశంలోనూ చర్చిస్తామని రాష్ట్రాలకు వెల్లడించింది. ఇలా ఏడాదిగా .. చర్చోపచర్చలతోనే కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల కాలహరణం చేస్తూ వస్తున్నాయేతప్ప, ప్రాజెక్టులను తమ ఆధీనంలోనికి తీసుకునేందుకు ఒక్క అడుగూ ముందుకు వేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. .ప్రాజెక్టులపై గజిట్‌ని విడుదలచేసి కేంద్రం తన పనైపోయిందనట్లుగా వ్యవహరించడంపై నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-09-23T10:54:27+05:30 IST