Jul 22 2021 @ 21:35PM

మనసును తాకేవి భావోద్వేగమైన పాత్రలే: గౌతమ్‌ మేనన్‌

ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మాణ సారథ్యంలో ‘నవరస’ పేరుతో ఆంథాలజీ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో హీరో సూర్య, ప్రయాగా రోజ్‌ మార్టిన్‌ కాంబినేషన్‌లో ‘గిటార్‌ కంబియిన్‌ మేలే నిండ్రు’ అనే భాగానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించారు. సుధీర్ఘకాలం తర్వాత సూర్య - గౌతమ్‌ మేనన్‌ కాంబినేషన్‌లో ఈ సిరీస్ వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 


తాజాగా ‘నవరస’ గురించి దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ స్పందిస్తూ.. ‘‘ఈ పాత్రకు నాకు మొదట కనిపించిన హీరో సూర్యనే. ఆయనను కాకుండా మరొకరిని ఊహించుకోలేదు. పైగా సూర్యతో పనిచేయడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ‘నవరస’తో మరోమారు ఆ అవకాశం లభించింది. అలాగే, హీరోయిన్‌ ప్రయాగా రోజ్‌ మార్టిన్‌ పాత్ర చాలాకాలం పాటు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. హీరో సూర్య పాత్రను ప్రత్యేకంగా డిజైన్‌ చేయడం జరిగింది. ఆయన పాత్రలో అనేక రకాలైన భావోద్వేగాలు కనిపిస్తాయి’’ అని తెలిపారు. కాగా, కోలీవుడ్‌కు చెందిన 40 మంది ప్రముఖ నటీనటులు, దర్శకులు, టాప్‌మోస్ట్‌ సాంకేతిక నిపుణులు కలిసి రూపొందించిన ఈ ‘నవరస’ ఆగస్టు 6న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ‘కోపం, కరుణ, ధైర్యం, అసహ్యం, భయం, హాస్యం, ప్రేమ, శాంతి, ఆశ్చర్యం’ అనే నవరసాల(మానవ భావోద్వేగాలు) ప్రధానాంశాలపై దృష్టిసారించి తొమ్మిది భాగాలుగా విభజించిన ఈ ఆంథాలజీ చిత్రాన్ని మద్రాస్‌ టాకీస్‌, క్యూబ్‌ సినిమా టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో సూర్య, ప్రయాగ, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో ప్రేమ విభాగాన్ని తెరకెక్కించారు.