అదానీకి ఝలక్‌!

ABN , First Publish Date - 2021-06-15T09:09:21+05:30 IST

పశ్చిమ, తూర్పు తీరాల్లోని కీలక రేవులను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ... శరవేగంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ... ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిపోతున్న ‘అదానీ’ గ్రూప్‌కు పెద్ద షాక్‌ తగిలింది.

అదానీకి ఝలక్‌!

గ్రూప్‌ సంపద ఒక్కరోజులో రూ.54వేల కోట్లు మైనస్‌

పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐల ఖాతాలు ఫ్రీజ్‌

ఆ 3 ఎఫ్‌పీఐలకు రూ.43,559 కోట్ల విలువైన అదానీ షేర్లు

అదానీ గ్రూప్‌ సంపద వృద్ధిలో వేగానికి కారణమేమిటి?

పీఎంఎల్‌ఏ నిబంధనల ఉల్లంఘనపై సెబీ ఆరా!?

‘ఫ్రీజ్‌’ వార్తలను ఖండించిన అదానీ.. తప్పుడు వార్తలని వెల్లడి


న్యూఢిల్లీ, జూన్‌ 14: పశ్చిమ, తూర్పు తీరాల్లోని కీలక రేవులను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ... శరవేగంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ... ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిపోతున్న ‘అదానీ’ గ్రూప్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆసియాలో రెండో అతిపెద్ద కుబేరుడిగా అవతరించిన గౌతమ్‌ అదానీ గ్రూప్‌ సంపద... ఒక్కరోజులోనే దాదాపు రూ.54 వేల కోట్లు హరించుకుపోయింది. స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా షేక్‌ అయ్యింది. దీనికి కారణం... అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు కంపెనీల్లో వాటాలున్న మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) డీమ్యాట్‌ ఖాతాలను నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌) స్తంభింప చేయడమే! అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ల ఖాతాలను మే 31వ తేదీన లేదా అంతకుముందే ‘ఫ్రీజ్‌’ చేసినట్లు సోమవారం ఒక ప్రముఖ దినపత్రిక సంచలన కథనం ప్రచురించింది. అదానీ కంపెనీల్లో ఈ మూడు ఎఫ్‌పీఐలకు ఏకంగా రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉండటం గమనార్హం. ఖాతాలు స్తంభింప చేసినందున ఆ విదేశీ ఫండ్లు తమ అకౌంట్‌ ద్వారా షేర్లను విక్రయించడం లేదా కొత్తగా షేర్లను కొనుగోలు చేయడం కుదరదు. దీంతో... సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టాయి. 


షేర్లు భారీగా పతనం

గ్రూప్‌ కంపెనీల్లో భారీగా వాటాలు కలిగిన ఎఫ్‌పీఐల డీమ్యాట్‌ అకౌంట్లను ఫ్రీజ్‌ చేశారన్న వార్తలతో అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ధర ఒక దశలో ఏకంగా 25 శాతం మేర క్షీణించింది. గ్రూప్‌లోని మిగతా కంపెనీల షేర్లు కూడా లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. షేర్ల భారీ పతనంతో అదానీ గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఇంట్రాడేలో రూ.లక్ష కోట్లకు పైగా హరించుకుపోయింది. ఆ కథనం అవాస్తవమని, ఎఫ్‌పీఐల  ఖాతాలను స్తంభింప చేయలేదని అదానీ నుంచి వివరణ రావడంతో... పరిస్థితి కొంచెం మెరుగైంది. అయినప్పటికీ... అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ ఒక్కరోజులో 54వేల కోట్లు హరించుకుపోయింది. శుక్రవారం గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.9.51 లక్షల కోట్లు కాగా... సోమవారం ట్రేడింగ్‌ నిలిచేసరికి అది రూ.8.97 లక్షల కోట్లుగా నమోదైంది.


సెబీ ఆరా!

