Abn logo
Apr 3 2021 @ 18:55PM

గట్టు శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా!

హైదరాబాద్: వైసీపీ ఇక తెలంగాణ‌లో జెండా పీకేసేలా క‌నిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం త‌ర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల్లో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాల‌ను వైసీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు బీ టీమ్‌గా మారిపోయింది. ఏపీలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ఏ ఒక్క కార్య‌క్ర‌మం కూడా చేయ‌లేదు. 2019లో ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకొచ్చాక‌... తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాల‌ను కొన‌సాగించ‌డం మొద‌లుపెట్టారు. ఇక్క‌డ ఏమైనా పార్టీ త‌రుపున కార్య‌క్ర‌మాలు చేసినా అది గులాబీ బాస్‌కు అడ్డుగా ఉంటుంద‌న్న సాకుతో జ‌గ‌న్, పార్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి.

తెలంగాణ‌లో ఇక పార్టీ యాక్టివ్‌గా ఉండ‌ద‌ని, పార్టీ పేరుతో కార్య‌క్ర‌మాలు చేయ‌డం వృథా అని... ఎక్క‌డైనా అవ‌కాశాలు ఉంటే చూసుకొండంటూ గ‌త ఏడాదిగా తెలంగాణ వైసీపీ క్యాడ‌ర్‌కు ప్రభుత్వ సలహాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి, జ‌గ‌న్ చెప్పిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ నుంచి జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఏపీకి వెళ్లిన ప్ర‌తి సారి తెలంగాణ నేత‌ల‌కు చేదు అనుభ‌వం ఎదుర‌య్యేద‌ట‌. క‌లిసేందుకు జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని చ‌ర్చ జ‌రిగేది. ఇక లాభం లేద‌నుకున్న వైసీపీ నేతలు త‌మ‌కు న‌చ్చిన పార్టీలోకి వెళ్లిపోయారు. ఇంతలోనే తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల పెట్టబోతున్న పార్టీ వారికి వేదిక‌గా మారింది. వైసీపీలో కీల‌కంగా పనిచేసిన కొండా రాఘ‌వ‌రెడ్డి, పిట్టా రాంరెడ్డి లాంటి నాయ‌కులు ష‌ర్మిల అనుచరులుగా మారారు. 

అయితే తెలంగాణ‌ వైసీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీకాంత్‌రెడ్డి మాత్రం జగన్‌వైపే చూస్తూ ఉండిపోయారు. ఇంతకాలం వేచిచూసిన ఆయన చివరకు వైసీపీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. తెలంగాణలో వైసీపీని విస్తరించే ఆలోచన లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బరువెక్కిన గుండెతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు ప్రకటించారు. అన్నా చెల్లెళ్ల మ‌ద్య రాజ‌కీయ వైరుధ్యాన్ని ప‌క్క‌న పెడితే ...దిక్కూ దివాన లేకుండా పోయిన వైసీపీ క్యాడ‌ర్‌కు ష‌ర్మిల పార్టీ ఊపిరిపోసిన‌ట్ల‌య్యింది. అయితే క్యాడ‌ర్ అంతా ష‌ర్మిల పార్టీలోకి వ‌చ్చినా గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి మాత్రం ష‌ర్మిల పార్టీలోకి చేరేందుకు ఎందుకు రాలేద‌న్న చ‌ర్చ జ‌రిగింది. తాజాగా తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని... ఇక్క‌డ వైసీపీకి మ‌నుగ‌డ లేద‌ని త‌మ కేంద్ర న్యాయ‌కత్వం ఇక్క‌డ పార్టీని మ‌ల్లి విస్త‌రించే ఆలోచ‌న లేద‌ని... ఇక జెండా పీకేసిన‌ట్లుగానే గ‌ట్టు శ్రీకాంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిగా మారింది. త్వరలోనే తాను జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాదు.. భవిష్యత్తులో జాతీయ పార్టీ తరఫునే హుజుర్ నగర్‌ ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.