అదానీ సంపద ఒకే రోజు రూ.65 వేల కోట్లు వృద్ధి

ABN , First Publish Date - 2022-04-12T21:40:25+05:30 IST

న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుల జాబితాలో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకున్నారు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.

అదానీ సంపద ఒకే రోజు రూ.65 వేల కోట్లు వృద్ధి

న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుల జాబితాలో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకున్నారు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ. ఏకంగా 118 బిలియన్ డాలర్ల సంపదతో  గూగుల్ వ్యవస్థాపకులు లార్రీ పేజ్, సెర్గీ బ్రిన్ లను అధిగమించి ప్రపంచ సంపన్నుల్లో 6వ స్థానాన్ని ఆక్రమించారు. గౌతమ్ అదానీ సంపద విలువ భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.8.98 లక్షల కోట్లు అని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ స్పష్టం చేసింది. మరో భారతీయ సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 97.4 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. అంబానీ కంటే అదానీ సంపద 20 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. 


షేర్ల జోరు.. సంపద హోరు

అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్ షేర్లు సోమవారం భారీగా వృద్ధి చెందాయి. దీంతో ఒక్కరోజే ఆయన సంపద విలువ ఏకంగా రూ.65,091 కోట్ల మేర ఎగబాకింది. మరోవైపు ఈ ఏడాది ప్రపంచంలో  అత్యధికంగా ఆర్జించిన వ్యక్తిగా అదానీ అందరికంటే ముందున్నారు. ఈ ఒక్క ఏడాది ఆయన సంపద విలువ ఏకంగా 41.6 బిలియన్ డాలర్ల(రూ.3.16 లక్షల కోట్లు) మేర పెరిగింది. కాగా అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ సోమవారం కీలకమైన మైలురాయిని అధిగమించింది. మార్కెట్ వాల్యూయేషన్ ప్రకారం.. రూ.4.22 లక్షల కోట్లతో టాప్ 10 విలువైన కంపెనీల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. కంపెనీ షేర్ ధర సోమవారం భారీగా పెరగడం ఇందుకు దోహదపడింది. 

Updated Date - 2022-04-12T21:40:25+05:30 IST