రోజుకు వెయ్యి కోట్ల సంపాదన .. ముఖేశ్ అంబానీ కంటే వేగంగా సంపద సృష్టించిన వీరెవరంటే..

ABN , First Publish Date - 2021-09-30T23:16:03+05:30 IST

రోజుకు వెయ్యి కోట్ల సంపాదన ..అంబానీని మించిపోయిన సంపద సృష్టించిన ఈ బిలియనీర్ ఎవరంటే..

రోజుకు వెయ్యి కోట్ల సంపాదన .. ముఖేశ్ అంబానీ కంటే వేగంగా సంపద సృష్టించిన వీరెవరంటే..

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మరో రికార్డు సృష్టించారు. భారత అపరకుబేరుల జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి నెం.2 ర్యాంక్ కైవసం చేసుకున్నారు. గతేడాది అదానీ, ఆయన కుటుంబ సభ్యులు రోజుకు సగటున వెయ్యి కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. భారత్‌లో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ కంటే కూడా వేగంగా అదానీలు సంపద సృష్టించారు. హురున్ ఇండియా తాజాగా ప్రకటించిన భారత అపరకుబేరుల జాబితాలో(ఐఐఎఫ్ఎల్ వెల్త్- హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2021) ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఎప్పటిలాగే ఈసారి కూడా తొలి స్థానంలో నిలిచారు. గత పదేళ్లుగా ఆయన వరుసగా నెం.1 స్థానంలోనే కొనసాగుతున్నారు. 


ఈ లిస్టు ప్రకారం భారత్‌లో మొత్తం 237 మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈమారు కొత్తగా 58 మంది బిలియనీర్లుగా మారారు. కొత్తగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్న వారిలో అధికశాతం మంది కెమికల్స్, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు చెందిన వారు కాగా.. ఫార్మా రంగం నుంచి అత్యధికంగా 130 మంది ఈ లిస్టులో స్థానం దక్కించుకున్నారు. 


ఇక తొలిస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ సంపద విలువ 7.18 లక్షల కోట్లు. నెం.2 స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ, ఆయన కుటుంబసభ్యుల నికర సంపద విలువ 5 లక్షల కోట్లు. అంతకుముందు 1.4 లక్షల కోట్లుగా ఉన్న అదానీల సంపద 2020-21లో 5.06 లక్షల కోట్లకు చేరింది. అదానీలు సగటున రోజుకు వెయ్యి కోట్ల సంపదను సృష్టించారు. కాగా.. ధనవంతుల సంఖ్య‌లో పెరుగుదల భారత్‌లో చోటుచేసుకుంటున్న ఆర్థికాభివృద్ధిని ప్రతిఫలిస్తోందని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రిసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-30T23:16:03+05:30 IST