అదానీ గ్రూప్‌ కంపెనీల్లో అనామక విదేశీ ఫండ్ల పెట్టుబడులకు సంబంధించి క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. మనీ లాండరింగ్‌ నిరోధక చట్ట(పీఎంఎల్‌ఏ) నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే, అదానీ షేర్లు ఈ ఏడాది కాలంలో విదేశీ పెట్టుబడుల దన్నుతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాయి. 200 శాతం నుంచి 1000 శాతం వరకు పెరిగాయి. ‘ఈ అసాధారణ పురోగతికి సరైన కారణాలే ఉన్నాయా? లేక... కావాలనే షేర్ల ధరలను ప్రభావితం చేశారా?’ అనే కోణంలోనూ ‘సెబీ’ విచారణ జరుపుతోంది. 


ఎన్నో అనుమానాలు!

అదానీ గ్రూప్‌లో వెస్పెరా ఫండ్‌, ఎలారా ఇండియా ఆపర్చూనిటీస్‌, అల్బులా ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌,  ఏపీఎంస్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌, ఏషియా ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌, ఎల్‌టీఎస్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ వంటి ఎఫ్‌పీఐలకు భారీగా వాటాలున్నాయి. ఇందులో చాలావరకు మారిష్‌సకు చెందినవే. కొన్ని క్రియాశీలకంగా కూడా లేవు. కనీసం సొంత వెబ్‌సైట్‌ కూడా లేని ఈ ఫండ్స్‌ ఒకే చిరునామాతో రిజిస్టర్‌ అవడం పలు సందేహాలకు తావిస్తోంది. బ్లూంబర్గ్‌ డేటా ప్రకారం... అల్బులా ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌లు తమ మొత్తం పెట్టుబడుల్లో 95 శాతం అదానీ గ్రూప్‌ కంపెనీల్లోనే పెట్టాయి. క్రెస్టా ఫండ్‌ 97.7 శాతం, ఏషియా ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌ 99 శాతం, వెస్పెరా ఫండ్‌ 98 శాతం అదానీ గ్రూప్‌లలోనే ఇన్వెస్ట్‌ చేశాయి.


ఎందుకు ఫ్రీజ్‌ చేశారు?

పీఎంఎల్‌ఏ నిబంధనలకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెబీ’ 2019లో ఎఫ్‌పీఐల కేవైసీ డాక్యుమెంటేషన్‌లో మార్పులు చేసింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా కేవైసీని పూర్తి చేసేందుకు 2020 వరకు సమయమిచ్చింది. మారిన నిబంధనల ప్రకారం ఎఫ్‌పీఐలు సెబీకి తమ పెట్టుబడులపై ఉమ్మడి యాజమాన్య హక్కులు, ఫండ్‌ మేనేజర్లతోపాటు కీలక ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను సైతం వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించనందునే మూడు ఎఫ్‌పీఐల ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు సమాచారం!


‘ఫ్రీజ్‌’ అవాస్తవం: అదానీ 

ఎఫ్‌పీఐల డీమ్యాట్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేశారన్న వార్తా కథనాన్ని అదానీ గ్రూప్‌ ఖండించింది. అది తప్పుడు వార్త అని, మార్కెట్‌ వర్గాలను తప్పుదోవ పట్టించేలా ఉందని సోమవారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. ‘‘ఆ మూడు ఎఫ్‌పీఐల ఖాతాలను స్తంభింపజేయలేదని డిపాజిటరీ రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌ సోమవారం మాకు లిఖితపూర్వకంగా ధ్రువీకరించింది’’ అని అదానీ గ్రూప్‌ తెలిపింది. ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌లో మాత్రం ఆ మూడు ఎఫ్‌పీఐల డీమ్యాట్‌ ఖాతాలు ఫ్రీజ్‌ చేసినట్లుగానే ఉంది. 



Updated Date - 2021-06-15T09:09:21+05:30 IST