అలా వచ్చిన డబ్బు విషంలాంటిదన్న బుద్ధుడు.. అయినా పట్టించుకోని వ్యక్తికి ఎటువంటి చిక్కులు ఎదురయ్యిందంటే..

ABN , First Publish Date - 2021-11-15T13:29:06+05:30 IST

ఒకరోజు బుద్ధ భగవానుడు అడవి గుండా వెళుతున్నాడు.

అలా వచ్చిన డబ్బు విషంలాంటిదన్న బుద్ధుడు.. అయినా పట్టించుకోని వ్యక్తికి ఎటువంటి చిక్కులు ఎదురయ్యిందంటే..

ఒకరోజు బుద్ధ భగవానుడు అడవి గుండా వెళుతున్నాడు. దారిలో ఒక వ్యక్తి నేలను తవ్వుతున్నాడు. బుద్ధుడు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. నేలను తవ్వుతున్న ఆ వ్యక్తికి ఒక లంకెబిందె దొరికింది. దానిలో వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి.  ఈరోజు నా అదృష్టం పండిందని మనసులో అనుకున్నాడు.  ఆ లంకెబిందెని బుద్ధుని పాదాల దగ్గర ఉంచి, ‘‘మీ ఆశీస్సుల వల్లే నాకు ఈ అపారమైన సంపద లభించింది.  నేను ఈ రత్నాలలో కొన్నింటిని మీకు సమర్పించాలనుకుంటున్నాను." అని అన్నాడు. దీనికి బుద్ధుడు సమాధానిమిస్తూ "మీకు దొరికిన సంపద ఇది. నా దృష్టిలో ఇది విషం లాంటిది.  కష్టపడకుండా సంపాదించిన డబ్బు విషంతో సమానమని’’ అన్నాడు. ఈ మాటలకు కోపగించిన వ్యక్తి ఆ లంకెబిందె తీసుకుని వెళ్లిపోయాడు. తరువాత వజ్రాలు, నగలు అమ్మి.. ఆస్తులు కొనుగోలు చేసి, పేదరికం నుంచి విముక్తిపొంది ధనవంతుడయ్యాడు. 


అయితే ఒక అసూయాపరుడు ఇతనిపై ఆ దేశపు రాజుకు ఫిర్యాదు చేశాడు.. "భూమిలో దొరికిన ఆ నిధి రాజుగారి ఖజానాకు దక్కుతుంది. ఆ నిధిని ఆ వ్యక్తి తన సొంతానికి వాడుకుని, నిబంధనలు అతిక్రమించాడు’’ అని ఫిర్యాదు చేశాడు. దీంతో రాజు ఆ వ్యక్తిని  అదుపులోకి తీసుకుని, లంకెబిందెను అప్పజెప్పాలని కోరాడు. అయితే ఆ వ్యక్తి తాను వజ్రాలు, నగలు అమ్మి ఆస్తులను కొనుగోలు చేశానని నిజం చెప్పాడు. రాజు ఆదేశాలమేరకు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను జైలుకు తరలించి, అతని ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. ఒకరోజు రాజు జైలుకు తనిఖీల కోసం వెళ్ళాడు.  అక్కడ లంకెబిందె లభ్యమైన వ్యక్తిని కూడా కలిశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి రాజుతో మాట్లాడుతూ.. ‘‘అయ్యా నేను భూమిలో నుండి లంకె బిందె తీసుకున్నప్పుడు బుద్ధుడు అక్కడే ఉన్నాడు. ఆ డబ్బు విషం లాంటిదని చెప్పాడు.  ఆ మాటలకు నేను బుద్ధుడిని అవమానించాను. అయితే ఈ రోజు జైలు శిక్ష అనుభవిస్తున్నందున.. బుద్ధుని మాటలు పూర్తిగా నిజమని నేను భావిస్తున్నాను.  కష్టపడకుండా దొరికేది విషం మాత్రమేనని గ్రహించాను. ఇప్పుడు  ఒకసారి నేను బుద్ధుని దర్శనం  చేసుకుని క్షమాపణలు కోరాలనుకుంటున్నానని’’ రాజుకు మొరపెట్టుకున్నాడు. ఈ మాటలు విన్న రాజుకు బుద్ధునిపై మరింత గౌరవం పెరిగింది. దీంతో బుద్ధుడిని రాజ్యానికి ఆహ్వానించాడు.  లంకెబిందె దొరికిన వ్యక్తిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి బుద్ధుడి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆ వ్యక్తి.. బుద్ధుడిని క్షమాపణలు కోరుతూ, నాడు మీరు చెప్పిన మాటలు నిజమేనని ఒప్పుకుంటున్నానని అన్నాడు. ఆ లంకెబిందెలో విషం ఉంది. అదే నన్ను జైలుకు పంపించిందన్నాడు. బుద్ధుని వినతి మేరకు ఆ రాజు అతన్ని జైలు నుంచి విడుదల చేశాడు.  ఆ వ్యక్తి ఆ రోజు నుంచి కష్టపడి సంపాదించిన డబ్బుతో జీవించడం ప్రారంభించాడు.

Updated Date - 2021-11-15T13:29:06+05:30 IST