Siddipet: గౌరవెళ్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులకు కొత్త కష్టాలు

ABN , First Publish Date - 2022-07-01T17:03:15+05:30 IST

గౌరవెళ్లి రిజర్వాయర్ (Gలuravelli Reservoir) భూ నిర్వాసితులకు కొత్త కష్టాలు ఎదురౌతున్నాయి.

Siddipet: గౌరవెళ్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులకు కొత్త కష్టాలు

సిద్దిపేట (Siddipet): జిల్లాలో గౌరవెళ్లి రిజర్వాయర్ (Gలuravelli Reservoir) భూ నిర్వాసితులకు కొత్త కష్టాలు ఎదురౌతున్నాయి. అరెస్టులు, కేసులతో బాధితులు సతమతమవుతున్నారు. పోలీసులు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర జరిగిన ఘర్షణలో పోలీసులు కేసు నమోదు చేశారు. తమను ఉగ్రవాదుల మాదిరిగా సంకేళ్లు వేసి కోర్టులో హాజరుపర్చడంపై నిర్వాసితులు మండిపడుతున్నారు. భూ నిర్వాసితులకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం చేస్తే.. తమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.


గత నెల 14వ తేదీన హుస్నాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు, భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట, లాఠీచార్జిలో 17 మంది భూ నిర్వాసితులపై కేసులు నమోదు చేశారు. ఇందులో బద్దం శంకర్‌రెడ్డి, అంగెటి తిరుపతిరెడ్డి, రాగి శ్రీను, భూక్య సక్రూలను అరెస్ట్‌ చేసి కరీంనగర్‌ జైలుకు తరలించారు. 


కాగా గురువారం పోలీసులు వారి చేతులకు సంకెళ్లు వేసి హుస్నాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. వారి రిమాండ్‌ను జడ్జి మరో 14 రోజులకు పొడిగించారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు, భూ నిర్వాసితులకు మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు కేవలం తమపైనే కేసులు నమోదు చేసి  కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని నిర్వాసిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దొంగతనం, సంఘ విద్రోహులు, హత్యనేరం చేసిన నిందితుల్లాగా భూ నిర్వాసితులకు సంకెళ్లు వేస్తారా..? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు డాక్యుమెంట్లు కోర్టులో సబ్మిట్‌ చేయకపోవడంతో తమ వాళ్లకి బేయిల్‌ రావడం లేదని వాపోయారు.

Updated Date - 2022-07-01T17:03:15+05:30 IST