జవాద్‌ నుంచి గట్టెక్కేదెలా..?

ABN , First Publish Date - 2021-12-04T06:13:12+05:30 IST

జవాద్‌ తుఫాన్‌పై రైతులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. దిగుబడికి వచ్చిన పంట దెబ్బతింటుందని దిగాలు చెందుతున్నారు. వ్యయప్రయాసాలకోర్చి పండించిన పంటను కాపాడుకోవడానికి పొలాలకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.

జవాద్‌ నుంచి గట్టెక్కేదెలా..?
రావికమతం మండలం గుమ్మాళ్లపాడులో కోసిన వరి పనలు ఎత్తుతున్న రైతులు

తుఫాన్‌పై సర్వత్రా ఆందోళన

వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటాయని గుబులు

పొలాలకు పిల్లాపాపలతో రైతుల పరుగులు

వరి పనల రక్షణకు విస్తృత ప్రయత్నాలు


బుచ్చెయ్యపేట, డిసెంబరు 3: జవాద్‌ తుఫాన్‌పై రైతులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. దిగుబడికి వచ్చిన పంట దెబ్బతింటుందని దిగాలు చెందుతున్నారు. వ్యయప్రయాసాలకోర్చి పండించిన పంటను కాపాడుకోవడానికి పొలాలకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. కోత కోసిన వరి పనలను ఒడ్డుకు చేరేందుకు శ్రమకోడ్చుతున్నారు. కొంత మంది పొలాల్లోనే కుప్పలు వేస్తుండగా, మరి కొందరు ట్రాక్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

మండలంలో ఈ ఏడాది ఆరు వేల ఎకరాల్లో వరి, నాలుగు వేల ఎకరాల్లో చెరకు సాగు చేశారు. పంటలు కూడా ఆశాజనకంగా పండడంతో ఎంతో ఆనందపడ్డారు. ఈ క్రమంలో జవాద్‌ తుఫాన్‌ ముప్పు ముంచుకురావడంతో పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. 500 ఎకరాల్లో వరి కోతలు కోయగా, పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కోసిన వరి పనలు ఆరకముందే పొలాలు, కళ్లాల్లో కుప్పలు పెడుతున్నారు. మరి కొంత మంది రైతులు ట్రాక్టర్ల ద్వారా ఇళ్లకు తరలిస్తున్నారు. తుఫాన్‌ కారణంగా కోతలు వాయిదా వేసుకున్న 5500 ఎకరాల్లో వరి తుఫాన్‌కు దెబ్బతింటుందని భయాందోళనకు గురవుతున్నారు. ఈదురు గాలులు వీస్తే వరితో పాటు చెరకు పంట దెబ్బతింటుందని రైతులు దిగాలు పడుతున్నారు. చెరకు నెలకొరిగితే 40 శాతం దిగుబడులు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ క్రషింగ్‌ ప్రారంభించకపోవడంతో చెరకు నెలకొరిగితే రస నాణ్యత తగ్గిపోతుందని వాపోతున్నారు. జవాద్‌ తుఫాన్‌తో నష్టాలు చవిచూడాల్సి వస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవడం తథ్యమని రైతులు వాపోతున్నారు.


పిల్లాపాపలతో పొలాల్లోనే...

రావికమతం: జవాద్‌ తుఫాన్‌ నుంచి గట్టెక్కడానికి రైతులు పిల్లాపాపలతో పొలాల్లోనే అష్టకష్టాలు పడుతున్నారు. కోసిన వరి చేలును కాపాడుకోవడానికి మూడు రోజులుగా ఇళ్ల నుంచి పొలాలకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా తెల్లారగానే ఇంటిల్లిపాదీ పొలాలకు వెళ్లిపోతున్నారు. రావికమతం, చినపాచిల, గుమ్మాళ్లపాడు, దాసరియ్యపాలెం, గర్నికం, మేడివాడ, దొండపూడి, మర్రివలస, కొత్తకోట తదితర గ్రామాల్లో బాగా పండిన పంటను కోసి మడుల్లోనే ఆరబెట్టారు. ఇప్పుడు దాన్ని రక్షించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ట్రాక్టర్లతో వరి పనలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతుండగా, ఇంకా పొలాల్లో పెట్టిన కుప్పల్లో వర్షపు నీరు చేరకుండా మట్టితో కప్పుతున్నారు. 


Updated Date - 2021-12-04T06:13:12+05:30 IST